కర్ణాటక ఎఫెక్ట్: దూకుడు పెంచిన కాంగ్రెస్, ఎందుకంటే?
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీలో మే 19వ తేది సాయంత్ర 4 గంటలకు ముఖ్యమంత్రి యడ్యూరప్ప బల పరీక్షను ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో చేయనున్నారు. అయితే ఎనిమిది దఫాలు ఎన్నికైన కాంగ్రెస్ పార్టీకి చెందిన దేశ్ పాండేను కాదని మూడు దపాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన బొపయ్యను ప్రొటెం స్పీకర్ గా నియమించడంపై కాంగ్రెస్, జెడి(ఎస్) నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై సుప్రీంకోర్టులో కాంగ్రెస్, జెడి(ఎస్)లు పిటిషన్ దాఖలు చేశాయి.
కర్ణాటక అసెంబ్లీలో బలనిరూపణ పరీక్ష అంతా ప్రొటెం స్పీకర్ పర్యవేక్షణలోనే సాగుతోంది. అయితే బొపయ్య గతంలో యడ్యూరప్ప సీఎంగా ఉన్న కాలంలో స్పీకర్ గా వ్యవహరించారు. ఆ సమయంలో యడ్యూరప్పకు అనుకూలంగా బొపయ్య వ్యవహరించారని కాంగ్రెస్, జెడి(ఎస్)లు ఆరోపిప్తున్నాయి. స్పీకర్ గా ఉన్న కాలంలో బొపయ్య వ్యవహరించిన తీరును 2011లో సుప్రీంకోర్టు తప్పు బట్టిన అంశాలను కూడ కోర్టులో కాంగ్రెస్ తరపు న్యాయవాదులు ప్రస్తావించారు.

బలనిరూపణ పరీక్షలో ప్రొటెం స్పీకర్ పాత్ర చాలా ముఖ్యమైంది. దీంతో కాంగ్రెస్, జెడి(ఎస్) నేతలు బొపయ్యను ప్రొటెం స్పీకర్ గా నియమించడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడుగా ముందుకు వెళ్తోంది.గతంలో ఇతర రాష్ట్రాల్లో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వ్యవహరిస్తున్నారు.
కర్ణాటకలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వనించడాన్ని నిరసిస్తూ సుప్రీం కోర్టును కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించడం కూడ ఇందులో బాగంగానే కన్పిస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అంతేకాదు కర్ణాటక రాష్ట్రంలో తీసుకొన్న నిర్ణయానికి మద్దతుగా ఆయా రాష్ట్రాల్లో కూడ అతి పెద్ద పార్టీలుగా ఉన్న పార్టీలు ప్రభుత్వ ఏర్పాటు కోసం అవకాశం కల్పించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం కూడ రాజకీయంగా ఆయా రాష్ట్రాల్లో రాజకీయ వేడిని రగిల్చింది.












Click it and Unblock the Notifications