స్వదేశీ డెంగ్యూ వ్యాక్సిన్ రెడీ..!
డెంగ్యూ వ్యాధి దోమల ద్వారా సంక్రమిస్తుందని మనకు తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, దద్దుర్లు వంటి ఇబ్బందులు వస్తాయి. ఒక్కోసారి డెంగ్యూ తీవ్రమైన రూపంలోకి మారి ప్రాణాంతకం కూడా కావొచ్చు. ఈ క్రమంలో డెంగ్యూ వ్యాధికి స్వదేశంలోనే పరిష్కారం దొరకనుంది. భారత్ లోనే టెట్రా వాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది. డెంగిఆల్ పేరుతో ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ జరుపుకుంటోంది.
భారత్ లో ఇక డెంగ్యూ వ్యాధికి శాశ్వతంగా చెక్ పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ప్రాణాంతక డెంగ్యూ వ్యాధి నివారణకు వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. డెంగిఆల్ పేరుతో ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ జరుపుకుంటోంది. అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) సహకారంతో పనాసియా బయోటెక్ ఈ టీకాను అభివృద్ధి చేస్తోంది.
ఈ డెంగిఆల్ వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. ఇది నాలుగు డెంగ్యూ వైరస్ సెరోటైప్ ల నుంచి రక్షణ కలిగించే లైవ్- అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ కావడం విశేషం. దేశంలోని 20 కేంద్రాల్లో దాదాపు 10,500 మందిపై ఫేజ్ 3 ప్రయోగాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి డెంగ్యూ టీకా అందుబాటులోకి వచ్చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటికే దిల్లీ, కలకత్తా, చెన్నై, భువనేశ్వర్ నగరాల్లో 8 వేల మందిపై మొదటి, రెండో దశ ట్రయల్స్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.

డెంగ్యూ వ్యాక్సిన్ పై ఇప్పటి వరకు చేసినరెండు ట్రయల్స్ లో ఎలాంటి సమస్యలు రాలేదని డాక్టర్ మనోజ్ ముర్హేకర్ తెలిపారు. మూడో దశ ట్రయల్ లో టీకా తీసుకున్నవారిని రెండేళ్లు పాటు పర్యవేక్షించి, దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని అంచనా వేస్తామని తెలిపారు. ఇక ఈ పరీక్షలను పుణేలోని ICMR- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెర్మియాలజీ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
ఇక డెంగ్యూ వ్యాధి అత్యధిక జనాభా కలిగిలో భారత్ లాంటి దేశాల్లో క్రమంగా విస్తరిస్తోంది. WHO ప్రకారం 2023 చివరినాటికి 129 దేశాల్లో డెంగ్యూ వ్యాప్తి ఉందని నివేదికలు అంచనా వేస్తున్నాయి. భారత్ టాప్ 30 దేశాల్లో ఒకటిగా ఉండటం గమనార్హం. ఇక గతేడాది నుంచి ఇప్పటివరకు దేశంలో 2.3 లక్షల కేసులు, 297 మరణాలు నమోదైనట్లు సమాచారం. అంతేకాక ఈ ఏడాది మార్చి వరకే 12వేలకు పైగా కేసులను గుర్తించారు వైద్యులు.












Click it and Unblock the Notifications