కాంగ్రెస్‌కు జై కొట్టిన హైదరాబాద్-కర్ణాటక: తెలంగాణలో..!!
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీని అందుకుంది. తాజా సమాచారం ప్రకారం- 136 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఇందులో పలు నియోజకవర్గాల్లో విజయం సాధించారు. అధికార భారతీయ జనతా పార్టీ 63 నియోజకవర్గాలకే పరిమితమైంది. పలువురు మంత్రులు ఓటమిపాలయ్యారు.
కర్ణాటకలో విజయం సాధించడానికి కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా శ్రమించింది. ఏఐసీసీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గె, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య.. పార్టీ శ్రేణులకు సరైన దిశానిర్దేశం చేయగలిగారు. హైకమాండ్ మొదలుకుని కిందిస్థాయి కార్యకర్త వరకు క్యాడర్‌ను సమన్వయం చేసుకోగలిగారు.

కర్ణాటకలోని వేర్వేరు రీజియన్లలో కూడా కాంగ్రెస్ హవా వీచింది. హైదరాబాద్- కర్ణాటక సహా అన్ని ప్రాంతాల్లోనూ బీజేపీ కంటే మెజారిటీ సీట్లను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోగలిగింది. 29 నియోజకవర్గాలు ఉన్న హైదరాబాద్-కర్ణాటకలో కాంగ్రెస్-16, బీజేపీ-10, జేడీఎస్-3 స్థానాలను గెలుచుకున్నాయి. ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట కలిగించినట్టయిందనే అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌పై సానుకూల ప్రభావం ఉంటుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
34 స్థానాలు ఉన్న సెంట్రల్ కర్ణాటకలో కాంగ్రెస్‌దే ఆధిపత్యం. ఇక్కడ 24 సీట్లు కాంగ్రెస్ వశం అయ్యాయి. బీజేపీ-7, జేడీఎస్-3 గెలుచుకున్నాయి. కోస్టల్ కర్ణాటక రీజియన్‌లో మాత్రమే బీజేపీ కొంత పైచేయిని సాధించగలిగింది. ఈ రీజియన్‌లో మొత్తం 21 నియోజకవర్గాలు ఉండగా.. 14 చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్-6, జేడీఎస్-1 స్థానాన్ని గెలుచుకున్నాయి.
ముంబై-కర్ణాటక రీజియన్‌లో కాంగ్రెస్ ప్రభంజనం కనిపించింది. ఇక్కడున్న 50 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 31 చోట్ల ఘన విజయం సాధించారు. బీజేపీ-17, జేడీఎస్-2 చోట్ల గెలిచాయి. దక్షిణ కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ బీజేపీ కంటే కూడా జేడీఎస్‌కు అధిక స్థానాలు దక్కాయి. కాంగ్రెస్-25, జేడీఎస్-14, బీజేపీ-8 స్థానాలను సాధించాయి.












Click it and Unblock the Notifications