జనవరి చివరికి ఓమిక్రాన్ సునామీ- రోజుకు 10 లక్షల కేసులు-తాజా అంచనాలు
భారత్ లో కోవిడ్ 19 కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గత 24 గంట్లలో నమోదైన లక్షకు పైగా కేసులు ఏడు నెలల గరిష్టం కాగా.... ఈ సంఖ్య మరో 20 రోజుల్లోనే రోజుకు పది లక్షలకు చేరబోతోందని తాజా అంచనాలు చెప్తున్నాయి. దీంతో ఈ నెలాఖరు కల్లా కోవిడ్ ధర్డ్ వేవ్ పీక్ కు చేరబోతోందని తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఈ సంఖ్య మరింత భారీగా పెరగవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో ఓమిక్రాన్ కేసులతో కూడిన ఈ ధర్డ్ వేవ్ భారత్ లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

ఓమిక్రాన్ సునామీ
భారత్ లో కోవిడ్ ముప్పు ఓమిక్రాన్ వైరస్ రూపంలో ముంచుకొస్తోంది. ఇప్పటికే దాదాపు 15 రాష్ట్రాల్లో ఓమిక్రాన్ వైరస్ కేసులు నమోదవుతుండగా.. ఢిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వీటి పరిస్ధితి మరింత దారుణంగా ఉంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూలు, పగటి పూట ఆంక్షలు అమల్లోకి వచ్చేశాయి. పరిస్ధితి మరింత విషమిస్తే లాక్ డౌన్ లు విధించేందుకు సైతం ఆయా రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. భారత్ లో పెరుగుతున్న ఓమిక్రాన్ వైరస్ కేసులకు తోడు డెల్టా వేరియంట్ లతో పాటు ఇతర వేరియంట్లు కూడా విరుచుకుపడుతున్నాయి.

ఏడునెలల గరిష్టానికి కేసులు
దేశవ్యాప్తంగా గత 24 గంట్లలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. గతంలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఈ స్ధాయిలో కేసులు నమోదు కాగా.. మరోసారి అలాంటి పరిస్ధితే కనిపిస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే కేసులు రెట్టింపయ్యాయి. ఓమిక్రాన్ వైరస్ వ్యాప్తి చాలా వేగంగా సాగుతోంది. దీంతో మిగతా కేసులతో కలిపి ఈ కేసులు కూడా ఎక్కువై కోవిడ్ ధర్డ్ వేవ్ భయాల్ని మరింత పెంచేస్తున్నాయి. రోజుకు కనీసం 20 నుంచి 30 వేల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ లెక్కల త్వరలో కరోనా ధర్డ్ వేవ్ పీక్ కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

నెలాఖరుకు రోజుకు 10 లక్షలు
ఈ నెలాఖరు నాటికి ఓమిక్రాన్ వైరస్ తో కూడిన కరోనా కేసుల సంఖ్య రోజుకు 10 లక్షలు నమోదు కావచ్చన్న అంచనాలు దేశాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పరిశోధన సంస్ధ ఐఐఎస్సీ-ఐఎస్ఐ తాజా నిర్వహించిన మోడలింగ్ అధ్యయనం ప్రకారం ఈ నెలాఖరుకు కరోనా ధర్డ్ వేవ్ పీక్ లో ఉంటుందని, రోజుకు 10 లక్షల కేసులు నమోదు కావడం ఖాయమని అంచనా వేసింది. ఫిబ్రవరిలో ఈ సంఖ్య మరింత పెరగవచ్చని కూడా చెబుతోంది. ఇప్పటికే కాన్పూర్ ఐఐటీ పరిశోధనలోనూ ఇదే విషయం వెల్లడైంది. దీంతో ఈ నెలాఖరుకు కరోనా ధర్డ్ వేవ్ పీక్ కు చేరడం ఖాయమని తేలిపోయింది.

పతాకస్ధాయికి ధర్డ్ వేవ్
భారతదేశంలో కరోనావైరస్ ధర్డ్ వేవ్ గరిష్ట స్థాయి జనవరి చివరి వారం నుంచి మొదలై ఫిబ్రవరి తొలి రెండు వారాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే వివిధ రాష్ట్రాలు వేర్వేరు స్ధాయిలు కలిగి ఉంటాయని కూడా తాజా నివేదికలు చెప్తున్నాయి. వివిధ రాష్ట్రాలలో మూడవ వేవ్ యొక్క గరిష్ట స్థాయి జనవరి మధ్య నుండి ఫిబ్రవరి మధ్య వరకు మారుతూ ఉంటుందని తెలుస్తోంది. భారతదేశానికి కోవిడ్-19 ధర్డ్ వేవ్ తగ్గుదల మార్చి-ప్రారంభం నాటికి ఉండే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications