ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి: అత్యవసర ల్యాండింగ్
న్యూఢిల్లీ: ఇండిగో విమానయాన సంస్థకు చెందిన ఒక విమానాన్ని టేకాఫ్ అయిన కొద్ది సేపటికే పక్షి ఢీకొట్టింది. దీంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన భువనేశ్వర్ నుంచి ఢిల్లీ వెళుతున్న విమానంలో సోమవారం చోటు చేసుకుంటుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇండిగో విమానయాన సంస్థకు చెందిన 6ఈ2065 విమానం 180 మంది ప్రయాణికులతో భువనేశ్వర్ నుంచి ఢిల్లీకి బయల్దేరింది. టేకాఫ్ అయిన 20 నిమిషాలకు ఒక పక్షి విమానాన్ని ఢీకొట్టింది. దీంతో విమానం ఎడమ రెక్కలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించారు.

విమానాన్ని అత్యవసరంగా భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమనాశ్రయానికి మళ్లించారు. సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత ప్రత్యమ్నాయ మార్గాల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు ఏర్పాట్లు చేశారు.
పక్షులు విమానాలను ఢీకొనడం లాంటి ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. చిన్న ఘటనే అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతో విమానాలను అత్యవసరంగా ల్యాండ్ చేస్తారు పైలట్లు. కాగా, ఇటీవల ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు రక్తపు వాంతులు చేసుకోవడంతో అత్యవసరంగా ల్యాండ్ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications