31 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు.. అప్పుల్లో టాప్ అతనే..!
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 70 మంది ఎమ్మెల్యేల్లో 31 మందిపై క్రిమినల్ కేసులు నమోదు అయినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ADR) రిపోర్టు వెల్లడించింది. దిల్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 699 మంది అఫిడవిట్లను పరిశీలించి జాబితాను రూపొందించింది.ఈ కేటగిరీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఈ పార్టీ తరఫున గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలపై నేరచరిత్ర ఉంది.
అంటే గెలిచిన మొత్తం ఎమ్మెల్యేల్లో ఇది 68 శాతం. ఇక బీజేపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 16 మందిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇది 33 శాతంగా ఉంది. అయితే 2020లో గెలిచిన వారిలో 43 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. గతంతో పోల్చితే ఈసారి నేరచరిత్ర కలిగిన వారి సంఖ్య తక్కువగా ఉంది.

ఇక ఆస్తుల విషయానికి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల కంటే బీజేపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకే ఆస్తులు ఎక్కువగా ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది. ఒక్కో బీజేపీ ఎమ్మెల్యే ఆస్తుల విలువ సరాసరి రూ. 28.59కోట్లుగా ఉంది. అయితే ఆప్ తరఫున గెలిచిన ఒక్కో ఎమ్మెల్యేకు మాత్రం సరాసరి ఆస్తుల విలువ రూ.7.74 కోట్లుగా ఉంది. రూ.115 కోట్ల నుంచి రూ.259 కోట్ల రేంజులో ఆస్తిపాస్తులను కలిగిన ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో గెలిచారు.
ఇక ఆప్ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల ఆస్తి విలువ రూ.20 లక్షల లోపే ఉండటం గమనార్హం. 23 మంది ఎమ్మెల్యేలకు రూ.1 కోటికిపైగా అప్పులు ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది. అప్పుల్లో అరవింద్ కేజ్రీవాల్‌పై గెలిచిన బీజేపీ నేత పర్వేశ్ వర్మ మొదటి స్థానంలో ఉన్నారు. ఈయనకు ఏకంగా రూ.74 కోట్ల అప్పులు ఉన్నట్లు సమాచారం.
దిల్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 64 శాతం మంది అంటే 45 మంది ఎమ్మెల్యేలు విద్యార్హత గ్రాడ్యూయేషన్ గా ఉంది. 23 మంది ఎమ్మెల్యేలు పీజీలు చేశారు. ఒక ఎమ్మెల్యేకు డాక్టరేట్ ఉంది. మరోవేపు 33శాతం అంటే 23 మంది ఎమ్మెల్యేల విద్యార్హత కేవలం ఐదో తరగతి నుంచి ఇంటర్ మధ్యలోనే ఉంది. ఇక దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కేవలం 7 శాతం మంది అంటే 5 గురు మహిళా అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు. 2020లో 8 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.












Click it and Unblock the Notifications