కేంద్రం సంచలన ప్రతిపాదన, దగ్గు మందు బ్యాన్!

ఇంట్లో పసిపిల్లలు దగ్గుతున్నారంటే చాలు.. వెంటనే మెడికల్ షాపుకు వెళ్లి ఒక సిరప్ బాటిల్ తెచ్చే అలవాటు మనలో చాలా మందికి ఉంది. అయితే, ఇలాంటి స్వయం వైద్యం పసిప్రాణాల మీదకు తెస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేషనల్ ఫార్ములేరీ ఆఫ్ ఇండియా (NFI) 2026 ముసాయిదాలో భాగంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విప్లవాత్మక మార్పులకు సిద్ధమవుతోంది.

ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ (IPC) సిద్ధం చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, చిన్నారుల చికిత్సలో వాడే మందుల విషయంలో కీలక మార్పులు రానున్నాయి. ముఖ్యంగా రెండు సంవత్సరాల లోపు పిల్లలకు ఎలాంటి దగ్గు లేదా జలుబు సిరప్‌లను వైద్యులు సూచించరాదు (Prescribe), ఫార్మసిస్ట్‌లు పంపిణీ చేయకూడదు. ఐదేళ్ల లోపు పిల్లలకు కూడా ఈ మందులను వాడటాన్ని వీలైనంత వరకు నిరుత్సాహపరచాలి. ఒకవేళ అత్యవసరమైతే, క్లినికల్ పరీక్షలు మరియు నిశిత పర్యవేక్షణ తర్వాతే సిఫార్సు చేయాలి.

Cough Syrup Ban for Toddlers Government Proposes Stricter Norms to Prevent Contamination and Child Deaths

ఎందుకు ఈ నిర్ణయం?

గత ఏడాది (2025) నాసిరకం దగ్గు సిరప్‌ల కారణంగా విదేశాల్లోనూ, స్వదేశంలోనూ జరిగిన విషాద సంఘటనలు యావత్ ప్రపంచాన్ని కుదిపేశాయి. సిరప్‌ల తయారీలో వాడే ద్రావకాలలో డీథైలిన్ గ్లైకాల్ (DEG), ఇథిలిన్ గ్లైకాల్ (EG) వంటి ప్రమాదకర రసాయనాలు కలవడం వల్ల చిన్నారుల కిడ్నీలు దెబ్బతిని మరణాలు సంభవించాయి. ఈ 'విషతుల్య' మలినాలకు చెక్ పెట్టడమే కేంద్రం ప్రధాన ఉద్దేశం.

ఫార్మా కంపెనీలకు కఠిన ఆదేశాలు

కేవలం వైద్యులకే కాకుండా, మందుల తయారీ సంస్థలపై కూడా ఐపీసీ బాధ్యతను పెంచింది. తయారీదారులు ఫార్మాకోపియల్-గ్రేడ్ ద్రావకాలను మాత్రమే వాడాలని, రిజిస్టర్డ్ లేబొరేటరీలలో ముడిపదార్థాలు మరియు తుది ఉత్పత్తులను బ్యాచ్‌ల వారీగా పరీక్షించి, సవివర రికార్డులను నిర్వహించాలని స్పష్టం చేసింది. ఇండియన్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (IDMA) వంటి పరిశ్రమ సంఘాలు ప్రస్తుతం ఈ ముసాయిదాను సమీక్షిస్తున్నాయి.

వైద్య నిపుణులు ఏమంటున్నారు?

దగ్గు అనేది ఒక జబ్బు కాదు, అది శరీరంలోకి చేరిన వ్యర్థాలను లేదా ఇన్‌ఫెక్షన్లను బయటకు పంపే ఒక "సహజ రక్షణ ప్రతిచర్య" (Natural Defense Mechanism) అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. చిన్న పిల్లల్లో దగ్గు సిరప్‌ల వల్ల కలిగే ప్రయోజనం కంటే, వాటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ (దుష్ప్రభావాలు) ప్రమాదమే ఎక్కువని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సిరప్‌లకు బదులుగా పిల్లలకు సరైన హైడ్రేషన్ (ద్రవ పదార్థాలు), సెలైన్ నాజల్ డ్రాప్స్ అందించడం లేదా ఏడాది దాటిన పిల్లలకు తేనె వంటి సహజ వనరులను వాడాలని వారు సూచిస్తున్నారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ ప్రతిపాదన పట్ల ప్రజారోగ్య నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లక్షణాలను అణచివేయడం కంటే, దగ్గుకు గల మూల కారణాన్ని గుర్తించి చికిత్స చేయడమే సరైన పద్ధతి. కలుషిత మందుల విక్రయాలకు అడ్డుకట్ట వేయడం ద్వారా భారతదేశం తన 'ప్రపంచ ఫార్మా హబ్' ఖ్యాతిని నిలబెట్టుకోవడంతో పాటు, రేపటి పౌరుల ప్రాణాలకు భద్రత కల్పించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+