మంచి నిర్ణయమే.. కానీ ఆలస్యమైంది.. వ్యవసాయ చట్టాలపై సురవరం
వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రధాని మోడీ చేసిన ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఈ మూడు నల్ల చట్టాల ను రద్దు చేయాలని కోరుతూ.. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లోనే కొన్ని నెలలుగా రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ఆ వ్యవసాయ చట్టాలను ఉపసం హరించుకుంటున్నట్టు ప్రకటించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ.. మోడీ ప్రకటించడంతో ఈ దేశ రైతుల సుదీర్ఘ పోరాటం ఫలించిందని సీపీఐ సీనియర్ నాయకులు సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు శాంతి యుతంగా చేస్తున్న ఉద్యమాన్ని చెదరగొట్టేందుకు కేంద్రం ఎన్నో కుట్రలు చేసిందని ఆయన ఆరోపించారు. రైతుల పోరాటంలో 700 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఇన్ని నెలలుగా రైతులపై కర్కశంగా వ్యవహరించినందుకు.. రైతులకు మోదీ క్షమాపణ చెబితే సరిపోదు... చనిపోయిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్టే... ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల ప్రైవైటీకరణను కూడా ఆపాలన్నారు. అలాగే కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని, చమురు ధరలు కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు. దేశానికి ప్రమాదంగా ఉన్న మతోన్మాదుల మూర్ఖపు దాడులను అదుపులో పెట్టాలని సురవరం సుధాకర్‌రెడ్డి సూచించారు.

వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలను రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ఉపసంహరించుకోనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో శుక్రవారం ఢిల్లీ సమీపంలోని ఘాజీపూర్ సరిహద్దులో అన్నదాతలు సంతోషంతో సంబరాలను చేసుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలలో రైతులు ఆందోళన చేస్తున్న సింగూ, తిక్రీ, ఘాజీపూర్ లలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.
సాగు చట్టాల రద్దు కోసం నిరసన తెలిపిన రైతులు ఘాజీపూర్ సరిహద్దులో జిలేబీలను పంపిణీ చేశారు . గత సంవత్సరం రూపొందించిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విజయం సాధించిన నేపథ్యంలో "కిసాన్ జిందాబాద్" అంటూ నినాదాలు చేశారు. మరికొందరు వీధుల్లో డ్యాన్స్ చేస్తూ ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications