అంతరిస్తోన్న అండమాన్ తెగకూ కరోనా - ఉన్నదే 50 మంది అందులో 10 మందికి పాజిటివ్
ఇండియాలో అంతరించిపోతున్న అండమాన్ తెగలనూ కరోనా వైరస్ వదల్లేదు. అక్కడి గ్రేట్ అండమానీస్ తెగలో ప్రస్తుతం 50 మంది మాత్రమే జీవించి ఉండగా, గడిచిన నెల రోజుల వ్యవధిలో వాళ్లలో 10 మంది కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా బారినపడిన పదిమందిలో ఆరుగురు కోలుకుని హోం క్వారంటైన్‌లో ఉన్నారని, గత వారమే కరోనా సోకిన నలుగురు మాత్రం పోర్టు బ్లేయర్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు గురువారం ప్రకటించారు.
విసిరేసినట్లుండే స్టెయిర్ ద్వీపంలో నివసిస్తోన్న ఈ గ్రేట్ అడమానీస్ తెగకు ఆహారం, ఆశ్రయం వంటి వాటిని ప్రభుత్వమే చూసుకుంటోంది. వాళ్లలో కొందరికి పోర్టు బ్లేయర్ లో ఉద్యోగాలు కూడా కల్పించింది. అలా రాకపోకలు సాగించే క్రమంలో వైరస్ సోకి ఉంటుందని అండమాన్, నికోబార్ దీవుల కొవిడ్ నియంత్రణ నోడల్ అధికారి డాక్టర్ అవిజిత్ రే తెలిపారు. తెగలో మొత్తం 37 మందికి టెస్టులు నిర్వహించగా, రోగ లక్షణాలు లేకుండానే 10 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, అందులో ఆరుగురు ఇప్పటికే కోలుకోగా, ఆస్పత్రిలో ఉన్న నలుగురి ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని రే చెప్పారు.

అండమాన్, నికోబార్ దీవుల్లో మొత్తం 4 లక్షల మంది నివసిస్తున్నారు. వీరిలో ఇప్పటి 2,268 మంది కరోనా బారినపడ్డారు. 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అండమాన్‌లో అంతరించిపోయే దశలో ఉన్న జరవా, నార్త్ సెంటినెలీస్, గ్రేటర్ అండమనీస్, ఒంజే, షోంపెన్ అనే ఐదు ఆదిమ తెగలు ఉన్నాయి. వారిలో జరవా, సెంటినెలీస్ తెగ ప్రజలు ఇప్పటికీ జనజీవనస్రవంతికి దూరంగా జీవిస్తున్నారు.

ఆదిమ జాతులు నివసించే దీవులకు బయటి వ్యక్తులెవరూ వెళ్లకుండా భద్రత చర్యలు చేపట్టారు. గత వారం ఓ దీవిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన మత్స్యకారుల్ని కోస్టు గార్డు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. 2018లో ఓ అమెరికా పౌరుడిని నార్త్ సెంటినెలీస్ తెగ ప్రజలు బాణాలతో కొట్టి చంపిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications