ఆకాశ్-శ్లోకా వివాహ మహోత్సవంలో మరో ఘట్టం: సైనికులు, పోలీసుల కోసం మ్యూజికల్ ఫౌంటెయిన్ షో
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ-శ్లోకా వివాహ వేడుక మరింత శోభాయమానం కానుంది. దేశ సరిహద్దుల్లో రేయింబవళ్లు విధులను నిర్వహించే సైనిక బలగాలు, సాధారణ పోలీసుల కోసం ప్రత్యేకంగా రెండు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అవే మ్యూజికల్ ఫౌంటెయిన్ ప్రదర్శనలు. ముంబైలోని ధీరూభాయ్ అంబానీ స్క్వేర్ లో మంగళవారం ఈ రెండు కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. సైనికులు, పోలీసుల కోసం వేర్వేరుగా నిర్వహించబోయే ఈ కార్యక్రమాల్లో ఏడువేలమంది సైనికులు, పోలీసులు, వారి కుటుంబ సభ్యులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
తన కుమారుడి పెళ్లి వేడుకల ప్రారంభ సూచకంగా అంబానీ దంపతులు ఈ నెల 6వ తేదీన అనాథ పిల్లల కోసం ఓ ప్రదర్శనను నిర్వహించిన విషయం తెలిసిందే.

ముంబైలోని బాంద్రా కుర్ల కాంప్లెక్స్ సమీపంలో జియో వరల్డ్ సెంటర్‌లో ధీరుభాయ్ అంబానీ స్క్వేర్‌ను రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ ప్రారంభించిన విషయం తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ సంయుక్తంగా జియో వరల్డ్ సెంటర్ నిర్మించాయి. ఈ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి 2000 మంది చిన్నారులు హాజరయ్యారు.
స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటెయిన్ ఆకట్టుకుంటోంది. వందేమాతరం, జయహో గీతాల ఆలాపనకు లయబద్ధంగా వాటర్ ఫౌంటేయిన్ కదలికలు ఉన్నాయి. జియో వరల్డ్ సెంటర్ ప్రజలకు ఎంతగానో ఉపయోగకరమని.. 2 కోట్ల మంది ముంబై ప్రజల కోసమే దీన్ని నిర్మించామని నీతా తెలిపారు. ఇందులోనే సైనికులు, పోలీసుల కోసం వేర్వేరుగా రెండు మ్యూజికల్ ఫౌంటెయిన్లను ఏర్పాటు చేశారు.

ఈ మ్యూజికల్ ఫౌంటెయిన్ సందర్భంగా బృందావనంలో రాధాకృష్ణులు, గోపికల ఆటపాటలతో పాటు దేశ, విదేశాలకు చెందిన 150 కళాకారులతో నృత్య ప్రదర్శన, పాటలు, సంగీత కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక, చారిత్రాత్మక ఘటనలపై ఈ ప్రదర్శనలు కొనసాగుతాయి.
ఆకాశ్ అంబానీ-శ్లోకా మెహతాల వివాహ మహోత్సవంలో దీన్ని కీలక ఘట్టంగా భావిస్తున్నారు. 600 ఎల్ఈడీ లైట్లు, 392 వాటర్ నాజిళ్లతో 45 అడుగుల ఎత్తున నీటిని విరజిమ్మేలా మ్యూజికల్ ఫౌంటెయిన్ ను ఏర్పాటు చేశారు. కన్నుల పండువగా ఆకాశ్-శ్లోకా మెహతాల వివాహ మహోత్సవాన్ని చిరస్మరణీయం, మధుర స్మృతిగా మార్చుతామని ఈ సందర్భంగా నీతా అంబానీ తెలిపారు. ఈ అద్భుతమైన ఫౌంటెయిన్ అందరి హృదయాంతరాల్లో సంతోషాన్ని, విశ్వాసాన్ని నింపుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
రాబోయే రోజుల్లో ఈ మ్యూజికల్ ఫౌంటెయిన్ ముంబై వాసులకు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తుందన్నారు. జియో వరల్డ్ సెంటర్‌లోని ఈ స్క్వేర్ భవిష్యత్ ముఖచిత్రాన్ని మార్చేలా సందర్శకుల ఆదరణ పొందడమే కాక.. ముంబై నగర వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్తుందన్నారు.

ఈ సందర్భంగా 2000 మంది పిల్లలతో మ్యూజికల్ ఫౌంటెయిన్ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మార్చి 12న మరో రెండు మ్యూజికల్ ఫౌంటెయిన్లను ఏర్పాటు చేయనున్నట్టు నీతా అంబానీ తెలిపారు. ముంబై నగర గొప్పదనాన్ని చాటి చెప్పేలా, ముంబైనగరాన్ని అన్నిరకాలుగా సురక్షితంగా ఉంచుతున్న వారందరినీ కీర్తించేలా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. సమాజంలో మంచి మార్పులు తీసుకొచ్చేందుకు రిలయన్స్ ఫౌండేషన్ తన కార్యక్రమాలను కొనసాగిస్తుందని నీతా అంబానీ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications