వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్-19 వ్యాక్సీన్: టీకా వేసుకుంటే నపుంసకత్వం వస్తుందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కరోనా వ్యాక్సినేషన్

కోవిడ్-19‌కు కళ్లెం వేయడంలో వ్యాక్సీన్లు ప్రధాన పాత్ర పోషిస్తాయని ప్రజారోగ్య నిపుణులు చెబుతున్నారు. కరోనా నుంచి కాపాడుకోవాలంటే మనం రెండు డోసుల వ్యాక్సీన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య సమయాన్ని భారత ప్రభుత్వం పెంచింది.

ఇప్పటివరకు భారత్‌లో 22 కోట్ల డోసుల వ్యాక్సీన్‌ను ప్రజలకు ఇచ్చారు. అయితే, ఇప్పటికీ వ్యాక్సీన్లపై చాలా అపోహలు ప్రజల్లో ఉన్నాయి.

ఈ అపోహలు, ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానాల కోసం దిల్లీలోని మెదాంతా హాస్పిటల్ సీనియర్ వైరాలజిస్ట్ యతీన్ మెహ్తా, పీపుల్స్ హెల్త్ ఆర్గనైజేషన్ కార్యదర్శి ఈశ్వర్ గిలాడాలతో బీబీసీ మాట్లాడింది.

వీరు తమ అనుభవాలతో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అయితే, వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత లేదా తీసుకోక ముందు, ఎలాంటి సందేహాలున్నా వైద్యుల్ని సంప్రదించాలి.

కరోనా వ్యాక్సినేషన్

వ్యాక్సీన్లతో నపుంసకత్వం వస్తుందా?

యతీన్ మెహ్తా: దీనిలో ఎలాంటి నిజమూ లేదు. వ్యాక్సీన్‌తో కరోనావైరస్ సామర్థ్యం తగ్గుతుంది. మనుషులది కాదు..

ఈశ్వర్ గిలాడా: ఇలాంటి వదంతులు ప్రతి వ్యాక్సినేషన్ సమయంలోనూ వస్తాయి. గతంలోనూ చాలాసార్లు ఇలాంటివి చూశాం. వీటిలో ఎలాంటి నిజమూలేదు. ఇలాంటి వదంతులు వ్యాపింపజేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.

కరోనా వ్యాక్సినేషన్

గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోవచ్చా?

ప్రస్తుతం భారత్‌లో గర్భిణులకు కోవిడ్-19 వ్యాక్సీన్లు ఇవ్వడం లేదు. అయితే, ఈ విషయంపై చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

యతీన్ మెహ్తా: భారత్‌లో గర్భిణులకు వ్యాక్సీన్లు ఇవ్వడంపై ఇంకా అనుమతులు రాలేదు. దీనికి కారణం ఏమిటంటే, ఇంకా గర్భిణులపై క్లినికల్ ట్రయల్స్ పూర్తికాలేదు.

ఈశ్వర్ గిలాడా: గర్భంపై కోవిడ్-19 వ్యాక్సీన్ ఎలాంటి ప్రభావం చూపదని అధ్యయనాల్లో తేలింది. అమెరికా, బ్రిటన్, చైనాల్లో గర్భిణులకు వ్యాక్సీన్లు ఇస్తున్నారు. భారత్‌లో కూడా గర్భిణులు వ్యాక్సీన్ వేసుకునేందుకు అనుమతించాలి. వైద్యుల్ని సంప్రదించిన తర్వాత, గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోవాలి.

వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కరోనా సోకుతుందా?

యతీన్ మెహ్తా: వ్యాక్సినేషన్ ప్రభావం 14 రోజుల తర్వాత కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సీన్ అనంతరం శరీరంలో యాంటీబాడీలు సిద్ధం అయ్యేందుకు కొంత సమయం పడుతుంది. అంటే వ్యాక్సీన్ తీసుకోకముందు, మీకు వైరస్ సోకుంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముంది. అయితే, వ్యాక్సీన్ తీసుకుంటే వైరస్‌తో మన శరీరం మెరుగ్గా పోరాడుతుంది. ఇన్ఫెక్షన్ తీవ్రత అనేది మన శరీర స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది.

ఈశ్వర్ గిలాడా: దీన్ని బ్రెక్‌థ్రూ ఇన్ఫెక్షన్ అంటారు. ఇలాంటి కేసుల్లో చాలావరకు వ్యాక్సీన్ తీసుకోకముందే, శరీరంలోకి వైరస్ ప్రవేశించి ఉంటుంది. ఒక్కోసారి వ్యాక్సీన్ తీసుకున్న చోట లేదా ఆసుపత్రిలో వైరస్ సోకుతుంటుంది. అయితే, వ్యాక్సినేషన్ వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత సోకే ఇన్ఫెక్షన్లు, ప్రాణాంతకం కాదని అధ్యయనాలు చెబుతున్నాయి.

వ్యాక్సీన్ తీసుకుంటే రక్తం గడ్డకడుతుందా?

యతీన్ మెహ్తా: వ్యాక్సినేషన్ తర్వాత రక్తం గడ్డకట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. భారత్‌లో అయితే, ఈ అవకాశం ఇంకా తక్కువ. ముఖ్యంగా స్కాండినేవియా దేశాల్లోని వృద్ధుల్లో ఈ సమస్య కనిపిస్తోంది. ఇక్కడ అలాంటి భయాలు అక్కర్లేదు. భారత్‌లో ప్రతి పది లక్షల మందిలో కేవలం 0.61 శాతం మందికే ఈ ముప్పు ఉంటుందని భారత ప్రభుత్వం ఏర్పాటుచేసిన అడ్వాన్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ (ఏవీఎఫ్ఐ) కమిటీ తేల్చింది.

ఈశ్వర్ గిలాడా: మంచి నీటిని ఔషధాల రూపంలో ఎక్కించినా మన శరీరంలో కొన్ని దుష్ప్రభావాలు కనిపిస్తాయి. అలానే వ్యాక్సినేషన్ వల్ల కూడా కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. అయితే, మన దేశంలో ఇలా రక్తం గడ్డ కట్టడం చాలా అరుదు.

కరోనా వ్యాక్సినేషన్

వ్యాక్సీన్లలో పంది చర్మాన్ని ఉపయోగిస్తున్నారా?

యతీన్ మెహ్తా: ఇది ఒక వదంతు మాత్రమే. దీన్ని రుజువు చేసేందుకు ఎలాంటి ఆధారాలు లేవు.

ఈశ్వర్ గిలాడా: ఇలాంటి వదంతుల వల్ల కొన్ని వర్గాలు వ్యాక్సీన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. కానీ దీనిలో నిజంలేదు. చింపాంజీల్లో కనిపించే ఫ్లూ వైరస్‌ను మాత్రం కోవిషీల్డ్‌లో ఉపయోగించారు.

వ్యాక్సీన్ తీసుకున్నాక మాంసం తినొచ్చా?

యతీన్ మెహ్తా: హాయిగా తినొచ్చు.

ఈశ్వర్ గిలాడా: వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత, పెద్ద పార్టీ చేసుకోవచ్చు. మీకు ఏం కావాలంటే అది తినొచ్చు.

కరోనా వ్యాక్సినేషన్

వ్యాక్సీన్ తీసుకున్నాక ఆల్కహాల్ తాగొచ్చా?

యతీన్ మెహ్తా: వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత, కొన్ని రోజుల వరకు ఆల్కహాల్‌కు దూరంగా ఉంటే మంచిది.

ఈశ్వర్ గిలాడా: వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత, అది శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఎందుకంటే శరీరంలోకి వెళ్లిన తర్వాత, కొన్ని ప్రతిచర్యలు ఉంటాయి. అన్నీ సవ్యంగా ఉంటే, 12 గంటల తర్వాత తీసుకోవచ్చు.

వ్యాక్సీన్లలో మైక్రోచిప్‌లను వాడుతున్నారా?

యతీన్ మెహ్తా: వ్యాక్సీన్లలో చిప్‌లు ఎలా పెడతారు? ద్రవాల్లో చిప్‌లను పెట్టగలమా? ఇలాంటి వాదనల్లో అర్థమేలేదు.

ఈశ్వర్ గిలాడా: వ్యాక్సీన్ అనేది ఒక ద్రవం. దీన్ని సిరంజ్‌తో ఎక్కిస్తారు. మరి చిప్‌లను సిరంజ్‌లతో శరీరంలోకి ఎక్కించగలమా? ఇది వదంతు మాత్రమే.

కరోనా వ్యాక్సినేషన్

వ్యాక్సీన్ తీసుకున్నాక టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వస్తుందా?

యతీన్ మెహ్తా: వ్యాక్సీన్ తీసుకున్నాక పరీక్ష చేయించుకుంటే, పాజిటివ్ రావడం అనేది ఉండదు. మీకు ఇన్ఫెక్షన్ సోకి వుంటే పాజిటివ్ వస్తుంది.

ఈశ్వర్ గిలాడా: దీనిపై లఖ్‌నవూలో ఓ వ్యక్తి కోర్టులో ఫిర్యాదు కూడా చేశారు. యాంటీబాడీల్లో ఐఎంజీ, ఐఎంఎం.. ఇలా చాలా రకాలు ఉంటాయి. సాధారణంగా ఐఎంజీ యాంటీబాడీల కోసం టెస్ట్ చేస్తారు. వ్యాక్సీన్లు తీసుకుంటే ఈ యాంటీబాడీలేమీ కనిపించవు. అయితే, ఐఎంఎం యాంటీబాడీలు కనిపిస్తాయి. ఐఎంఎం పరీక్షల ధర కాస్త ఎక్కువే ఉంటుంది.

కరోనా వ్యాక్సినేషన్

యువకులు, పిల్లలకు వ్యాక్సీన్లు అవసరం లేదా?

యతీన్ మెహ్తా: పిల్లలకు వ్యాక్సినేషన్ కోసం ఇంకా భారత ప్రభుత్వం అనుమతులు జారీచేయలేదు. 2 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలపై మూడో దశ పరీక్షల కోసం మే 13న భారత్ బయోటెక్‌కు భారత ఔషధ నియంత్రణ, ప్రాధికార సంస్థ అనుమతులు జారీచేసింది. అమెరికాలో 12ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సీన్లు ఇస్తున్నారు. త్వరలో భారత్‌లోనూ అనుమతులు జారీచేస్తారు.

రెండో వేవ్‌లో యువకులకు ఎక్కువగా కరోనావైరస్ సోకింది. తీవ్రత ఎక్కువగా ఉండే కేసులు కూడా చాలా ఎక్కువే వచ్చాయి. చాలావరకు యువత కుటుంబాలను నడిపిస్తుంటారు. ఒకవేళ వైరస్ వారికి సోకితే, ఆ ఇంటిలో చాలా మందికి వైరస్ సోకుతుంది. అందుకే వారికి వ్యాక్సినేషన్ తప్పనిసరిగా జరగాలి.

ఈశ్వర్ గిలాడా: యువకులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. పిల్లలకు కూడా త్వరలో వ్యాక్సీన్లు ఇచ్చేందుకు అనుమతులు జారీ చేస్తారు. అందరికీ వ్యాక్సీన్లు ముఖ్యమే. కొందరికి వ్యాక్సీన్లు ఇచ్చి, మరికొందరికి ఇవ్వకపోతే, ఇవ్వని వయసు వారిలో కేసులు పెరుగుతాయి.

రుత్రుస్రావంలో మహిళలు వ్యాక్సీన్ తీసుకోవచ్చా?

యతీన్ మెహ్తా: తీసుకోవచ్చు. వ్యాక్సీన్లతో ఎలాంటి ముప్పూ ఉండదు.

ఈశ్వర్ గిలాడా: రుతుస్రావంలో ఉన్న మహిళలపై వ్యాక్సీన్లు ప్రత్యేకంగా ఎలాంటి ప్రభావం చూపించవు. రుతుస్రావ సమయంలో వ్యాక్సీన్ తీసుకున్నా ఏం కాదు.

కోవిడ్ సోకిన తర్వాత వ్యాక్సీన్ అవసరం లేదా?

యతీన్ మెహ్తా: ఈ వాదనలో నిజం లేదు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత యాంటీబాడీలు కొన్ని రోజుల వరకే ఉంటాయి. కాబట్టి రెండు, మూడు నెలల తర్వాత వ్యాక్సీన్ తీసుకోవాలి.

ఈశ్వర్ గిలాడా: కోవిడ్ నుంచి కోలుకున్న వెంటనే వ్యాక్సీన్ తీసుకోవాల్సిన పనిలేదు. మేం ముంబయిలో జులై 2020 నుంచి ఇప్పటివరకు 150 మంది రోగులపై అధ్యయనం చేపట్టాం. ఎనిమిది నుంచి పది నెలల తర్వాత మళ్లీ కోవిడ్ సోకే అవకాశముందని దానిలో తేలింది. 15 నుంచి 20 రోజుల్లోనే మళ్లీ కోవిడ్ వస్తుందని చెబుతున్న వార్తల్లో నిజంలేదు. అలా చెప్పారంటే వారు పూర్తిగా కోలుకోనట్లే. కోలుకున్న ఎన్ని రోజుల తర్వాత వ్యాక్సీన్ తీసుకోవాలి అనేది వైద్యుల్ని సంప్రదించి నిర్ణయం తీసుకుంటే మేలు.

ఫ్లూ వ్యాక్సీన్‌తో కోవిడ్ నుంచి రక్షణ ఉంటుందా?

యతీన్ మెహ్తా: లేదు. ఫ్లూ వ్యాక్సీన్ కోవిడ్-19పై పనిచేయదు.

ఈశ్వర్ గిలాడా: కోవిడ్-19పై ఫ్లూ వ్యాక్సీన్ పనిచేస్తున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు.

కరోనా వ్యాక్సినేషన్

వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత, మాస్క్ పెట్టుకోవాలా? సామాజిక దూరం పాటించాలా?

యతీన్ మెహ్తా: వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా, కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీని వల్ల మన నుంచి వేరేవారికి వైరస్ సోకకుండా ఉంటుంది.

ఈశ్వర్ గిలాడా: వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా సామాజిక దూరం పాటించాలి. మాస్క్ పెట్టుకోవాలి. లేదంటే మీరు కరోనా వాహకులుగా మారే ముప్పుంటుంది. అంటే మీరు ఇన్ఫెక్షన్‌ను ఒకరి నుంచి మరికొకరికి వ్యాపింపజేయగలరు. మీకు కరోనా సోకకపోయినా, మీరు వాహకులుగా మారే ముప్పు ఉంటుంది. మరోవైపు వైరస్‌లో భిన్న వేరియంట్లు బయటకు వస్తున్నాయి. అందుకే జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid-19 Vaccine: Will vaccination lead to impotency
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X