పెద్ద కుట్రే జరుగుతోంది: ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి చేయడంపై లాలూ..
న్యూఢిల్లీ: ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ను ఎయిమ్స్ నుంచి తరలించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని వెనకాల ఏదో కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. లాలూ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు కాబట్టే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తున్నామని ఓవైపు వైద్యులు వెల్లడించగా.. తనను బలవంతంగా డిశ్చార్జి చేశారని లాలూ ఆరోపించడం గమనార్హం.
తన ఆరోగ్యం విషయంలో రాజకీయాలకు పాల్పడుతున్నారని, సగం చికిత్స మాత్రమే అందించి రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నారని లాలూ అన్నారు. తనను రాంచీకి తరలించడం వెనుక పెద్ద కుట్ర ఉందని, తన ఆరోగ్యం క్షీణించడానికే ఎయిమ్స్ నుంచి రిమ్స్ కు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇదంతా తనకు ఇబ్బందికర పరిస్థితే అయినా... భరించడానికి సిద్దంగా ఉన్నానని పేర్కొన్నారు.

వాగ్వాదం:
లాలూను ఎయిమ్స్ నుంచి రాంచీకి తరలించే క్రమంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ పోలీస్ అధికారి లాలూను వెనక్కి వెళ్లమన చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తి చేశారు. 'ఎస్పీ చెప్పాడని వెనక్కి నెడుతున్నారు.. ఆయనేమైనా నా బాస్ అనుకుంటున్నారా?' అని లాలూ ప్రశ్నించారు. లాలూ తనయుడు, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఈ ఘటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆర్జేడీ కార్యకర్తలు సైతం ఘటనపై ఆందోళనలకు సిద్దమవుతున్నారు.
కాగా, దాణా కుంభకోణం కేసులో లాలూకు శిక్ష పడటంతో ఆయన ఝార్ఖండ్‌లోని బిర్సా ముందా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన హృద్రోగ, మూత్రపిండ సమస్యలతో బాధపడుతుండటంతో మార్చి 29న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం లాలూను చికిత్స నిమిత్తం దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించేందుకు అనుమతించింది. ఇప్పుడు అక్కడినుంచి ఆయన్ను రాంచీ రిమ్స్ కు తరలిస్తున్నారు.
ఇదిలా ఉంటే, త్వరలో లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు వివాహం జరగనుంది. వివాహం సందర్భంగా లాలూకు పెరోల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications