బిజెపి ఏజెంట్: గవర్నర్ నజీబ్ జంగ్‌పై కేజ్రీవాల్ ఫైర్

లెఫ్ట్‌నెంట్ గవర్నర్ భారతీయ జనతా పార్టీ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని అరవింద్ కేజ్రివాల్ ఆరోపించారు. కమలనాథులతో కలిసి తెరచాటు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నజీబ్ జంగ్ బిజెపి ఏజెంట్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
వచ్చే కొద్ది రోజుల్లోనే ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ సన్నాహాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రపతి ఆమోదంతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయిస్తామని నజీబ్ జంగ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో అరవింద్ కేజ్రివాల్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు
ఈరోజే ప్రభుత్వ ఏర్పాటు నిర్ణయంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేజ్రివాల్ డిమాండ్ చేశారు.మనం ప్రజాస్వామిక దేశంలో ఉన్నామని, ఇక్కడ ప్రజల ప్రభుత్వమే ఉంటుందని, ఎన్నిక ద్వారానే ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు.
అయితే అలా కాకుండా బిజెపి సూచనల మేరకు ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ సహకరిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తొలగించేందుకు గత 8 నెలల్లో నజీబ్ జంగ్ చేసేందేమీ లేదని కేజ్రీవాల్ విమర్శించారు.
ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బిజెపి కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం రాష్ట్రపతి అనుమతి తీసుకున్న తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications