• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనావైరస్: సెకండ్ వేవ్‌లో పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?

By BBC News తెలుగు
|

కరోనా

''2020నాటి కరోనావైరస్ ఒకటి. 2021నాటి కరోనావైరస్ మరొకటి.

ఈ రెండింటి మధ్య చాలా భేదాలు ఉన్నాయి. ఇప్పుడు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే వైరస్ అంత ప్రాణాంతకంగా కనిపించడంలేదు. మరోవైపు ప్రస్తుతం పిల్లలు, యువత ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. జ్వరం కూడా ఎక్కువ కాలం ఉంటోంది.''

కోవిడ్-19 కేసుల వేగంగా పెరగడంపై ఓ బీబీసీ ప్రతినిధితో తన పొరుగింట్లో ఉండే సైనీ సాహెబ్ ఈ మాటలు చెప్పారు. ''ఈ అంశాలపై మీరే రోజూ వార్తలు రాస్తుంటారు కదా.. ఇది నిజమే కదా''అని కూడా ప్రశ్నించారు.

''మేం వైద్యులతో మాట్లాడకుండా ఈ విషయంపై ఏమీ చెప్పలేం''అని బీబీసీ ప్రతినిధి సమాధానం ఇచ్చారు.

''సరే ఈ విషయంపై రేపు మాట్లాడుకుందాం''అని చెప్పి ఇద్దరూ తమ తమ ఇళ్లలోకి వెళ్లిపోయారు.

తాజా కథనం రాయడానికి ఈ ఘటనే మూలకారణం. సైనీ సాహెబ్ ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ప్రశ్నలు చాలా మందిని కలవరపెడుతున్నాయి. వీటిపై డాక్టర్ కేకే అగర్వాల్‌తో బీబీసీ మాట్లాడింది.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అగర్వాల్ పనిచేశారు. దేశంలోని ప్రముఖ హృద్రోగ నిపుణుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన్ను భారత ప్రభుత్వం పద్మ శ్రీతో సత్కరించింది.

గత ఏడాది కరోనావైరస్, తాజా వైరస్‌ల మధ్య భేదంపై ఆయన బీబీసీతో మాట్లాడారు. సెకండ్ వేవ్‌కు సంబంధించి చాలా ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ప్రధాన అంశాలివీ..

కరోనావైరస్

ప్రశ్న: నిజంగా 2020 కరోనావైరస్‌కు 2021 వైరస్‌కు వ్యాప్తి విషయంలో భేదం ఉందా?

జవాబు: అవును, నిజమే. ఈ రెండూ భిన్నమైనవి. అయితే, దీనికి సంవత్సరం ప్రాతిపదిక కాదు. కరోనావైరస్‌ పరివర్తన చెందడం వల్లే ఈ భేదం కనిపిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో నాలుగు రకాల కరోనావైరస్‌లు వ్యాపిస్తున్నాయి.

మొదటిది: దీన్ని ప్రాథమిక కరోనావైరస్ అని చెప్పుకోవచ్చు. ఇది 2020లో భారత్‌కు వచ్చింది.

రెండోది: ఇది కొత్తరకం కరోనావైరస్. బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ల నుంచి ఇది భారత్‌కు వచ్చింది. అయితే, దీనిపై పూర్తి వివరాలను భారత ప్రభుత్వం విడుదల చేయలేదు.

మూడోది: ఒక డోసు వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కరోనావైరస్ సోకడం. ఇది కూడా కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌ కిందకే వస్తుంది.

నాలుగోది: కరోనా రీ-ఇన్ఫెక్షన్. ఇదివరకు కరోనా సోకినవారికి మళ్లీ వైరస్ సోకడం. మిగతా వారితో పోలిస్తే, ఇలాంటి కేసులు చాలా తక్కువగా ఉన్నాయి.

ఒక్కొక్కరిపై వైరస్ ఒక్కోలా ప్రభావం చూపిస్తుంది. అందుకే ఒక్కొక్కరిలో ఒక్కో లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మొదటి కరోనావైరస్ లక్షణాలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. కొత్తరకం కరోనావైరస్‌లలో కొంచెం భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయి.

కరోనావైరస్

ప్రశ్న: మొదటి వేవ్‌లో కంటే ఇప్పుడు వైరస్ వేగంగా వ్యాపిస్తోందా?

జవాబు: కరోనావైరస్ కేసుల గ్రాఫ్‌ను చూస్తే ఇది స్పష్టం అవుతోంది. గత ఏడు రోజుల డేటాను పరిశీలిస్తే కేసులు ఎంత వేగంగా పెరుగుతున్నాయో తెలుస్తోంది. మరోవైపు మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. టెస్టుల్లో పాజిటివ్‌గా తేలుతున్న కేసులు కూడా ఎక్కువయ్యాయి. ఆసుపత్రుల్లో పెరుగుతున్న రోగుల సంఖ్య కూడా ఇదే విషయాన్ని చెబుతోంది.

ప్రశ్న: చాలా మందిలో జ్వరం ఎక్కువ రోజులు ఉంటున్నట్లు చెబుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది?

జవాబు: ఒక్కో రకమైన కరోనావైరస్ ఒక్కోరకమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అదే సమయంలో ఒక్కొక్కరి శరీరం వైరస్‌కు ఒక్కోలా కనిపిస్తుంది.

మొదటి రకం కరోనావైరస్ లక్షణాల గురించి ఇప్పటివరకు చాలా చర్చ జరిగింది. దీనిపై బీబీసీ కూడా ఒక సమగ్ర కథనాన్ని ప్రచురించింది.

కొత్త కరోనావైరస్

రెండో కరోనా.. కొత్తరకం కరోనా. దీని లక్షణాలు మనకు తెలియాలంటే.. మొదట ఏ రకం వైరస్ సోకిందో మనం తెలుసుకోవాలి.

వైరస్ పరివర్తన చెందినప్పుడు ఇన్ఫెక్షన్‌ లక్షణాల్లోనూ మార్పులు వస్తాయి. కొత్త మ్యూటెంట్ వైరస్ సోకినవారిలో జ్వరం ఎక్కువ రోజులు ఉంటోంది.

జ్వరం ఎక్కువ రోజులు ఉందంటే అది మొదటి రకం కరోనావైరస్ కాదు. దీన్ని సిస్టమిక్ ఇన్‌ఫ్లమేషన్‌గా చెప్పుకోవచ్చు.

ఈ రకం ఇన్ఫెక్షన్ సోకినప్పుడు మన శరీరంలో యాంటీబాడీలతోపాటు యాంటీజెన్లు కూడా ఉంటాయి. కాబట్టి ప్రభావం ఎక్కువ రోజులు ఉంటుంది. జ్వరం ఎక్కువ రోజులు ఉండటానికి ఇదే కారణం. అయితే, వీరిలో న్యూమోనియా లక్షణాలు కనిపించవు.

కరోనావైరస్

ప్రశ్న: ప్రస్తుతం పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?

జవాబు: ప్రస్తుతం పిల్లలు, యువతలో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి సమాచారం విడుదల చేయలేదు. కానీ, ఆసుపత్రులకు వస్తున్న రోగులను పరిశీలిస్తే, ఇది నిజమేనని తెలుస్తోంది.

దీనికి శాస్త్రీయ పరమైన ఆధారాలు కూడా ఉన్నాయి. వైరస్‌లో మ్యుటేషన్ జరిగినప్పుడు, ప్రాథమిక కరోనావైరస్ వ్యాక్సీన్ వేసుకోని జనాభాపై ఎక్కువగా దాని ప్రభావం ఉంటుంది.

ఇప్పుడు 45ఏళ్లకుపైబడిన వారికి వ్యాక్సీన్లు ఇస్తున్నారు. అందుకే వీరిలో కేసుల సంఖ్య తగ్గింది. మరోవైపు పిల్లలు, యువతలో కేసుల సంఖ్య పెరుగుతోంది.

పెద్దవారితో పోలిస్తే పిల్లల్లో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది. అందుకే దీని గురించి మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు.

30ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారికి వ్యాక్సీన్లు ఇవ్వడం మొదలుపెడితే, అప్పుడు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారిలో ఎక్కువ కేసులు నమోదవుతాయి. అందుకే 18ఏళ్లకు పైబడిన అందరికీ వ్యాక్సీన్లు ఇవ్వాలని మేం చెబుతున్నాం.

డాక్టర్ కేకే అగర్వాల్ చెబుతున్న అంశాలతో ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సురేశ్ కుమార్ కూడా అంగీకరించారు.

''ఇదివరకు 60ఏళ్లకు పైబడిన వారు ఎక్కువగా కరోనావైరస్‌తో ఆసుపత్రికి వచ్చేవారు. ఇప్పుడైతే పిల్లలు, యువత ఎక్కువగా వస్తున్నారు''అని ఆయన ఏఎన్‌ఐతో చెప్పారు.

కరోనావైరస్

ప్రశ్న: వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కరోనా సోకినవారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి?

జవాబు: మొదటి రెండు రకాల కేసులతో పోలిస్తే, ఈ కేసులు కాస్త తక్కువగానే ఉన్నాయి. ఒక డోసు వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. కానీ రెండు డోసులు వేసుకున్నాకే పూర్తి రక్షణ ఉంటుంది. కొందరిలో మొదటి డోసు తీసుకున్నాక వైరస్ సోకుతుంటుంది. వీరిలో నాన్ పల్మనరీ సిస్టమిక్ ఇన్‌ఫ్లమేషన్ కనిపిస్తుంది. అంటే వీరిలో ఊపిరితిత్తులపై వైరస్ అంత ప్రభావం చూపదు. కానీ జ్వరం మాత్రం ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న: కరోనా రీ-ఇన్ఫెక్షన్ ఎంత ప్రమాదకరం?

జవాబు: 102 రోజుల వ్యవధి తర్వాత మళ్లీ వైరస్ సోకితే, దీన్ని రీ-ఇన్ఫెక్షన్‌గా డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది.

ఇలాంటి రోగుల్లో ఏ రకం వైరస్‌ వల్ల కొత్త ఇన్ఫెక్షన్ సోకిందో మొదట తెలుసుకోవాలి. బ్రిటన్ నుంచి వచ్చిన వైరస్ ఎక్కువగా పిల్లలు, యువతలో వ్యాపిస్తోంది. బ్రిజిల్ వైరస్ అయితే, మరణించే ముప్పు ఎక్కువగా ఉంటోంది. అదే దక్షిణాఫ్రికా వైరస్ అయితే, లక్షణాలు కాస్త ఆలస్యంగా బయటపడతాయి.

సాధారణంగా వైరస్ మ్యుటేట్ అయ్యేటప్పుడు.. దీనికి వ్యాక్సీన్లను తట్టుకుని నిలబడగలిగే, పరీక్షల్లో బయటపడని, ఔషధాలకు లొంగని శక్తి సంతరించుకుంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Coronavirus: Are children and young people more likely to be infected with the virus in the second wave
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X