హవ్వ.. పాక్ ను వెంటేసుకుని తిరిగే చైనాతో దోస్తీనా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇష్టానుసారంగా టారిఫ్ విధిస్తూ భారత్ ను బెంబేలెత్తిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైనే అందరి దృష్టీ నిలిచింది. ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? తదుపరి చర్యలు ఎలా ఉండబోతోన్నాయనేది చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల మధ్య ట్రంప్ కు చెక్ పెట్టనున్నారు ప్రధాని మోదీ. శత్రుదేశం చైనాతో మిత్రత్వాన్ని పెంపొందించుకుంటోన్నారు.
మోదీ చేపట్టిన ఈ చైనా పర్యటన, ఆ దేశాధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్ తో ద్వైపాక్షిక చర్చలపై విమర్శలు తలెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. చైనా దురాక్రమణ, బెదిరింపులు.. కేంద్ర ప్రభుత్వ వెన్నెముక లేని వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తింది. భారత్- చైనా సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది.

మోదీ చైనా పర్యటనపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి జైరామ్ రమేష్ పలు ప్రశ్నలు సంధించారు. 2020 జూన్‌లో గాల్వాన్ లోయలో చైనా జరిపిన దురాక్రమణను దృష్టిలో ఉంచుకొని ప్రధాని మో, గ్ఝి జిన్‌పింగ్‌ల భేటీని విశ్లేషించాలని డిమాండ్ చేశారు. ఆ దురాక్రమణలో 20 మంది జవాన్లు తమ ప్రాణాలను త్యాగం చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. 2020 జూన్ 19న చైనా దురాక్రమణను మర్చిపోయి, ప్రధాని మోదీ చైనాకు క్లీన్ చిట్ ఇవ్వడం సహేతుకం కాదని అన్నారు.
లడఖ్‌లో చైనాతో సరిహద్దులో యథాస్థితిని పూర్తిగా పునరుద్ధరించాలని ఇటీవలి కాలంలోనే ఆర్మీ చీఫ్ డిమాండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా జైరామ్ రమేష్ గుర్తు చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నప్పటికీ చైనాతో కేంద్ర ప్రభుత్వం ఎలా సయోధ్యను కుదుర్చుకుందని ప్రశ్నించారు. చైనా దురాక్రమణను చట్టబద్ధం చేసినట్టయిందని అన్నారు.
2025 జూలై 4న, డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్, ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్‌తో చైనా జుగల్బందీ గురించి ధైర్యంగా, స్పష్టంగా మాట్లాడారు అని జైరామ్ రమేష్ తెలిపారు. దీని గురించి మాట్లాడకోవడం వల్ల దీన్ని అంగీకరించినట్టయిందని ధ్వజమెత్తారు. పాకిస్తాన్ కు ఆప్తమిత్రుడైన చైనాకు రాచమర్యాదలు చేయడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని ఆంందోళన వ్యక్తం చేశారు.
యార్లుంగ్ త్సాంగ్పో నదిపై చైనా భారీ జల విద్యుత్ ప్రాజెక్టును ప్రకటించిందని, ఇది ఈశాన్య రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని జైరామ్ రమేష్ పేర్కొన్నారు. దీనికి ఎలా సమాధానం చెబుతారని జైరామ్ రమేష్ నిలదీశారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడలేదని, చైనా నుండి దిగుమతుల డంపింగ్ వ్యవహారం మన దేశ సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను నాశనం చేస్తూనే ఉందని విమర్శించారు.












Click it and Unblock the Notifications