పీఎంఓ సీనియర్ అధికారిగా గుజరాతీయుడి ఫోజులు- జెడ్ ప్లస్ సెక్యూరిటీతో టూర్లు
ప్రధానమంత్రి కార్యాలయ అధికారిగా జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగం మొత్తాన్నీ బురిడీ కొట్టించాడు కిరణ్ భాయ్ పటేల్ అనే వ్యక్తి. చివరికి అతణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కార్యాలయ అధికారిగా ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. వెళ్లిన ప్రతీచోటా జెడ్ ప్లస్ సెక్యూరిటీని నియమించుకున్నాడు. జమ్మూ కాశ్మీర్ లో చక్కర్లు కొట్టాడు. మంచుకొండల్లో విహరించాడు. అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ అక్కడి అధికారులతోనూ సమీక్షా సమావేశాలను నిర్వహించాడు. రెండు సార్లు జమ్మూ కాశ్మీర్ లో పర్యటించినప్పటికీ- అతను ఎవరనే విషయాన్ని గుర్తించలేకపోయారు పోలీసులు, భద్రత సిబ్బంది. మూడోసారి మళ్లీ కాశ్మీర్ కు వెళ్లి దొరికిపోయాడు.
ఆ వ్యక్తి పేరు కిరణ్ భాయ్ పటేల్. గుజరాత్ లోని అహ్మదాబాద్ అతని స్వస్థలం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారి అనే పేరును తగిలించుకున్నాడు. ప్రధానమంత్రి కార్యాలయ అధికారిగా ఫోజులు కొట్టాడు. గుజరాత్ కు చెందిన ఐఎఎస్ కావడం, పైగా పీఎంఓ సీనియర్ అధికారిగా తనను తాను పరిచయం చేసుకోవడంతో కాశ్మీర్ పోలీసులు చివరి నిమిషం వరకు అతడో మోసగాడని గుర్తించలేకపోయారు.

పర్యటన సందర్భంగా జమ్మూ కాశ్మీర్ లో జెడ్ ప్లస్ కేటగిరీతో పర్యటించాడు. అత్యంత సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలను సందర్శించాడు. జమ్మూ కాశ్మీర్ లో భారత్-పాకిస్తాన్ ను వేరు చేసే లైన్ ఆఫ్ కంట్రోల్, ఇంటర్నేషనల్ బోర్డర్ ఏరియాలోనూ అతను తిరుగాడాడు. అతను ఎవడనేది మాత్రం చివరి నిమిషం వరకు కనిపెట్టలేకపోయారు. మూడోసారి కాశ్మీర్ పర్యటనకు వెళ్లినప్పుడు అతని పప్పులు ఉడకలేదు.

శ్రీనగర్‌లోని ఒక 5- స్టార్ హోటల్ లో ఉంటూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న కిరణ్ భాయ్ పటేల్ ను ఎట్టకేలకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. అతణ్ని జ్యుడీషియరీ రిమాండ్ కు పంపించింది కోర్టు. అతనిపై మార్చి 2న చీటింగ్, ఫోర్జరీ సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి. ఆ మరుసటి రోజే కిరణ్ పటేల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రొటోకాల్ ప్రకారం- కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో పని చేసే అధికారుల ముందస్తు పర్యటన వివరాలు స్థానిక పోలీసులు, విమానాశ్రయం సిబ్బందికి తెలియజేస్తుంటారు. ఫలానా వ్యక్తి వస్తోన్నారంటూ వారికి ముందుగానే సమాచారం అందుతుంది. అలా ఈ నెల 2వ తేదీన శ్రీనగర్ ఎయిర్ పోర్టులో వీఐపీ ల్యాండ్ అవుతున్నారనే సమాచారం ఏదీ అధికారుల వద్ద లేదు. దీనితో అతనిపై అనుమానాలు ఏర్పడ్డాయి. దర్యాప్తు చేపట్టగా- కిరణ్ పటేల్ బండారం బయటపడింది.












Click it and Unblock the Notifications