మహిళలకు నెలకు రూ.2100.. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ..
మహిళలకు నెలకు రూ.2100 ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఇది తెలంగాణ, ఏపీలో కాదు. ఢిల్లీలో. అవును అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మహిళలను ఆకర్షించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు పైబడిన మహిళకు నెలకు రూ.2100 ఇచ్చే ప్రతిపాదనకు గురువారం ఉదయమే సీఎం అతిషి సారథ్యంలోని ఢిల్లీ మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
అర్హులైన మహిళల ఎంపికకు శుక్రవారం నుంచే దరఖాస్తులను స్వీకరించనున్నామని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల తర్వాత ఇస్తారా లేక ఎన్నికల ముందే ఈ పథకాన్ని అమలు చేస్తారా అనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు దరఖాస్తులు స్వీకరించి ఎన్నికల తర్వాత మహిళ బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నట్లు ప్రకటించారు. కాగా 15, 20 రోజుల్లో ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు పథకం అమలు సాధ్యం కాదని కేజ్రీవాల్ చెప్పారు.

తాను మహిళలకు ప్రతినెలా రూ.1000 ఇస్తానని ప్రకటించినట్లు గుర్తు చేశారు. అయితే చాలా మంది మహిళలు రూ.1000 సరిపోవడం లేదని చెప్పినట్లు ఆయన వివరించారు. అందుకే ఆ మొత్తాన్ని
రూ.2100 పెంచినట్లు పేర్కొన్నారు. అటు ఆటో డ్రైవర్లకు రూ.10 లక్షల వరకు జీవిత బీమా, రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా ఇస్తామని ఇటీవలే కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆటో డ్రైవర్ల కుమార్తెల పెళ్లిళ్లకు రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఆటోవాలాలకు యూనిఫాం అలవెన్స్ కింద ఏడాదికి రెండుసార్లు రూ.2,500 చొప్పున పేర్కొన్నారు. కాగా మహారాష్ట్ర ఎన్నికల ముందు అక్కడి ప్రభుత్వం మహిళలకు నెలకు కొంత మొత్తాన్ని ఇచ్చే పథకాన్ని అమలు చేసింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికార కూటమి మళ్లీ విజయం సాధించింది.












Click it and Unblock the Notifications