ఇండియాలో 10వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు: 353కు చేరిన మరణాలు
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో వెయ్యికిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 10,815కు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ వివరాలను వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 353 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. కాగా, 1190 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 2337 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 229 మంది కోలుకోగా, 160 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఢిల్లీలోనే అత్యధికంగా 1510 కేసులు నమోదయ్యాయి. వీరిలో 30 మంది కోలుకోగా.. 28 మంది మరణించారు. నిజాముద్దీన్ ఘటన అనంతరం ఢిల్లీలో కరోనా తీవ్రత ఒక్కసారిగా పెరిగిన విషయం తెలిసిందే.

తమిళనాడులో కరోనా బాధితుల సంఖ్య 1173గా నమోదైంది. 53 మంది కోలుకోగా.. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం 750 కేసులు నమోదు కాగా, 58 మంది కోలుకున్నారు. 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో 473 మందికి కరోనా సోకిందని, వీరిలో 9 మంది మరణించారని తెలిపింది. తెలంగాణలో 624 కేసులు నమోదు కాగా, 17 మంది మరణించారని వెల్లడించింది.
ఇది ఇలావుండగా, కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు, రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ పలు కీలక సూచనలు చేసింది. వాటిలో కొన్ని కీలకమైనవి గమనించినట్లయితే.. ఎప్పుడు దాహం వేసినా గోరువెచ్చని నీరు తాగాలి. ప్రతి రోజు 30 నిమిషాలపాటు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయాలి. వంటకాల్లో పసుపు, జీలకర్ర, దనియాలు, వెల్లుల్లి తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. తులిసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, శొంఠి, ఎండు ద్రాక్ష మొదలైనవాటితో తేనేరును రోజుకు ఒకటి రెండు సార్లు తాగితే మంచిదని పేర్కొంది.












Click it and Unblock the Notifications