వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్‌-19: దేశంలో 67.6 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు- ప్రెస్‌ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కోవిడ్ యాంటీ బాడీస్

దేశంలో ఇప్పటివరకు మూడింట రెండొంతుల మంది కోవిడ్‌కు గురైనట్లు ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ తెలిపారని ఈనాడు దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

దేశంలోని 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో జూన్‌-జులై నెలల్లో నిర్వహించిన నాలుగో సీరో సర్వే ఆధారంగా ఈ విషయం వెల్లడిస్తున్నట్లు ప్రకటించారు.

ఇదివరకు నిర్వహించిన మూడు సర్వేలకు భిన్నంగా ఈసారి 6-17 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలు సహా మొత్తం 28,975 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించినట్లు చెప్పారు. ఇందులో పాల్గొన్న పెద్దల్లో 12,607 మంది (62.2%) ఎలాంటి టీకా తీసుకోలేదని, 5,038 మంది (24.8%) ఒక డోసు, 2,631 మంది (13%) రెండు డోసులు తీసుకున్నట్లు తెలిపారు.

మొత్తంగా 67.6% మందిలో యాంటీబాడీలు కనిపించినట్లు చెప్పారు. 6-9 ఏళ్ల వయస్సులో 57.2%మందిలో, 10-17 ఏళ్ల వయస్సులో 61.6%, 18-44 వయస్సులో 66.7%, 45-6 ఏళ్ల వయస్సులో 77.6%, 60 ఏళ్ల పైబడిన వారిలో 76.7% మందిలో యాంటీబాడీలు ఉన్నాయన్నారు.

పురుషుల్లో 65.8% మందిలో సీరో పాజిటివిటీ రేటు కనిపించగా మహిళల్లో 69.2% మందిలో కనిపించినట్లు చెప్పారు.

రెండు డోసులు తీసుకున్నవారిలో 89% మందిలో యాంటీబాడీలు ఉన్నాయని బలరాం భార్గవ వివరించారు.

ఈ ఫలితాలను బట్టి చూస్తే.. ఇప్పటి వరకు మూడింట రెండొంతుల మంది కోవిడ్‌కు గురైనట్లు తెలుస్తోందని, ఇంకా 40 కోట్ల మందిలో యాంటీబాడీలు కనిపించనందున వారందరూ వైరస్‌ బారిన పడడానికి అవకాశం ఉందన్నారు.

ఇప్పటివరకు యాంటీబాడీలు కనిపించని 40కోట్ల మంది ఇన్‌ఫెక్షన్‌ ద్వారా కాకుండా టీకా తీసుకోవడం ద్వారా వాటిని తెచ్చుకోవాలని సూచించారు.

ఇప్పటికీ ప్రతి ముగ్గురిలో ఒకరు కోవిడ్‌-19కు గురవడానికి అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని భార్గవ సూచించారని ఈనాడు వివరించింది.

భూముల ధరలు పెంపు

తెలంగాణలో భూముల విలువ పెంపు

తెలంగాణలో భూముల విలువలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకున్నట్లు నమస్తే తెలంగాణ పత్రిక వివరించింది.

ఈ నెల 22 నుంచి కొత్త విలువలు, చార్జీలు అమల్లోకి వస్తాయి. ఎనిమిదేండ్ల తర్వాత రాష్ట్రంలో భూముల విలువలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరిగాయి.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. 22వ తేదీన రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి స్లాట్‌ బుక్‌ చేసుకొని, స్టాంప్‌ డ్యూటీ చెల్లించినవారికి కూడా పెరిగిన ధరలు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

ఇందుకోసం ధరణిలో 'అడిషనల్‌ పేమెంట్స్‌ ఫర్‌ స్లాట్స్‌ ఆల్‌రెడీ బుక్డ్‌' అనే అప్షన్‌ ఇస్తున్నట్లు తెలిపింది.

ఈ ఆప్షన్‌లోకి వెళ్లి అదనపు చార్జీలు చెల్లించాలని సూచించింది. సందేహాల నివృత్తికోసం ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ ఏర్పాటుచేసింది.

రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువలను వాటి ప్రస్తుత ధర ప్రకారం వర్గీకరించి నిర్ణయించారు. ఇందులోనూ ప్రస్తుత విలువను సగటున లెక్కగట్టి నిర్ధారించారు.

వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువలను మూడు శ్లాబులుగా (50, 40, 30 శాతాలుగా) పెంచారు.

గతంలో మార్కెట్‌ విలువ ఒక్కొక్కచోట ఒక్కో రకంగా ఉండేది. ఇప్పుడు కనిష్ఠంగా ఎకరానికి రూ.75 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది.

అన్నింటా ఏకరీతిలో చార్జీల పెరుగుదల ఉంటుంది. ఓపెన్‌ ప్లాట్ల విషయంలోనూ ఇదే సూత్రాన్ని అనుసరించారు. చదరపు గజానికి కనీసధర గతంలో రూ.100 ఉండేది.

ఇప్పుడు దీన్ని కనిష్ఠంగా రూ.200 పెంచింది. ఇక్కడ కూడా 50, 40, 30 శాతాలుగా మూడు శ్లాబుల్లో మార్కెట్‌ విలువలను పెంచారు.

వాస్తవానికి రాష్ట్రంలో ఎక్కడా అసలు ధర రూ.100 చదరపు గజానికి లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కనిష్ఠ ధరలను పెంచారు.

అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగుకు కనిష్ఠంగా రూ.800 ఉండగా దీన్ని రూ.వెయ్యికి పెంచారు. చదరపు అడుగుపై 20, 30 శాతం చొప్పున స్థూలంగా చార్జీలను పెంచారని నమస్తే తెలంగాణ వివరించింది.

టిక్ టాక్

టిక్ టాక్ పేరు మార్చుకుని మళ్లీ భారత్‌లోకి వస్తోందా

భారత్‌లో నిషేధించిన టిక్ టాక్ యాప్ పేరు మార్చుకుని మళ్లీ దేశంలోకి అడుగుపెడుతోందని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక కథనం ప్రచురించింది.

ఆ యాప్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ కొత్తగా టిక్‌టాక్‌ (Tik Tok) అనే పేరును ట్రేడ్‌మార్క్‌ కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఇదే అనుమానాన్ని టెక్‌ నిపుణులు వ్యక్తం చేస్తున్నారని పత్రిక రాసింది.

ఆ దరఖాస్తును బైట్‌ డ్యాన్స్‌ సంస్థ ఈ నెల 6న దాఖలు చేసిందని టెక్నాలజీ నిపుణుడు ముకుల్‌ శర్మ ట్వీట్‌ చేశారు.

దీనిపై ఆ సంస్థ నుంచి అధికారిక ప్రకటన ఏదీ లేకపోయినప్పటికీ.. తమ సంస్థ భారత్‌లోకి తిరిగి ప్రవేశించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సంస్థ వర్గాలు తెలిపినట్లు కొన్ని టెక్‌ వెబ్‌సైట్లు పేర్కొన్నాయి.

పబ్‌జీ ఇప్పటికే బ్యాటిల్‌గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా పేరిట భారత్‌లో అడుగుపెట్టగా టిక్‌టాక్‌ అదే దారిన పయనించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కూతురిపై అత్యాచారం

తండ్రి స్థానంలో ఉంటూ అత్యాచారం చేశాడు

తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి 14 ఏళ్ల కుమార్తెపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరిగిందని సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది.

ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. వెంకటగిరి మునిసిపాలిటీ పరిధిలో దళితవాడకు చెందిన అంజయ్య తన భార్యతో విడిపోయాడు.

తర్వాత ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్న మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. అనంతరం ఆమెను వివాహం చేసుకున్నాడు.

అప్పటి నుంచి ఆ మహిళ, తన ఇద్దరు బిడ్డలతో అంజయ్యతో కలిసి ఉంటోంది. ఆమె కుమార్తెపై కన్నేసిన అంజయ్య గత 6 నెలల నుంచి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.

బాలిక తల్లికి చెప్పుకున్నా ప్రయోజనం లేకపోయింది. గత ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో చూసి బాలికపై అత్యాచారం చేసేందుకు అంజయ్య యత్నించాడు.

ఇది గమనించిన పదేళ్ల కుమారుడు కేకలు వేయగా స్థానికులు ఇంటివద్దకు చేరుకున్నారు. దీంతో గుట్టు రట్టయింది.

అంజయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానిక మహిళా సంఘం నాయకురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ వెంకటరాజేష్‌ విచారించి నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి మంగళవారం రాత్రి బాధితుల నివాసం వద్దకు వెళ్లి ఘటనపై ఆరా తీశారని సాక్షి వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid-19: Corona antibodies in 67.6% of people in the country
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X