రాహుల్‌కు నోటీసులు- లైంగిక వేధింపులకు గురైన వారి వివరాలు సేకరిస్తోన్న పోలీసులు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. లైంగిక వేధింపులకు గురైన వారి వివరాలను తమకు అందజేయాలని ఆదేశించారు.
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఢిల్లీ పోలీసుల పేరు మారుమోగిపోతోంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో పాటు పలు అంశాలకు సంబంధించిన దర్యాప్తును సాగిస్తోన్నారు. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తో సమానంగా ఢిల్లీ పోలీసులకు గుర్తింపు లభిస్తోందీ మధ్యకాలంలో. అటు వారికి వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతలపై అణచివేతకు పాల్పడుతున్నారనే విమర్శలను ఎదుర్కొంటోన్నారు.
ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ పోలీసులు మరో సంచలనానికి తెర తీశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, వాయనాడ్ లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీకి తాజాగా నోటీసులు పంపించారు. పలు కీలక అంశాలను అందులో పొందుపరిచారు. వాటికి సమాధానాలను ఇవ్వాలని, సమగ్ర వివరాలను అందజేయాలనీ ఆదేశించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాను వ్యక్తం చేస్తోంది. మరోసారి రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తోంది.

లైంగిక వేధింపులకు పాల్పడిన వారి వివరాలను తమకు అందజేయాలంటూ ఢిల్లీ పోలీసులు- రాహుల్ గాంధీకి పంపించిన ఈ నోటీసుల్లో పొందుపర్చడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారతీయ జనతా పార్టీ పరిపాలనలో పలువురు మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, బాధితులు తనను కలుసుకుని- భద్రత కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రావాలని కోరారంటూ ఇదివరకు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
భారత్ జోడో యాత్ర సందర్భంగా జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు అప్పట్లో. అత్యాచారానికి గురైన ఓ యువతితో తాను మాట్లాడానని, ఈ విషయాన్ని పోలీసులకు ఎందుకు తెలియజేయలేదంటూ తాను ప్రశ్నించగా- అందుకు ఆమె నిరాకరించారని చెప్పారు. పోలీసులను పిలవొద్దని విజ్ఞప్తి చేశారని పేర్కొన్నారు. ఇప్పుడా యువతి, మరి కొందరి వివరాలను తెలియజేయాలంటూ రాహుల్ గాంధీకి ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపించారు.












Click it and Unblock the Notifications