వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'లవ్ జిహాద్ లాగే నార్కోటిక్ జిహాద్' అంటూ కేరళ బిషప్ చేసిన వ్యాఖ్యలపై వివాదం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బిషప్ మార్ జోసఫ్ కల్లారంగట్

'నార్కోటిక్ జిహాద్’ అంటూ కేరళకు చెందిన ఒక క్రిస్టియన్ బిషప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి.

ముస్లిమేతరులు జిహాదీల ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించాలని, 'లవ్ జిహాద్' తర్వాత 'నార్కోటిక్ జిహాద్'తో పేరుతో కొందరు ముస్లిమేతరులకు హాని తలపెట్టే పనులు చేస్తున్నారని కేరళలోని ప్రముఖ కాథలిక్ సంస్థ 'సైరో-మలబార్ కాథలిక్ చర్చ్' పాలై యూనిట్‌కు చెందిన బిషప్ మార్ జోసఫ్ కల్లారంగట్ వ్యాఖ్యానించారు.

"ముస్లిమేతర యువతను నాశనం చేయడానికి జిహాదీలు మాదకద్రవ్యాలను వాడుకుంటున్నారు. వీళ్లు చాలా చోట్ల పని చేస్తున్నారు. ముఖ్యంగా ఐస్‌క్రీం పార్లర్లు, రెస్టారెంట్లలో పనిచేస్తున్నారు" అంటూ చర్చిలో ప్రసంగిస్తూ ఆయన అన్నారు.

బిషప్ కల్లారంగట్ వ్యాఖ్యలను క్రైస్తవులు, ముస్లింలే కాకుండా రాజకీయ నాయకులు కూడా విమర్శిస్తున్నారు.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ "ఇవి సమాజాన్ని విభజించే వ్యాఖ్యలు" అంటూ తప్పుబట్టారు.

కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్ కేరళ అసెంబ్లీలో మాటాడుతూ “బిషప్ లక్షణ రేఖ దాటారని” అన్నారు.

"ప్రజలంతా సోదర భావంతో, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలిసిమెలిసి ఉండాలని ఓ పక్క పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిస్తుంటే, మరోపక్క బిషప్ కల్లారంగట్ చేసిన వ్యాఖ్యలు శోచనీయం. ప్రజల్లో విద్వేషాన్ని, శత్రుత్వాన్ని ఎందుకు ప్రోత్సహించాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు" అంటూ కాథలిక్ క్రైస్తవుల పత్రిక 'లైట్ అండ్ ట్రూత్' ఎడిటర్ ఫాదర్ పాల్ తెలక్కట్ వ్యాఖ్యానించారు.

బిషప్ వ్యాఖ్యలు మత సామరస్యాన్ని దెబ్బతీసి, విద్వేషాలను వ్యాప్తి చేసే విధంగా ఉన్నాయంటూ కోట్టాయంకు చెందిన మహల్లూ ముస్లిం కోఆర్డినేషన్ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

"ఈ ఫిర్యాదుపై న్యాయవ్యవస్థ సలహాలు తీసుకుంటున్నామని" కోట్టాయం ఎస్పీ డీ శిల్ప తెలిపారు.

కాగా, బిషప్ వ్యాఖ్యలకు బీజేపీ నుంచి గట్టి మద్దతు లభిస్తోంది.

సైరో-మలబార్ కాథలిక్ చర్చ్

బిషప్ ఇంకేమన్నారు?

కోట్టాయం జిల్లా కురవిలంగడ్ చర్చిలో సెయింట్ మేరీ లెంట్ పీరియడ్ (క్రైస్తవుల మతపరమైన కార్యక్రమం) ఎనిమిదవ రోజు వేడుకల సందర్భంగా బిషప్ కల్లారంగట్ ప్రసంగించారు.

"ప్రపంచంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే కేరళలో కూడా ముస్లింల్లోని ఒక వర్గం, ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతూ, శత్రుత్వాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది.’’

''జిహాదీలు ఇస్లాంను వ్యాప్తి చేయడానికి వివిధ పద్ధతులను అవలంబిస్తున్నారు. ముఖ్యంగా ఇతర మతాలకు చెందిన ఆడపిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారు" అంటూ బిషప్ కల్లారంగట్ ఆరోపించారు.

ఉదాహరణగా, నిమిష, సోనియా సెబాస్టియన్ కేసులను బిషప్ ప్రస్తావించారు. వీరిద్దరూ ముస్లిం యువకులతో ప్రేమలో పడి, ఇస్లాం మతాన్ని స్వీకరించి, కేరళ నుంచి పారిపోయి ఇస్లామిక్ స్టేట్‌లో చేరినవారే.

"మాదకద్రవ్యాలకు సంబంధించిన వ్యవహారాలు, పెరుగుతున్న రేవ్ పార్టీల (డ్రగ్స్ వినియోగించే పార్టీలు) సంఖ్య, వాటిని నిర్వహిస్తున్న వ్యక్తుల వ్యవహారాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది" అని కల్లారంగట్ వ్యాఖ్యానించారు.

'హలాల్ ఫుడ్‌’ను ప్రచారం చేయడం ద్వారా ఇతర మతాలకు హాని కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు.

టీనేజ్ అమ్మాయిల్లో ఆధ్యాత్మిక విలువలు పెంపొందేలా చుట్టూ ధార్మిక వాతావరణాన్ని కల్పించాలని పిలుపునిచ్చారు.

కొట్టాయంలోని సెయింట్ మేరీ చర్చి

బిషప్ మాటలను ఎందుకు తీవ్రంగా పరిగణిస్తున్నారు?

కేరళలో ఒక మతానికి చెందిన ధార్మిక సంస్థల నాయకులు, ఇతర మతాలను దూషిస్తూ వ్యాఖ్యానాలు చేయడం ఇంతకు మునుపెన్నడూ జరగలేదు.

ముఖ్యంగా బిషప్ కల్లారంగట్‌లాంటి ప్రముఖ వ్యక్తి నోటి నుంచి ఇటువంటి ప్రసంగాలు వెలువడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

కల్లారంగట్ "గొప్ప మత బోధకుడు" అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గతంలో స్వయంగా ప్రశంసించారు.

కేరళలోని కోట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి ప్రాంత క్రైస్తవులపై బిషప్ కల్లారంగట్ ప్రభావం చాలా ఎక్కువ.

కోట్టాయంలో ఆయన సంస్థ 'ఎపార్కీ ఎట్ పాలై’ ప్రధాన కార్యాలయం ఉంది. అంతేకాకుండా, వీరు పెద్ద సంఖ్యలో విద్యా సంస్థలను నిర్వహిస్తున్నారు.

కోట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, పట్టణంతిట్ట, తిరువనంతపురం ప్రాంతాల్లో క్రిస్టియన్ ఓటు బ్యాంకు అధికం.

చాలాకాలంగా ఈ ఓటు బ్యాంకుపై బీజేపీ, సీపీఎంలు దృష్టి సారిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి దీన్ని లాక్కోవడానికి ఈ రెండు పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ ఏడాది ఏప్రిల్‌లో కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ, మలంకర చర్చిలోని రెండు వర్గాల మధ్య ఎంతోకాలంగా ఉన్న వివాదాలను పరిష్కరించి, క్రిస్టియన్ ఓటు బ్యాంకును ఆకర్షించే ప్రయత్నాలు చేసింది. అయితే, కొన్ని కారణాల వల్ల బీజేపీ ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు.

కాగా, ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ సోషల్ మీడియాలో ముస్లింలకు వ్యతిరేకంగా ఒక రకమైన ప్రచారం ప్రారంభమైంది. రాజకీయ ప్రయోజనాల కోసం క్రిస్టియన్లు, ముస్లింల మధ్య వివాదాలు రేపే ప్రయత్నాలు జరిగాయి.

కేరళ జనాభాలో 26 శాతం ముస్లింలు, 18 శాతం క్రైస్తవులు ఉన్నారు. గతంలో వీరంతా కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కు బహిరంగంగా మద్దతు ఇస్తూ, ఆ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేసేవారు.

"బిషప్ కల్లారంగట్ ప్రసంగం బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎజెండాకు పొడిగింపులా సాగింది. మాదకద్రవ్యాల వ్యాప్తిలో ఒక వర్గం మాత్రమే చురుకుగా ఉందని ఎలా చెప్పగలరు? అలా అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు లేకుండా మాట్లాడడం మంచిది కాదు" అని సైరో-మలబార్ చర్చికి చెందిన ఫాదర్ అగస్టీన్ వట్టోలి ఆక్షేపించారు.

"నేర సంబంధ చర్యలను ఆ చర్యల వరకే చూడాలి. వాటిని ఒక వర్గానికి ముడిపెట్టకూడదు. ఒక వర్గానికి లేదా మతానికి ముడిపెడితే అది విద్వేషాలకు దారి తీస్తుంది. మత సామరస్యాన్ని దెబ్బతీస్తుంది. ఇలా జరిగినందుకు ఒక క్రిస్టియన్‌గా నేను చాలా బాధపడుతున్నాను. ఇది తప్పు. ఇలా మాట్లాడడం కేరళ క్రైస్తవ సంప్రదాయం కాదు" అని ఫాదర్ తెలక్కట్ అన్నారు.

కాగా, కేరళ కాథలిక్ బిషప్ కౌన్సిల్ (కేసీబీసీ) బిషప్ కల్లారంగట్‌కు అనుకూలంగా శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. బిషప్ మాటలను వివాదాస్పదం చేయకుండా బాధ్యతతో బహిరంగంగా చర్చించాలని కేసీబీసీ పేర్కొంది.

"కేరళ ప్రస్తుతం కొన్ని తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది అన్నది వాస్తవం. కేరళలో ఐఎస్‌తో సహా అనేక ఉగ్రవాద సంస్థలకు లింకులు ఉన్నాయని పలు దర్యాప్తు సంస్థలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఇక్కడి నుంచి కోట్లాది రూపాయల మాదకద్రవ్యాలను జప్తు చేశారు. మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ద్వారా వచ్చిన డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి నివేదికలు కూడా స్పష్టం చేశాయి. ఈ విషయంలో సాధారణ ప్రజల ఆందోళలను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విచారణ జరపాలి’’అంటూ కేసీబీసీ ప్రతినిధి ఫాదర్ జాకబ్ పలక్కపిలి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

''కాథలిక్ చర్చి మతపరమైన విద్వేషాలను కోరుకోదు. అన్ని వర్గాల శాంతియుత సహజీవనాన్ని మాత్రమే కోరుకుంటుంది. సమాజ శాంతి కోసం అన్ని సంఘాల నాయకులు అవాంఛనీయ సాంఘిక కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఏకం కావాలి."

పినరయి విజయన్

రాజకీయ నాయకుల స్పందన ఏమిటి?

"మాదకద్రవ్యాలు సమాజం మొత్తాన్ని చెడుగా ప్రభావితం చేస్తాయి. ఇది ఏదో ఒక వర్గానికో, సమూహానికో సంబంధించిన విషయం కాదు. దీన్ని ఒక మతానికి ముడిపెట్టడం సరికాదు. డ్రగ్స్‌ను నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది" అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు.

"మత, ఆధ్యాత్మిక నాయకులు కేరళలోని శాంతియుత సహజీవన వాతావరణాన్ని దెబ్బతీసే ప్రకటనలు చేయడం మానుకోవాలి. నేరానికి మతంగానీ, కులం, జెండర్‌గానీ ఉండవు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా విద్వేషాలు వ్యాప్తి చేయవద్దు" అని కేరళ ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్ అన్నారు.

"బిషప్ తన అనుభవాల సారంగా ఆ మాటలు చెప్పి ఉండవచ్చు. నార్కోటిక్ జిహాద్ గురించి ఆయన అన్న మాటలపై విచారణ జరగాలి. అయినా, అవేమీ కొత్త విషయాలు కావు. బిషప్‌ను విమర్శించడానికేమీ లేదు. అతివాద సంస్థలు డబ్బు సంపాదించడానికి మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నాయన్నది నిజం" అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కే. సురేంద్రన్ బిషప్ కల్లరంగట్‌కు మద్దతు ఇచ్చారు.

"ముస్లిం పేర్లు కలిగిన వ్యక్తుల నేరప్రవర్తనను మొత్తం ముస్లిం సమాజానికి అంటగట్టకూడదు. దానికి ముస్లిం సమాజం బాధ్యత వహించదు. చాలామంది ఇలాంటి అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతుంటారు. కానీ, ఒక ఆధ్యాత్మిక గురువు, మతప్రవక్త నుంచి ఇలాంటి మాటలు వస్తే, వాటిని మనం తీవ్రంగా పరిగణించాలి. ఇది సమాజంలో ఉన్న మతసామరస్యాన్ని దెబ్బ తీస్తుంది" అంటూ 'సమస్త కేరళ సున్నీ స్టూడెంట్స్ ఫెడరేషన్' ప్రధాన కార్యదర్శి సతర్ పంతల్లూర్ బిషప్ మాటలను ఖండించారు.

చర్చి

బిషప్ మాటలు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?

'నార్కోటిక్ జిహాద్' అంటూ కొత్త పదబంధాన్ని ప్రయోగించడం సామాజిక, రాజకీయ అంశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు కేజే జాకబ్ అభిప్రాయపడ్డారు.

"పరిశీలించి చూస్తే ఇది బీజేపీకి, ఆర్ఎస్ఎస్‌కు ఉపశమనం కలిగించే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇది రాజకీయం మాత్రమే కాదు, ఆర్ఎస్ఎస్‌కు బలాన్ని చేకూర్చే ప్రయతం. హిందూ సమాజం ఐక్యత అంటూ కేరళలో వారు చేసిన ప్రయత్నాలు ఘోరంగా విఫలమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వారికి చాలా తక్కువ శాతం ఓట్లు లభించాయన్నది మనం మర్చిపోకూడదు’’అని జాకబ్ అన్నారు.

బిషప్ కల్లారంగట్ మాటలు బీజేపీకి బలాన్ని ఇస్తాయి. వాటిని పట్టుకుని ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను ఉసికొల్పే ప్రయత్నాలు చేయవచ్చు. క్రిస్టియన్లు కూడా అదే అంటున్నారంటూ బిషప్ మాటలను ఉదాహరణగా చూపవచ్చు."

"కేరళలో ముస్లింలు సాధారణ లౌకికజీవనాన్ని అవలంబిస్తారు. ఇక్కడి సమాజంలో మతోన్మాదం ఎప్పుడూ లేదు. కానీ, ఇటీవల కాలంలో మతవిశ్వాసాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కొచ్చి, మంగళూరు మధ్య ప్రతిపాదిత గ్యాస్ పైప్‌లైన్ విషయాన్ని ఇలాగే వివాదాస్పదం చేశారు. ఎందుకంటే ముస్లిం జనాభా అధికంగా ఉండే మళప్పురం నుంచి ఆ లైన్ వెళుతోంది. అందుకని, ఆ ప్రోజెక్టును ఒక వర్గం వ్యతిరేకిస్తోంది" అంటూ జాకబ్ ఉదాహరణలు ఇచ్చారు.

బిషప్ వ్యాఖ్యల వలన సాధారణ ముస్లింలు సమాజంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆయన మాటలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి విచారణ జరపాలని జాకబ్ సూచించారు.

"లలిత కుమారి కేసులో సుప్రీం కోర్టు ఒక విషయాన్ని స్పష్టం చేసింది. నేరపూరిత చర్యల గురించి ఎలాంటి ఆధారాలు ఉన్నా ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తప్పనిసరి అని పోలీసులకు సూచించింది. మాదకద్రవ్యాల అంశం కూడా నేరం కిందే వస్తుంది కాబట్టి చట్టపరంగా చర్యలు ప్రారంభించాలి. అలాంటి మాటలు చెప్పడానికి బిషప్ దగ్గర ఏ ఆధారలు ఉన్నాయని పోలీసులు విచారించాలి" అని జాకబ్ అన్నారు.

అయితే, పినరయి విజయన్ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన మాటలు కొంత ఆసక్తిని రేకెత్తించాయి.

"బిషప్ ఏం చెప్పాలనుకున్నారో, ఏ సందర్భంలో అలా అన్నారో స్పష్టంగా తెలియట్లేదు. ఏది ఏమైనా, ప్రజలను విడదీసే మాటలు ఎవరూ చెప్పకూడదు" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Controversy over Bishop of Kerala's remarks on 'narcotic jihad like love jihad'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X