వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్: భారత్‌లో ఇస్తున్న కోవిడ్ టీకాలు ఏంటి... అవి ఎలా పని చేస్తాయి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కోవిడ్‌ వ్యాక్సీన్‌

ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మొదలైన వారం రోజులలోనే లక్షలాది డోసుల కోవిడ్‌ వ్యాక్సీన్‌ను భారత్‌ పొరుగు దేశాలకు ఉచితంగా పంపడం మొదలు పెట్టింది. దీన్ని టీకా రాయబారం ( Vaccine Diplomacy ) అని కూడా అంటున్నారు.

యూకేకు చెందిన ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకాకు స్థానిక పేరైన కోవిషీల్డ్‌కు, భారత్‌ బయోటెక్‌ కంపెనీ తయారీ వ్యాక్సీన్‌ కోవాగ్జిన్‌కు భారత డ్రగ్‌ కంట్రోల్ అథారిటీ ఆమోదం తెలిపింది.

ఇప్పటికే భారత్ ప్రపంచ వ్యాక్సీన్‌ హౌస్‌గా పేరు తెచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తయారయ్యే వ్యాక్సీన్‌లలో 60% భార‌త్‌లోనే తయారవుతున్నాయి. అర డజనుకు పైగా భారీ తయారీ సంస్థలు ఈ పనిలో భాగం పంచుకుంటున్నాయి.

భారత్‌లో తయారవుతున్న వ్యాక్సీన్‌ల ప్రత్యేకతలేంటి?

కోవిడ్‌ వ్యాక్సీన్‌

కోవిషీల్డ్ ఎలా పని చేస్తుంది ?

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్‌ను 'కోవిషీల్డ్‌' అనే పేరుతో పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేస్తోంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సీన్‌ తయారీ కేంద్రం. నెల రోజుల్లో 5 కోట్ల డోసుల వ్యాక్సీన్‌ను తయారు చేయగలమని ఆ సంస్థ చెబుతోంది.

చింపాంజీలలో బలహీనపడిన సాధారణ జలుబు వైరస్‌ (ఎడినోవైరస్‌) నుంచి ఈ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేశారు. దీనివల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవని చెబుతున్నారు.

ఈ వ్యాక్సీన్‌ శరీరంలోకి వెళ్లగానే అక్కడున్న వ్యాధి నిరోధక శక్తిని కదిలించి యాంటీబాడీలు ఉత్పత్తి చేసేలా చేస్తుంది. దీంతో రోగ నిరోధక వ్యవస్థ కరోనా వైరస్‌పై పోరాటం ప్రారంభిస్తుంది.

12 వారాల వ్యవధిలో రెండు డోసులుగా ఈ వ్యాక్సీన్‌ను ఇస్తారు. 2 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేడ్‌ల మధ్య ఇళ్లలో వాడే సాధారణ రిఫ్రిజిరేటర్లలో కూడా దీన్ని నిల్వ చేయవచ్చు. దీనిని ఆసుపత్రుల వరకు చేర్చడం కూడా చాలా సులభం. ఇతర వ్యాక్సీన్‌లతో పోలిస్తే దీన్ని పంపిణీ చాలా సులభమని చెప్పవచ్చు.

ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ తయారీ వ్యాక్సీన్‌ను ప్రస్తుతం అనేక దేశాలలో వాడుతున్నారు. అయితే దీన్ని -70 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల వద్ద భద్రపరచాలి. దీనిని ఎక్కువసార్లు కదిలిండం, రవాణా చేయడం కూడా మంచిది కాదు.

భారత్ లాంటి దేశాలలో ఇది చాలా కష్టమైన పని. పైగా ఇక్కడ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు నమోదవుతుంటాయి.

కోవిడ్‌ వ్యాక్సీన్‌

కోవిషీల్డ్‌ ప్రభావమెంత ?

రెండు డోసులుగా తీసుకుంటే ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్‌ 90% ప్రభావవంతంగా పనిచేసినట్లు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌లో తేలింది.

అయితే ఒక్కడోసు ఇస్తే సరిపోతుందా, లేదా రెండు డోసులు ఇవ్వాలా అన్నది నిర్ణయించడానికి సరిపడా డేటా అందుబాటులో లేదు.

అనధికారికంగా సేకరించిన సమాచారాన్నిబట్టి ఒక డోసు ఇచ్చిన తర్వాత కొంత విరామంతో రెండో డోసు ఇవ్వడం వల్ల పూర్తి స్థాయిలో దాని ప్రభావాన్ని పొందవచ్చని తేలింది. మొదటి డోసు తర్వాత 70% ప్రభావం చూపించినట్లు తేలింది.

బ్రిటన్, బ్రెజిల్‌లలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ తర్వాత 'కోవిషిల్డ్‌' అత్యంత ప్రభావవంతమైన వ్యాక్సీన్‌గా తేలిందని సీరం ఇనిస్టిట్యూట్‌ వెల్లడించింది.

వ్యాక్సీన్‌ తీసుకున్న తర్వాత కలిగే దుష్పరిణామాలు, రోగ నిరోధక వ్యవస్థపై వ్యాక్సీన్‌ ప్రభావం అంచనా వేయడానికి ట్రయల్స్‌ను మూడు దశలుగా నిర్వహిస్తారు.

అయితే, భారతీయులపై వ్యాక్సీన్‌ ప్రభావాన్ని అంచనా వేసే బ్రిడ్జింగ్‌ స్టడీ నిర్వహించకుండానే తొందరపడి అనుమతించారని ఆల్‌ ఇండియా డ్రగ్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌ ఆరోపించింది.

అయితే బ్రిడ్జింగ్‌ స్టడీని ఫిబ్రవరిలో నిర్వహిస్తామని, వివిధ దేశాలు, జాతుల మనుషులు, వయో వర్గాలపై ఈ వ్యాక్సీన్‌ ప్రభావవంతంగా పని చేసినందున దీనిపై సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని సీరం ఇనిస్టిట్యూట్ చెబుతోంది.

కోవిడ్‌ వ్యాక్సీన్‌

కోవాగ్జిన్‌ ఎలా పని చేస్తుంది?

ప్రభుత్వ సహకారంలో గత 24 ఏళ్లుగా వ్యాక్సీన్‌లను తయారు చేస్తూ భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే 16 రకాల వ్యాక్సీన్‌లను 123 దేశాలకు సరఫరా చేసిన చరిత్ర భారత్‌ బయోటెక్‌కు ఉంది.

మృత కరోనా వైరస్‌ను శరీరంలోకి పంపడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థను యాక్టివేట్‌ చేసి కరోనా వైరస్‌పై దాడి చేసేలా ప్రేరేపించడం కోవాగ్జిన్‌ పని. 4 వారాల వ్యవధిలో 2 డోసులుగా ఈ వ్యాక్సీన్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని కూడా 2 - 8 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నిల్వ చేయవచ్చు.

70 కోట్ల డోసులను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న భారత్‌ బయోటెక్‌ ఇప్పటే 2 కోట్ల డోసులను సిద్ధం చేసింది. ఈ ఏడాది చివరికల్లా రెండు ప్రాంతాలలో ఉన్న తమ నాలుగు తయారీ కేంద్రాల నుంచి ఉత్పత్తి చేస్తామని ఆ సంస్థ వెల్లడించింది.

కోవిడ్‌ వ్యాక్సీన్‌

కోవాగ్జిన్‌ చుట్టూ వివాదాలేంటి ?

పరిమిత సంఖ్యలో, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ వ్యాక్సీన్‌ను ఉపయోగించాలని, దానికి ముందు అన్ని జాగ్రత్తలు పాటించాలని డ్రగ్‌ కంట్రోల్ అథారిటీ స్పష్టం చేసింది. కానీ ట్రయల్స్‌ కొనసాగుతుండగానే అత్యవసర పరిస్థితుల్లో వాడటానికి ఎలా అనుమతించారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.అయితే కోవాగ్జిన్‌ వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవని, ఇది సురక్షితమైనదని భారత్‌ బయోటెక్‌ అంటోంది.

పూర్తిస్థాయిలో పరీక్షలు, ట్రయల్స్‌ నిర్వహించకుండానే అనుమతించడం ఆశ్చర్యకరంగా ఉందని ఆల్‌ ఇండియా డ్రగ్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌ వ్యాఖ్యానించింది. వ్యాక్సీన్‌ పని తీరుపై భారత్‌ బయోటెక్ ఇస్తున్న డేటాలో స్పష్టత లేదని కూడా ఆరోపించింది.

వ్యాక్సీన్‌ పనితీరుకు సంబంధించిన పూర్తి డేటాను ఫిబ్రవరి నాటికి అందిస్తామని పేర్కొన్న భారత్‌ బయోటెక్‌, రెండో దశ ట్రయల్స్‌ పూర్తయ్యాక అత్యవసర పరిస్థితుల్లో దీన్ని వాడేందుకు భారతీయ చట్టాలు అనుమతిస్తునాయని తెలిపింది.

టీకా

భారత్‌లో ఇంకా ఏయే కంపెనీలు వ్యాక్సీన్‌ తయారు చేస్తున్నాయి ?

కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌‌లతోపాటు భారత్‌లో మరికొన్ని ఫార్మా సంస్థలు కోవిడ్ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. వీటి తయారీ వివిధ దశల్లో ఉంది.

  • ZyCoV-D : డీఎన్ఏ ప్లాట్‌ఫాంపై అహ్మదాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న జైడస్‌-కాడిలా ఈ వ్యాక్సీన్ తయారు చేస్తోంది.
  • అమెరికాకు చెందిన డైనవాక్స్‌, బేలర్‌ కాలేజ్‌ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఈ అనే ప్రైవేట్‌ ఫార్మా సంస్థ వ్యాక్సీన్‌ను రూపొందిస్తోంది
  • HGCO 19: అమెరికా హెచ్‌డీటీ ఎంఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సీన్‌ను పుణెలోని జినోవా అనే కంపెనీ ఉత్పత్తి చేస్తోంది.
  • భారత్‌ బయోటెక్‌ నుంచి ముక్కు ద్వారా పంపే ఓ వ్యాక్సీన్‌ తయారవుతోంది.
  • రష్యాకు చెందిన గమాలేయా నేషనల్ సెంటర్‌ రూపొందించిన స్పుత్నిక్‌-వి వ్యాక్సీన్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ఉత్పత్తి చేస్తోంది.
  • NVX-CoV2373: సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ ఇండియా అమెరికా వ్యాక్సీన్‌ తయారీ కంపెనీ నోవాక్స్‌తో కలిసి మరో వ్యాక్సీన్‌ను తయారు చేస్తోంది.
కోవిడ్‌ వ్యాక్సీన్‌

వ్యాక్సీన్‌ కోసం ఇండియాతో ఏయే దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి ?

సెషెల్స్, మయన్మార్, నేపాల్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవులు, భూటాన్‌లకు ఇప్పటికే భారత్‌ నుంచి తొలి డోసు వ్యాక్సీన్‌ సరఫరా పూర్తయింది.

శ్రీలంక, అప్గానిస్తాన్‌, మారిషస్‌ల ప్రభుత్వాల నుంచి క్లియరెన్స్‌ రాగానే సరఫరాకు వ్యాక్సీన్‌ సిద్ధంగా ఉంది. దేశీయ అవసరాలు, అంతర్జాతీయ డిమాండ్ల ఆధారంగా వ్యాక్సీన్‌ను సరఫరా చేస్తామని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Coronavirus vaccines given in india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X