సిఎం చేయొద్దా: కేజ్రీ, మోడీ వద్ద డబ్బులని మీడియాపై..
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్నవారు ధర్నాలు నిర్వహించకుండా రాజ్యాంగం అడ్డుకోవడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ నడిబొడ్డున రైల్ భవన్ వద్ద కేజ్రీవాల్ నిర్వహించిన ధర్నాపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.
ఈ విమర్శలపై ఆయన శనివారం ప్రతిస్పందిస్తూ, రాజ్యాంగాన్ని తాను చదివానని, ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్నవారు ధర్నాలు నిర్వహించరాదని రాజ్యాంగం ఎక్కడా లేదన్నారు. మీడియా ఒకటి రెండు రాజకీయ పక్షాలతో కుమ్మక్కై ఆప్‌కి వ్యతిరేకంగా కథనాలను వెలువరిస్తోందని ఆయన ఆరోపించారు.

ముఖ్యమంత్రిగా రాజ్యాంగ పదవిలో కొనసాగుతున్న కేజ్రీవాల్ ఒక ఆందోళనా కార్యక్రమానికి నాయకత్వం వహిస్తుండటం సుప్రీం కోర్టు దృష్టికి వచ్చింది. దేశ రాజధాని నడిబొడ్డున కేజ్రీవాల్, ఆయన అనుచరులు చట్టవ్యతిరేకంగా సమావేశమయ్యేందుకు భద్రతా సంస్థలు అనుమతించడంపై సుప్రీం కోర్టు శుక్రవారం ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
అమ్ముడుపోతున్నారు
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నుంచి డబ్బులు తీసుకుని కొన్ని ప్రచార మాధ్యమాలు (మీడియా) ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని కేజ్రీవాల్, ఢిల్లీ న్యాయ శాఖ మంత్రి సోమనాథ్ భారతీ ఆరోపించారు. కొన్ని మీడియా సంస్థలు ఒకటి రెండు రాజకీయ పక్షాలతో కుమ్మక్కయ్యాయని, ప్రజలు తమకు (ఆప్‌కు) వ్యతిరేకంగా మాట్లాడాలని అవి ఎందుకు కోరుకుంటున్నాయో అర్థం కావడం లేదని కేజ్రీవాల్ అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఒక కథనాన్ని రూపొందించి పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయాల్సిందిగా ఒక మీడియా సంస్థ యజమాని తమ విలేఖరిని ఆదేశించాడని, ఈ విషయాన్ని స్వయంగా ఆ విలేఖరే తనకు తెలియజేశాడని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మోడీ నుండి ఎంత డబ్బు తీసుకున్నారని సోమనాథ్ భారతి మీడియాపై మండిపడ్డారు. ఆ తర్వాత ఆ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.












Click it and Unblock the Notifications