ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి, గోరక్షణ హిందువుల ప్రాథమిక హక్కు.: హైకోర్టు కీలక వ్యాఖ్యలు
లక్నో: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని చాలా కాలం నుంచి దేశ వ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రానికి సూచించింది. అంతేగాక, గో సంరక్షణను హిందువుల ప్రాథమిక హక్కుగా చేయాలని స్పష్టం చేసింది.
Recommended Video
ఆవులకు జాతీయ జంతువు హోదా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు తీసుకురావాలని కోర్టు పేర్కొంది. దేశంలో ఆవులు సంతోషంగా ఉన్నప్పుడే దేశం కూడా సంతోషంగా ఉంటుందని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. భారతీయ సంస్కృతిలో ఆవు ఎంతో ముఖ్యమైనదని అభిప్రాయపడింది. ఆవుకు సంబంధించి పార్లమెంటు చేసిన చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.

కాగా, గోవధ కేసులో నిందితుడైన జావేద్ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. గోవధ చట్టాన్ని ఉల్లంఘించిన జావేద్‌కు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సందర్భంలో హైకోర్టు పలు సూచనలు చేసింది. ఆవులను మతపరమైన కోణంలో మాత్రమే చూడరాదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఆవును గౌరవించడం, రక్షించడం భారత జాతి విధి అని వ్యాఖ్యానించింది.
'ఆవు ముసలిదైనా, అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా ఉపయోగపడుతుంది. దాని పేడ, మూత్రం వ్యవసాయానికి, ఔషధాల తయారీకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి . అన్నింటికన్నా, ఆవును తల్లిగా పూజించడం జరుగుతుంది. అది వృద్ధురాలు లేదా అనారోగ్యం పాలైనా దాన్ని చంపే హక్కు ఎవరికీ లేదు' అని కోర్టు నివేదికలో పేర్కొంది. చంపే హక్కు కంటే జీవించే హక్కుకే ప్రాధాన్యత ఉందని, గొడ్డు మాంసం తినే హక్కును ప్రాథమిక హక్కుగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది. ఇది ఇలావుంటే, రాజస్థాన్ హైకోర్టు గతంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
జమియత్ ఉలేమా ఇ హింద్ జాతీయ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ కూడా ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని గతంలోనే డిమాండ్ చేశారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడం ద్వారా అందరూ సురక్షితంగా ఉంటారని పేర్కొన్నారు. అది దేశానిిక కూడా ఎంతో మేలు చేస్తుందని అన్నారు. కాగా, ఇప్పటికే పలు రాష్ట్రాలు గోవధ నిషేధ చట్టాన్ని చేసిన విషయం తెలిసిందే. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి.












Click it and Unblock the Notifications