అమీర్ వ్యాఖ్యలపై భర్తతో ఘర్షణ: మహిళ ఆత్మహత్య
జబల్పూర్: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారం రేపుతూనే ఉన్నాయి. అమీర్ వ్యాఖ్యలపై ఓ ఇద్దరు దంపతులు తీవ్రంగా గొడవ పడ్డారు. భర్తతో ఘర్షణ అనంతరం మనస్తాపానికి గురైన మహిళ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జబల్పూర్‌కు చెందిన అయంక్ పాండే, అతని భార్య సోనల్ స్థానిక లహిరి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. కాగా, రెండ్రోజుల క్రితం అమీర్ ఖాన్ అసహనంపై చేసిన వ్యాఖ్యలు వీరిద్దరి మధ్య గొడవకు దారితీశాయి.
ఒకరు అమీర్ వ్యాఖ్యలను సమర్థించగా, మరొకరు ఖండిస్తూ వాదనలకు దిగారు. ఈ గొడవతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణగా మారింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సోనల్ విషం తాగేసింది. గమనించిన భర్త పాండే.. ఆమెను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించాడు.

కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోనల్ మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. కుటుంబసభ్యులను విచారించిన పోలీసులు, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అసహనం పెరిగిపోతోందని, తన భార్య దేశం విడిచి వెళ్లిపోదామని చెప్పిందని రెండ్రోజుల క్రితం అమీర్ ఖాన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దేశంలో ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. కొందరు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, ఎక్కువ మంది అమీర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. కాగా, తాను దేశం విడిచి వెళ్లనని, భారతీయుడిగా గర్విస్తున్నానని బుధవారం అమీర్ ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications