తుఫాన్ నష్టంపై అమిత్ షా కీలక ప్రకటన- గుజరాత్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు
అహ్మదాబాద్: అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జాయ్ తుఫాన్ ప్రభావం వల్ల తీవ్రంగా నష్టపోయిన గుజరాత్ తీర ప్రాంత జిల్లాల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇవ్వాళ పర్యటించారు. పునరావాస శిబిరాలను సందర్శించారు. బాధితులతో మాట్లాడారు. వారికి అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఆయన అభినందించారు.
అనంతరం తుఫాన్ మిగిల్చిన నష్టాలపై భుజ్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం అమిత్ షా విలేకరులతో మాట్లాడారు. తుఫాన్ వల్ల ఒక్క ప్రాణ నష్టం కూడా సంభవించలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో గుజరాత్ ప్రభుత్వం సమర్థవంతంగా పని చేసిందని కితాబిచ్చారు. గుజరాత్ ప్రభుత్వం, కేంద్ర ఏజెన్సీలు సమన్వయంతో పని చేశాయని ప్రశంసించారు.

తుఫాన్ సమయంలో సుమారు 47 మంది గాయపడ్డారని, వారంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అమిత్ షా చెప్పారు. వారికి ప్రాణాపాయం తప్పినట్లు డాక్లర్లు వెల్లడించారని అన్నారు. తుఫాన్ కారణంగా 234 మూగజీవాలు చనిపోయాయని అన్నారు. తుఫాన్ తీరాన్ని చేరుకోవడానికి ముందే అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారని, రాష్ట్ర ప్రభుత్వంతో ఆయన స్వయంగా చర్చించారని వివరించారు.
3,400 గ్రామాల్లో విద్యుత్ సరఫరా స్తంభించిపోయిందని, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయని అమిత్ షా తెలిపారు. సాయంత్రం నాటికి 1,600 గ్రామాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు చెప్పారు. సుమారు 1,08,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని, 73,000కు పైగా జంతువులను రక్షించామని అన్నారు.
వారితో పాటు మరో లక్షమందికి పైగా మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అమిత్ షా వివరించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన 19, ఎస్డీఆర్‌ఎఫ్‌కు చెందిన 13 బృందాలు, రెండు రిజర్వ్ బెటాలియన్‌లను తీర ప్రాంతాల్లో మోహరించామని అన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, పోలీస్, బీఎస్ఎఫ్‌లను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

ఇక ప్రజలను తిరిగి వారి ఇళ్లకు చేర్చడానికి ప్రాధాన్యత ఇస్తోన్నామని అమిత్ షా చెప్పారు. వారికి అవసరమైన ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేశామని, దీనిపై గుజరాత్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేస్తుందని అన్నారు. 40 సంవత్సరాల్లో తాను ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను చూశానని, మొదటిసారిగా, ప్రభుత్వం మీద ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, గుజరాత్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించడమే దీనికి కారణమని చెప్పారు.












Click it and Unblock the Notifications