తెలంగాణ సహా ఈ 10 రాష్ట్రాల్లో విజృంభించిన కరోనా వైరస్: కొత్త ఏడాది వేడుకలపై ఆంక్షలు..?
Covid 19 variant JN.1: రెండు సంవత్సరాల పాటు ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. క్రమంగా విజృంభిస్తోంది. కోవిడ్ 19 కొత్త వేరియంట్ జేఎన్.1 (Covid 19 variant JN.1) ఇప్పటికే కేరళలో తిష్ఠవేసింది. క్రమంగా పొరుగు రాష్ట్రాలకూ విస్తరించింది.
ఇతర రాష్ట్రాల్లోనూ కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు పుట్టుకొస్తోన్నాయి. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 752 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు మరణించారు. కేరళలో ఇద్దరు, కర్ణాటక, రాజస్థాన్‌లల్లో ఒకరు చొప్పున మృతి చెందారు. ఇప్పటివరకు నమోదైన కోవిడ్ మరణాల సంఖ్య 15 వరకు చేరింది.

దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 3,000 మార్క్‌ను దాటింది. 3,420కి చేరుకుంది. ఈ మధ్యకాలంలో యాక్టివ్ కేసులు ఈ స్థాయికి పెరగడం ఇదే తొలిసారి. కోవిడ్ తీవ్రత క్రమంగా పెరుగుతోందని, రాష్ట్రాలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలను జారీ చేసింది.
కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరి, గుజరాత్, తెలంగాణ, పంజాబ్, న్యూఢిల్లీల్లో కొత్త కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా నమోదవుతోంది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే హెల్త్ అడ్వైజరీని జారీ చేశాయి. వయోధిక వృద్ధులు, దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా మాస్కులను ధరించాల్సి ఉంటుందని సూచించాయి.

కొత్త కోవిడ్ వేరియంట్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటోన్నాయి. చలి తీవ్రత పెరగడం, పండగ సీజన్ ఆరంభమైన నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించాలని పేర్కొన్నాయి. వీకెండ్ రోజులు, కొత్త ఏడాది వేడుకలపై ఆంక్షలు విధించే అవకాశాలు లేకపోలేదు.
రాష్ట్రవ్యాప్తంగా డయాగ్నస్టిక్ టెస్టులు, మెడిసిన్, ఆక్సిజన్ సిలిండర్లు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్.. వంటి పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలనూ ఆదేశించింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉండాలని సూచించింది.












Click it and Unblock the Notifications