కరోనావైరస్ వ్యాప్తి: మరో రెండు మూడు నెలలో జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న కేరళలోనూ కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే, పండగల సీజన్ కావడంతో రానున్న రెండు మూడు నెలలు ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య ఉన్నతాధికారులు గురువారం మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు కరోనా కట్టడిలో సాధించిన ఫలితాలున మరింత మెరుగుపరుచుకుందామన్నారు. దేశ వ్యాప్తంగా యువజనాభాలో ఇప్పటి వరకు 20 శాతం మందికి రెండు డోసులు పంపిణీ పూర్తయిందని, అలాగే 62 శాతం మందికి కనీసం ఒక్కడోసు అందినట్లు నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) వీకే పాల్ తెలిపారు.

దేశంలో 34 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా అధికంగా ఉండగా, 32 జిల్లాల్లో మాత్రం 5 నుంచి 10 శాతంగా ఉన్నట్లు తెలిపారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న ఆయా జిల్లాల్లో మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు. గత వారంలో దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 67.79 శాతం కేసులు కేరళలోనే వచ్చాయని, ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 1.99 లక్షల యాక్టివ్ కేసులున్నాయని తెలిపారు.
మిజోరం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో 10వేలు కన్నా ఎక్కువగా యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. మిజోరం పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ.. వ్యాక్సినేషన్ వేగంగా జరిగి, తగిన చర్యలు తీసుకోవడం ద్వారా మెరుగుపడుతుందని భావిస్తున్నామన్నారు.
ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ మాట్లాడుతూ.. వచ్చేది పండగల సీజన్ వస్తుండటంతో వ్యాక్సిన్ తీసుకోవడం, కరోనా నిబంధనలు పాటించడం, అనవసర ప్రయాణాలు తగ్గించుకోవడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేరళలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని తెలిపారు. పండగల సీజన్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరోసారి కరోనావైరస్ విజృంభించే అవకాశం ఉందని హెచ్చరించారు.
కాగా, భారత్‌లో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కేసుల్లో హెచ్చుతగ్గులుంటున్నాయి. గత 24 గంటల్లో 30 వేల మార్కును దాటేసింది. బుధవారం కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 30,570 కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా 431 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,33,17,325 కి పెరగగా.. మరణాల సంఖ్య4,43,923 చేరింది. నిన్న కరోనా నుంచి 38,3036 మంది కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,25,60,474కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,42,923 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు, కేరళ రాష్ట్రంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి కాస్త నెమ్మదించి. నిన్న దేశంలో నమోదైన కరోనా కేసుల్లో.. కేరళలో 17,681 కరోనా కేసులు నమోదు కాగా.. 208 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 80 శాతానికి పైగా కరోనా కేసులు, మరణాలు ఈ రాష్ట్రంలోనే నమోదయ్యాయి.
ఇది ఇలావుండగా, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 76,57,17,137 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. గడిచిన 24గంటల్లో 64,51,423 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది.












Click it and Unblock the Notifications