కరోనా పోరుకు ట్రంప్ హామీ: అమెరికా నుంచి భారత్‌కు చేరిన 100 వెంటిలేటర్లు
వాషింగ్టన్/న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఆ దేశం భారతదేశానికి 100 వెంటిలేటర్లను అందించింది. అమెరికాలో తయారైన ఈ వెంటిలేటర్లు కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని యూఎస్ ఎంబసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Recommended Video
కరోనా పోరులో భాగంగా అమెరికా ప్రభుత్వం.. యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్(యూఎస్ఏఐడీ) ద్వారా భారత ప్రభుత్వం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలకు విరాళంగా ఈ కొత్త 100 వెంటిలేటర్లను అందించినట్లు తెలిపింది. ఈ విధంగా విరాళంగా వెంటిలేటర్లను అందించడంతో ఇది రెండోసారని తెలిపింది.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీ మేరకు తుది దశ 100 వెంటిలేటర్లను కరోనాపై పోరు కోసం భారతదేశానికి అందిస్తున్నామని యూఎస్ అంబాసిడర్ కెన్నెత్ జస్టర్ తెలిపారు. ఇది తమకు ఎంతో సంతోషాన్నిస్తోందని తెలిపారు. అవసరమైతే మరింత సాయం చేసేందుకు సిద్ధమన్నారు. ఈ వెంటిలేటర్ల పనిలో అవసరమయ్యే ట్యూబ్స్, ఫిల్టర్లు, ఇతర వస్తువులను అందజేస్తామని తెలిపారు.

యూఎస్ఏఐడీ కూడా భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందని కెన్నెత్ తెలిపారు. వెంటిలేటర్ల ఏర్పాటు, ఓరియేంటేషన్, క్లినికల్ ట్రైనింగ్, యంత్రం పనితీరులో శిక్షణ ఇస్తామని చెప్పారు. కాగా, మొదటి షిప్మెంట్‌లో భాగంగా అమెరికా నుంచి భారతదేశానికి కరోనా వైద్యంలో ఎంతగానో ఉపయోగపడే 100 వెంటిలేటర్లు జూన్ 14న చేరుకున్నాయి. వీటిని దేశంలోని 8 ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ప్రాంతీయ కేంద్రాలకు తరలించారు.
అమెరికా నుంచి భారతదేశానికి మొత్తం 200 వెంటిలేటర్లు వచ్చాయి. కరోనాపై పోరులో భారతదేశానికి అమెరికా మద్దతు ఉంటుందని యూఎస్ అంబాసిడర్ కెన్నెత్ జస్టర్ వివరించారు. గతంలో డొనాల్డ్ ట్రంప్ కరోనా పోరులో భారతదేశానికి తమవంతుగా అండగా ఉంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 200 వెంటిలేటర్లను అందజేశారు.












Click it and Unblock the Notifications