ఇకపై ఆ వాహనాలకు నో పెట్రోల్, డీజిల్.. ఆ రోజు నుంచే అమల్లోకి..
దేశ రాజధాని దిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకుపోయింది. రోజురోజుకూ అక్కడ వాయు కాలుష్యం అధికం అవుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) సాధారణ పరిమితిని దాటి 300 కు చేరువైంది. ప్రస్తుతం దీపావళి సంబరాల నేపథ్యంలో రానున్న రోజుల్లో దిల్లీలో వాయు కాలుష్యం మరింత ప్రమాదకర స్థాయికి చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే దిల్లీ గాలి నాణ్యతను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలకు ఉపక్రమించింది. 15 సంవత్సరాలు దాటిన పెట్రోల్ వాహనాలకు, 10 సంవత్సరాలు దాటిన డీజిల్ వాహనాలకు ఇంధనం నిలిపివేయడంపై మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది.
2025 జూలై 1 నుంచే 10 సంవత్సరాలకంటే పాత డీజిల్ వాహనాలకు, 15 సంవత్సరాల కంటే పాతవైన పెట్రోల్ వాహనాలకు ఇంధనం నింపడం నిషేధమని దిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నిషేధాన్ని అమలు చేయడంలో సాంకేతిక సమస్యలు ఎదురైన నేపథ్యంలో ఈ నిషేధాన్ని దిల్లీ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ప్రస్తుతం దిల్లీ వాయు కాలుష్యం మరింత తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో నవంబర్ 1 నుంచి ఈ నియమాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.
తాజా నిబంధనల ప్రకారం.. 10 సంవత్సరాలకంటే పాత డీజిల్ వాహనాలకు, 15 సంవత్సరాల కంటే పాతవైన పెట్రోల్ వాహనాలకు ఇంధనం నింపడం నిషేధమని కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ పేర్కొంది. కాలం చెల్లిన వాహనాలను నడపొద్దని స్పష్టం చేసింది. ఈ నిషేధం.. దిల్లీతోపాటు వాహనాల రద్దీ అధికంగా ఉన్న 5 జిల్లాలు అయిన గురుగ్రామ్, గాజియాబాద్, ఫరీదాబాద్, గౌతమ్ బుద్దా నగర్, సోనిపట్ జిల్లాల్లో నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు వివరించింది.

దిల్లీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎండ్ ఆఫ్ లైఫ్(EOL).. దిల్లీలోని అనేక పెట్రోల్ బంకుల్లో ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్(ANPR) కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా EOL వాహనాలను గుర్తించనున్నారు. ఈ కెమెరాలు.. నంబర్ ప్లేట్స్ ను స్కానింగ్ చేస్తాయి. అలాగే వాహనం పూర్తి వివరాలను వెరిఫై చేస్తాయి. ఏదైనా వాహనం EOL కిందకు వస్తే.. ఆ వాహనంలో ఇంధనం నింపకుండా వెంటనే బంకు యాజమాన్యానికి అలెర్ట్ పంపుతుంది. అక్కడినుంచి ఆ సమాచారం అధికారులకు చేరుతుంది. ఆ తర్వాత వాళ్లు అలాంటి వాహనదారులపై చర్యలు తీసుకుంటారు.












Click it and Unblock the Notifications