CoWIN ద్వారా 50 దేశాల్లో వ్యాక్సిన్ -వన్ ఎర్త్, వన్ హెల్త్ భారత్ విధానం -ప్రధాని మోదీ ఉద్ఘాటన
దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదన్న హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది. ప్రతిరోజూ కనీసం 50లక్షల మందికి తగ్గకుండా భారత్ లో టీకాల కార్యక్రమం కొనసాగుతున్నది. దేశంలో టీకాల పంపిణీని కొవిన్ డిజిటల్ విధానంలో చేపట్టడంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ మేరకు
'కొవిన్ గ్లోబల్ కాంక్లేవ్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ కొవిన్ కు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టేందుకు భారత్ వినియోగిస్తున్న డిజిటల్ వేదికే కొవిన్ అని, కొవిడ్‌పై పోరులో భాగంగా ఈ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌ను దాదాపు 50 దేశాలకు ఉచితంగా అందించేందుకు భారత్ సిద్ధమైందని ప్రధాని సెలవిచ్చారు.

"వన్ ఎర్త్, వన్ హెల్త్" అనే విధానానికి భారత్ కట్టుబడి ఉంటుందని, కరోనా అనంతర కాలంలో చాలా మంది విదేశీయులు కూడా ఈ సూత్రాన్ని బలంగా విశ్వసిస్తున్నారని మోదీ అన్నారు. కొవిన్ టెక్నాలజీని విశ్వవ్యాపితం చేయడానికి దాన్నొక ఓపెన్ సోర్స్‌గా ఉంచినట్లు మోదీ తెలిపారు. కొవిడ్ పై పోరులో టెక్నాలజీది కీలక పాత్ర అన్నారు. ప్రస్తుతం కెనడా, మెక్సికో, నైజీరియా సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 దేశాలు కొవిన్ యాప్‌ను తమదేశాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.
''టెక్నాలజీలోని వనరులను వాడుకోవడానికి ఓ పరిమితి అంటూ లేదు. కరోనా సమయంలో ఈ అంశం బాగా కలిసొచ్చింది. కేసుల ట్రేసింగ్, ట్రాకింగ్ యాప్‌ను ఓపెన్ సోర్స్ చేసేశాం. కోవిడ్ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడేందుకు వ్యాక్సినేషన్ విధానం ఒక్కటే మానవళికి ఆశాకిరణం'' అని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ వల్ల చనిపోయినవారికి మోదీ సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications