వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్-19 వ్యాక్సీన్: దుష్ప్రభావాలు వస్తే ఏం చేయాలి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వ్యాక్సినేషన్

దేశంలో మే 1 నుంచి నాలుగో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. నాలుగో దశలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వారికి వ్యాక్సీన్లు ఇస్తున్నారు.

ఈ దశలో వ్యాక్సీన్ వేయించుకోవాలని అనుకునేవారిని కొన్ని అనుమానాలు తొలచివేస్తూ ఉండొచ్చు. వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి అని చాలా మంది ఆన్‌లైన్‌లో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

తొలి దశ వ్యాక్సినేషన్‌కు ముందు ''దుష్ప్రభావాల’’పై పెద్దయెత్తున చర్చ జరిగింది. అయితే, చాలా కొద్ది మందిలో మాత్రమే దుష్ప్రభావాలు కనిపించాయి.

కాబట్టి, టీకా వేసుకున్న తర్వాత వచ్చే అవకాశముండే దుష్ప్రభావాలు (అడ్వెర్స్ ఎఫెక్ట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్– ఏఈఎఫ్‌ఐ) గురించి తెలుసుకోవడం చాలా అవసరం.

వైరస్

ఏఈఎఫ్‌ఐ అంటే ఏమిటి?

వ్యాక్సినేషన్ అనంతరం వచ్చే దుష్ప్రభావాలపై తొలి దశ టీకాల సమయంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి డా. మనోహర్ అజ్ఞాని మాట్లాడారు.

''వ్యాక్సినేషన్ తర్వాత ఊహించని ఎలాంటి వైద్యపరమైన సమస్య అయినా అడ్వెర్స్ ఎఫెక్ట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ – ఏఈఎఫ్‌ఐగా చెబుతారు. అది వ్యాక్సీన్ వల్లే రావొచ్చు. లేదా వేరే ఇతర కారణాల వల్ల అయినా వచ్చి ఉండొచ్చు. ఇలాంటి దుష్ప్రభావాలు మూడు రకాలు. వీటిలో మొదటిది స్వల్పమైనవి. రెండోది సీరియస్. మూడోది చాలా సీరియస్’’అని ఆయన చెప్పారు.

''మొదటి దశ వ్యాక్సినేషన్‌లో బయటపడిన దుష్ప్రభావాల్లో చాలావరకు స్వల్పమైనవే ఉన్నాయి. ఇంజెక్షన్ వల్ల వచ్చిన నొప్పి, వాపు, స్వల్ప జ్వరం, ఒళ్లు నొప్పులు, అలర్జీలు, దద్దుర్లు లాంటివి దీనిలో ఉన్నాయి’’.

కొన్నిసార్లు దుష్ప్రభావాలు తీవ్రంగా ఉంటాయి. వీటిని సీరియస్ సైడ్‌ఎఫెక్ట్స్‌గా చెబుతారు. ఇలాంటి కేసుల్లో టీకాలు తీసుకున్నవారిలో జ్వరం ఎక్కువగా ఉంటుంది. కొందరిలో తీవ్రమైన ఎలర్జీ ''ఎనఫిలాక్సిస్’’ ఉంటుంది. అయితే, ఇలాంటి దుష్ప్రభావాలతో ప్రాణాలకు పెద్దగా ముప్పు ఉండదు. ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరమూ రాకపోవచ్చు.

కానీ కొన్ని కేసుల్లో సీరియస్ సైడ్ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. వ్యాక్సీన్ తీసుకున్న వారు ఆసుపత్రుల్లో చేరే పరిస్థితి కూడా రావొచ్చు. వీటిని వెరీ సివియర్ కేసులుగా పరిగణిస్తారు. ఇలాంటి కేసుల్లో వ్యాక్సీన్ తీసుకున్న వ్యక్తి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. లేదా తీవ్రమైన లేదా శాశ్వతంగా ఉండిపోయే అనారోగ్య సమస్యలూ రావొచ్చు. ఇలాంటి కేసులు చాలా తక్కువగా ఉంటాయి. అయితే, ఈ కేసులు మొత్తం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్నే ప్రభావితం చేస్తుంటాయి.

భారత్‌లో వ్యాక్సినేషన్ అనంతరం చాలా కొద్దిమంది మాత్రమే ఆసుపత్రుల్లో చేరారు.

''వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇలాంటి ప్రభావాలు కనిపించే అవకాశం 5 నుంచి 10 శాతం లోపలే ఉంటుంది’’అని దిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ బీఎల్ షేర్వాల్ తెలిపారు.

కరోనా వ్యాక్సీన్

ఎనఫిలాక్సిస్ అంటే?

వ్యాక్సినేషన్ తర్వాత తీవ్రమైన అలర్జీ వస్తే దాన్ని ఎనఫిలాక్సిస్‌గా పిలుస్తారని బీబీసీతో షేర్వాల్ చెప్పారు. దీనికి వ్యాక్సీన్ కారణం కాకపోవచ్చు. ''మీకు ఏదైనా ఔషధం అంటే ఎలర్జీ ఉంటే, ఇలాంటి దుష్ప్రభావాలు రావొచ్చు’’.

అడ్వెర్స్ ‌ఎఫెక్ట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ కిట్‌లో ఉండే ఇంజెక్షన్ తీసుకుంటే ఈ అలర్జీ తగ్గుతుంది. చాలాసార్లు దీని అవసరం కూడా ఉండదు.

అడ్వెర్స్ ఎఫెక్ట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్‌ కేసులు వస్తే ఏం జరుగుతుందో ఎయిమ్స్‌లోని హెడ్ ఆఫ్ మ్యూమన్ ట్రయల్స్ డాక్టర్ సంజయ్ రాయ్ బీబీసీతో మాట్లాడారు.

''టీకాలు వేసిన తర్వాత ఇలాంటి దుష్ప్రభావాలు వస్తే ఏం చేయాలో ముందే ప్రోటోకాల్స్ సిద్ధం చేస్తారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో ఎలా స్పందించాలో వైద్యులు, ఇతర సిబ్బందికి శిక్షణ ఇస్తారు’’.

''అందుకే, వ్యాక్సీన్ వేసుకున్న ప్రతి ఒక్కరినీ 30 నిమిషాలపాటు వ్యాక్సీన్ కేంద్రాల్లోనే ఉంచుతారు. ఆ సమయంలో ఏమైనా దుష్ప్రభావాలు ఉన్నాయేమో పర్యవేక్షిస్తారు. ఏమైనా దుష్ప్రభావాలు వస్తే వెంటనే స్పందించేందుకు ఒక కిట్ కూడా వైద్య సిబ్బందికి ఇస్తారు. దీనిలో కొన్ని ఇంజెక్షన్లు సహా కొన్ని వైద్య సామగ్రి ఉంటాయి’’.

తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే, వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి మనం వెళ్లాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఫామ్‌ను కోవిన్ యాప్‌లో పూరించాల్సి ఉంటుంది.

ఇలాంటి దుష్ప్రభావాలు తలెత్తకుండా ఉండేందుకు వ్యాక్సీన్ వేయించుకునే వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని టీకాలు వేసే సిబ్బంది, వైద్యులు ముందుగానే తెలుసుకుంటారు. ఒకవేళ అలర్జీ వచ్చే అవకాశముందని వైద్యులు అంచనా వేస్తే, భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. వారికి వ్యాక్సీన్ ఇవ్వకూడదు.

వ్యాక్సీన్‌ వేయకముందే, దాని వల్ల తల్తెత్తే దుష్ప్రభావాలను సదరు వ్యక్తికి తెలియజేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఇలాంటి సమాచారాన్ని వ్యాక్సీన్ వేసేముందు సదరు వ్యక్తికి సిబ్బంది చెబుతారు.

దుష్ప్రభావాలు తీవ్రంగా ఉంటే...

ఒకవేళ వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత తీవ్రమైన లక్షణాలతో ఎవరైనా చనిపోతే, ఏఈఎఫ్ఐ నిబంధనల ప్రకారం వైద్యుల బృందం దర్యాప్తు చేపట్టాల్సి ఉంటుంది.

ఒకవేళ తీవ్రమైన లక్షణాలతో మరణించిన వ్యక్తి ఆసుపత్రిలో చేరకపోతే, కుటుంబ సభ్యుల అనుమతితో శవపరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ కుటుంబం అంగీకరించకపోతే, వారు ప్రత్యేక ఫామ్‌ పూరించాల్సి ఉంటుంది.

ఒకవేళ ఆసుపత్రిలోనే మరణిస్తే, సదరు వ్యక్తి ఎలా మరణించారో సమగ్ర విచారణ జరిపించాల్సి ఉంటుంది. వ్యాక్సీన్‌లో ఉండే ఔషధం వల్ల మృతి సంభవించిందా? లేదా వ్యాక్సీన్‌లో నాణ్యతా లోపం వల్ల చనిపోయారా? వ్యాక్సీన్ వేయడంలో లోపాల వల్ల మృతిచెందారా? లేదా ఇతర కారణాల వల్ల మరణం సంభవించిందా? అనే అంశాలను విచారణలో తేలుస్తారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ప్రకారం.. దుష్ప్రభావానికి గల కారణాన్ని ప్రతి కేసు విషయంలోనూ వీలైనంత త్వరగా ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుంది.

''వ్యాక్సీన్ దుష్ప్రభావాల విషయంలో అనుసరించాల్సిన ప్రోటోకాల్స్‌ను ట్రయల్ డేటా ఆధారంగా సిద్ధంచేస్తారు. ఈ ట్రయల్స్ దీర్ఘకాలంపాటు కొనసాగుతాయి. కానీ భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించి దీర్ఘకాల సమాచారం లేదు. దీంతో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ప్రోటోకాల్స్‌ను సిద్ధం చేశారు’’అని ఎయిమ్స్‌లోని హ్యూమన్ ట్రయల్ హెడ్ డాక్టర్ సంజయ్ రాయ్ చెప్పారు.

వ్యాక్సినేషన్

ప్రతి వ్యాక్సినేషన్‌లోనూ ఒకేలాంటి దుష్ప్రభావాలు ఉంటాయా?

అన్ని వ్యాక్సీన్ల విషయంలోనూ దుష్ప్రభావాలు ఒకేలా ఉండవు. కొన్ని వ్యాక్సీన్లకు ఇవి కాస్త భిన్నంగా ఉంటాయి. వ్యాక్సీన్లు ఎలా తయారుచేస్తారు? వ్యాక్సీన్‌ను తీసుకునే వ్యక్తి రోగ నిరోధక శక్తి ఎలా ఉంది తదితర అంశాల బట్టీ దుష్ప్రభావాలు మారుతుంటాయి.

ఉదాహరణకు బీసీజీ వ్యాక్సీన్‌తో కొందరిలో వ్యాక్సీన్ వేసుకున్న చోట పొక్కు కనిపిస్తుంది. అదే డీపీటీ వ్యాక్సీన్‌తో కొంతమంది పిల్లల్లో స్వల్ప తీవ్రత గల జ్వరం వస్తుంది. పోలియో చుక్కల విషయంలో ఇవి కనిపించకపోవచ్చు.

వ్యాక్సీన్

కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ల దుష్ప్రభావాలు ఏమిటి?

కోవాగ్జిన్ ట్రయల్స్‌ను సంజయ్ రాయ్ దగ్గరుండి పరిశీలించారు. మూడు దశల కోవాగ్జిన్ ట్రయల్స్‌లో పెద్దగా ఎలాంటి దుష్ప్రభావాలూ కనిపించలేదని ఆయన వివరించారు.

కోవాగ్జిన్‌తో ఒళ్లు నొప్పులు, స్వల్ప తీవ్రత గల జ్వరం, టీకా వేసుకున్న చోట వాపు, దద్దుర్లు లాంటి స్వల్ప తీవ్రతగల దుష్ప్రభావాలు కనిపించొచ్చు. ట్రయల్‌లో కేవలం 10 శాతం మందిలోనే ఇలాంటి దుష్ప్రభావాలు కనిపించాయి. 90 శాతం మందిలో ఎలాంటి దుష్ప్రభావాలు లేవు.

కోవిషీల్డ్ వ్యాక్సీన్ విషయంలోనూ ఇంతే. స్వల్ప తీవ్రత గల జ్వరం, కొన్ని అలర్జీలు చాలా కొద్ది మందిలో కనిపించాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సీన్ కార్యక్రమాలను భారత ప్రభుత్వం చేపడుతోంది. దీనిలో భాగంగా పిల్లలు, గర్భిణులకు వ్యాక్సీన్లు ఇస్తున్నారు. పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా.. మూడు రోజుల్లోనే దాదాపు కోటి మంది పిల్లలకు టీకా ఇస్తున్నారు. ఎన్నో ఏళ్లనుంచీ భారత్ ఇంత భారీ టీకా కార్యక్రమాలను నడిపిస్తుందంటే.. టీకా అనంతర దుష్ప్రభావాల విషయంలో అనుసరించాల్సిన ప్రోటోకాల్స్‌ను చక్కగా పాటిస్తున్నట్లే.

వ్యాక్సినేషన్

వ్యాక్సీన్‌పై భయమూ ఓ కారణమా?

కొంతమంది వ్యాక్సీన్లు వేసుకునేటప్పుడు భయపడుతుంటారు. దుష్ప్రభావాలకు ఇది కూడా ఒక కారణమా?

వ్యాక్సీన్ తీసుకునేటప్పుడు భయపడటం అనేది దుష్ప్రభావాలకు కారణం కాదు. వ్యాక్సీన్ తీసుకునేటప్పుడు భయపడటానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా సరైన సమాచారం అందుబాటులో లేకపోవడం వీటిలో ప్రధానమైనది.

భారత్‌లో వ్యాక్సీన్ల విషయంలో ప్రజల్లో నెలకొన్న భయాందోళనలపై ''లోకల్ సర్కిల్స్’’ అనే సంస్థ ఓ అధ్యయనం చేపట్టింది. జనవరి 3నాటి సమాచారం ప్రకారం, కరోనా వ్యాక్సీన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి సుముఖంగా లేమని అధ్యయనంలో పాల్గొన్నవారిలో 69 శాతం మంది చెప్పారు.

భారత్‌లోని 224 జిల్లాల్లోని 18,000 మంది ఆన్‌లైన్ స్పందనల ఆధారంగా ఈ అధ్యయనం చేపట్టారు. సమయం గడిచేకొద్దీ ప్రజల్లో ఆందోళన కూడా పెరుగుతోందని సంస్థ తెలిపింది. అయితే, వ్యాక్సినేషన్ మొదలైన తర్వాత ఈ ఆందోళన పెరిగిందో లేదో చెప్పే అధ్యయనమేదీ అందుబాటులో లేదు.

వ్యాక్సీన్

mRNA విధానంపైనా సందేహాలు?

ప్రస్తుతం వివిధ దేశాల ప్రభుత్వాలు తొమ్మిది వ్యాక్సీన్లకు ఆమోదం తెలిపాయి. వీటిలో రెండు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సీన్లు ఉన్నాయి. అవి ఫైజర్, మోడెర్నా వ్యాక్సీన్లు. ఇలాంటి సాంకేతికతతో తయారుచేసిన వ్యాక్సీన్లను మనుషులపై ప్రయోగించడం ఇదే తొలిసారి. అయితే, వీటిని తీసుకొన్న కొందరిలో కొన్ని తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపించినట్లు డాక్టర్ సంజయ్ వివరించారు.

ఆ తొమ్మిది వ్యాక్సీన్లలో నాలుగు వ్యాక్సీన్లను వైరస్‌ను అచేతనం చేసి తయారు చేశారు. భారత్ దేశీయ వ్యాక్సీన్ కోవాగ్జిన్, చైనా వ్యాక్సీన్ ఇలానే అభివృద్ధి చేశారు.

ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా, స్పుత్నిక్ వి వ్యాక్సీన్లు వెక్టర్ సాంకేతికతతో తయారుచేశారు. వీటిని తీసుకున్న తర్వాత పెద్దగా తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపించలేదు.

(ఈ కథనాలను హిందీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తమిళ భాషల్లో కూడా అందుబాటులో ఉన్నాయి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid-19 vaccine: What to do if side effects occur
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X