మాజీ సీఎం ఇంటిపై దాడులు, కాంగ్రెస్ లీడర్స్ కు బెయిల్, ఆ ఫోటోలు వైరల్ !
బెంగళూరు/శివమొగ్గ: కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని శికారిపురలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ఇంటిపై రాళ్లదాడి చేసిన కేసులో అరెస్టు అయిన ముగ్గురు నిందితులకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్ల కారణంగా బంజారా సామాజికవర్గం తీవ్ర వివక్షకు గురవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని ఆ వర్గానికి చెందిన ప్రజలు ఆరోపించారు.
బంజారా సామాజిక వర్గానికి చెందిన ప్రజలు కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప ఇంటిపై రాళ్లతో దాడులు చేసిన విషయం తెలిసిందే.కేసు నమోదు చేసుకున్న పోలీసులు శికారిపుర కాంగ్రెస్ నేతలు రాఘవేంద్ర నాయక్, పునీత్ నాయక్, ప్రేమ్ కుమార్ నాయక్ లను అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా కేసును విచారించిన కోర్టు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా శికారిపురాలో జరిగిన రాళ్ల దాడిలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. శికారిపుర కాంగ్రెస్ నేతలు రాఘవేంద్ర నాయక్, పునీత్ నాయక్, ప్రేమ్ కుమార్‌లు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఇంటిపై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారని వారిని అరెస్ట్ చేశారు. పోలీసులపై రాళ్ల దాడిలో గాయాలు కావడంతో శికారిపుర పోలీస్ స్టేషన్‌లో పోలీసులు సుమోటో కేసు దాఖలు చేశారు. రాళ్లదాడిలో ఇద్దరు ఎస్‌ఐలతో పాటు ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు నిందితుల బెయిల్ పిటీషన్ విచారించిన శికారిపుర సీనియర్ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ముగ్గురికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నేతల అరెస్టు నేపథ్యంలో శికారిపుర తాలూకాలోని వివిధ బంజారా తాండాలతో సహా శివమొగ్గ జిల్లాలోని బంజారా నాయకులు తీవ్ర నిరసనలు చేపట్టారు. నిందితులకు బెయిల్ మంజూరు కావడంతో శికారిపురలో ఆందోళన సద్దుమణిగింది.

ఈ ముగ్గురు నిందితులు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ సీఎం బంగారప్ప కుమారుడు మధు బంగారప్పతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలతో ఉన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాజీ సీఎం బీఎస్, యడియూరప్ప ఇంటి మీదకు బంజారా కులానికి చెందిన కొందరిని కాంగ్రెస్ నేతలు ఉసిగొల్పినట్లు తెలుస్తోందని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications