దెయ్యం భయంతో.. వాళ్లు చేసిన పని, అడ్డంగా బుక్కయేలా చేసింది
చెన్నై : మూఢనమ్మకాలు కూడా కొన్నిసార్లు నిందితులను పట్టించడానికి ఉపయోగపడుతాయేమో!. తమిళనాడులోని నాగపట్నంలో ఇదే జరిగింది. ఆరుగురు వ్యక్తులు కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారు. హత్యానంతరం అతను దెయ్యం అయి కక్ష సాధిస్తున్నాడన్న అనుమానంతో.. పూడ్చి పెట్టిన శవాన్ని మరో చోటుకు తరలించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కయిపోయారు.
వివరాల్లోకి వెళ్తే.. నాగపట్నంలోని సునామీ కాలనీలో నివాసముండే శంకర్ (28) అనే ఓ జాలరి స్థానికంగా ఉండే కార్తీశన్ అనే వ్యక్తి భార్యను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో అతన్ని మట్టుపెట్టాలని ప్లాన్ చేసిన కార్తీశన్.. మరో ఐదుగురు స్నేహితులతో కలిసి పథకం అమలు చేశాడు. శంకర్ ను ఇంటికి పిలిచి పీకలదాకా మద్యం తాగించి.. అనంతరం గడ్డపారతో అతని తలపై మోది హత్య చేశారు.
హత్యానంతరం శవాన్ని కార్తీశన్ ఇంటివెనుక స్థలంలోనే పాతిపెట్టారు. ఇదంతా జరిగిన ఓ వారం రోజులకు హంతకుల్లో ఒకరైన దినకరన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో శంకరే దెయ్యమై తమపై పగ తీర్చుకుంటున్నాడని భావించిన కార్తీశన్ సహా అతని స్నేహితులు.. పూడ్చి పెట్టిన శవాన్ని వెలికి తీసి అన్బరసన్ అనే మరో నిందితుడి ఇంటి వద్ద పూడ్చడానికి సిద్దమయ్యారు.

ఇదే క్రమంలో అన్బరసన్ ఇంటివద్ద గుంత తవ్వుతుండగా.. పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అన్బరసన్, మణికంఠన్, శివ, కార్తీశన్, మారెక్స్, లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కాగా, శంకర్ కనిపించకుండా పోవడంతో.. గత మే నెలలో అతని భార్య ఫిర్యాదు చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications