మహారాష్ట్రలో కొత్త కరోనా నిబంధనలు : థియేటర్లు, ప్రైవేట్ ఆఫీసుల 50 శాతం సామర్థ్యంతోనే..
ముంబై: మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కరోనా కేసులు రోజు రోజుకూ భారీగా పెరుగుతుండటంతో శుక్రవారం మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆడిటోరియంలు, థియేటర్లు, ప్రైవేట్ కార్యాలయాలకు నిబంధనలను జారీ చేసింది. 50 శాతం సామర్థ్యంతోనే నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. మార్చి 31 వరకు ఈ నిబంధనలను అమలులో ఉంటాయని తెలిపింది.
ఆడిటోరియం/థియేటర్లకు మార్గదర్శకాలు
సినిమా థియేటర్లు, ఆడిటోరియంలలో నిర్వహించే ఏ మత, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలైనా 50 శాతం సామర్థ్యంతోనే నిర్వహించుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మాస్కులు లేకుండా ఎవరినీ అనుమతించకూడదని తేల్చి చెప్పింది. అలాగే వచ్చేవారి శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేయాలని తెలిపింది. శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

'ఈ ఉత్తర్వును ఉల్లంఘించినట్లయితే.. కోవిడ్ -19 మహమ్మారి విపత్తు కేంద్ర చట్టం కింద.. డ్రామా థియేటర్లు / ఆడిటోరియంలు కొంతకాలం మూసివేయబడతాయి. ఉల్లంఘన ప్రాంగణ యజమానికి విపత్తు చట్టం ప్రకారం జరిమానాలను కూడా విధించడం జరుగుతుంది,అని మహారాష్ట్ర సర్కారు తెలిపింది.
ఇక ప్రైవేట్ కార్యాలయాలు 50 శాతం సామర్థ్యంతో కార్యకలాపాలు కొనసాగించాలని స్పష్టం చేసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయాలని తెలిపింది. ఇక తయారీ పరిశ్రమలు మాత్రం కరోనా నిబంధనలు పాటిస్తూ పూర్తిస్థాయి సామర్థ్యంలో కార్యకలాపాలు కొనసాగించవచ్చని పేర్కొంది.
కాగా, దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రంలోనే నమోదవుతుండటం గమనార్హం గురువారం ఒక్క రోజే 25,833 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 65 శాతం యాక్టివ్ కేసులు మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. మహారాష్ట్రతోపాటు తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, హర్యానా రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.












Click it and Unblock the Notifications