మాస్టర్‌మైండ్స్ వీరేనా?: ఢిల్లీ పేలుడులో మరో కీలక పరిణామం
Delhi Blast: ఢిల్లీలోని ఎర్రకోట బయట నవంబర్ 10న జరిగిన బాంబు పేలుడు కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) సంచలన విషయాలు వెల్లడించింది. ఈ పేలుడులో ఉపయోగించిన ఐ20 కారును సమకూర్చి తరలించిన నలుగురు కొత్త నిందితులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ శ్రీనగర్‌లో అరెస్ట్ చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అరెస్ట్ అయిన నలుగురూ వృత్తిరీత్యా డాక్టర్లే. వీరిలో ఒకరు డాక్టర్‌తో పాటు మత ఉపన్యాసాలు కూడా ఇచ్చేవారు. ఈ అరెస్టులు ఢిల్లీ పేలుడు దర్యాప్తుకు కొత్త మలుపునిచ్చాయి.
నలుగురు డాక్టర్లు అరెస్ట్
ఢిల్లీ కారు పేలుడుకు అవసరమైన ఐ20 కారును సమకూర్చడం, దాని కదలికలు, తరలించడంలో ఈ నలుగురు కీలక పాత్ర పోషించారు. పుల్వామాకు చెందిన డా. ముజమ్మిల్ షకీల్ గనై, అనంత్‌నాగ్‌కు చెందిన డా. అదీల్ అహ్మద్ రాథర్ కారు ఆపరేషన్, రూట్ ప్లానింగ్‌ను పర్యవేక్షించగా.. లక్నోకు చెందిన డా. షాహీనా సయీద్ నిధుల సరఫరా, కమ్యూనికేషన్ ప్లానింగ్‌ను నిర్వహించారు. ఇక, షోపియాన్‌కు చెందిన ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వగాయ్ మాడ్యూల్ సభ్యులకు భావజాల మద్దతు ఇచ్చి విదేశీ లింక్‌లకు సంప్రదింపుల కేంద్రంగా పనిచేశారు. ఈ నలుగురి పాత్రను బట్టి పేలుడులో వీరు సహాయం చేయడమే కాకుండా కారు ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి నిర్వహణను చూసుకున్నారని ఎన్ఐఏ నిర్ధారించింది.

కారు ఆపరేషన్‌కు మాస్టర్‌మైండ్స్‌గా ఎందుకు పిలుస్తున్నారు?
ఎన్ఐఏ దర్యాప్తులో తేలిందేమంటే ఈ నలుగురు కేవలం సాయం అందించడమే కాకుండా కారు ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వ్యూహాత్మక నిర్వహణను చూసుకున్నారు. కారు కాగితాలపై మరొకరి పేరు మీద ఉన్నప్పటికీ.. కారు కొనుగోలు, దాన్ని తీసుకురావడం, దాచిపెట్టడం, సురక్షితంగా ఉంచడం వంటి కీలక పనులు ఈ డాక్టర్ల బృందమే చూసుకుంది. కారును ఎక్కడ నుంచి తీసుకోవాలి, ఢిల్లీకి ఏ మార్గంలో సురక్షితంగా తీసుకురావాలి, ఎక్కడెక్కడ ఆపాలి, ఎప్పుడు 'యాక్టివేషన్ పాయింట్'కు చేర్చాలి అనే మొత్తం బ్లూప్రింట్‌ను డా. ముజమ్మిల్, డా. రాథర్ సిద్ధం చేశారు. లక్నోకు చెందిన డా. షాహీనా మెడికల్ టూర్ల పేరుతో రహస్య సమావేశాలు ఏర్పాటు చేయడం, నిధులను సమకూర్చడం, సురక్షిత కమ్యూనికేషన్ వంటి కీలక వ్యూహాత్మక పనులు పర్యవేక్షించారు. ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వగాయ్ ఈ మాడ్యూల్ సభ్యులకు భావజాల మద్దతు ఇచ్చేవారు. సభ్యులను మానసికంగా సిద్ధం చేసి, విదేశీ లింక్‌లకు సంప్రదింపుల కేంద్రంగా పనిచేశారు.
కేసు విచారణలో కీలకంగా మారిన అరెస్ట్?
ఇంతకుముందు ఎన్ఐఏ అమీర్ రషీద్ అలీ (కారు రిజిస్టర్ అయిన వ్యక్తి), పేలుడు సెటప్‌లో సహాయం చేసిన జాసిర్ బిలాల్ వాణీ అలియాస్ డానిష్‌ను అరెస్టు చేసింది. అయితే, కారు ఎలా వచ్చింది, ఎవరు తరలించారు, ఎవరు సురక్షితంగా ఉంచారు అనే ముఖ్యమైన ప్రశ్నలకు ఈ నలుగురు డాక్టర్ల అరెస్టుతో సమాధానం దొరికింది.కారు లేకుండా బ్లాస్ట్ జరగడం అసాధ్యం. కాబట్టి, ఈ కారు ఆపరేషన్‌ను పర్యవేక్షించిన ఈ నలుగురి పాత్ర అత్యంత కీలకమైనది. న్ఐఏ బృందం ప్రస్తుతం నిందితులైన డా. ముజమ్మిల్, డా. షకీల్‌ను ఢిల్లీకి తీసుకువచ్చింది. త్వరలో వీరిని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications