దేశంలో కరోనా: పెరిగిన మరణాలు -నిన్న 955మంది బలి, కొత్తగా 43,071 కేసులు -35కోట్లు దాటిన టీకాలు
దేశంలో కరోనా రెండో దశ విలయం క్రమంగా అదుపులోకి వస్తోన్న వేళ, రోజువారీ మరణాల సంఖ్య మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. తొలి వేవ్ తో పోల్చుకుంటే రెండో వేవ్ లో 30 శాతం అధికంగా మరణాలు నమోదుకావడం తెలిసిందే. కొత్త కేసుల క్రమంగా తగ్గుతూ, రికవరీలు భారీగా ఉండటంతో యాక్టివ్ కేసులు దాదాపుగా అదుపులోకి వచ్చాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగం పుంజుకుంది. వివరాలివి..
కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం, గడిచిన 24 గంటల్లో 18,38,490 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 43,071 కేసులు వెలుగులోకివచ్చాయి. అంతకుముందు రోజుతో పోల్చితే 2 శాతం తక్కువగా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,05,45,433కుపెరిగింది. ఇప్పటి వరకు జరిపిన టెస్టుల సంఖ్య 41.28 కోట్లకు చేరింది.

కిందటి రోజుతో పోల్చుకుటే నిన్న దేశంలో కొవిడ్ మరణాల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో 955 మంది మహమ్మారి కాటుకు బలయ్యారు. దేశంలో కొవిడ్ మరణాల సంఖ్య 4,02,005కు చేరింది. నిన్న ఒక్క రోజే 52,299 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, రికవరీల సంఖ్య 2,96,58,078కి పెరిగింది. దేశంలో రికవరీ రేటు 97.09 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కొవిడ్ కేసుల సంఖ్య 4,85,350గా ఉంది. జూన్ 21 నుంచి దేశంలో నాలుగో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకాగా, ఇప్పుడది వేగంగా సాగుతున్నది. నిన్న ఒక్కరోజే 63,87,849 మందికి టీకాలు అందించారు. అంతా కలిపి ఇప్పటి వరకూ 35,12,21,306 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications