SRH ఆ గండం దాటితేనే RR పై విజయం- గెలుపు ఛాన్స్ ఎవరికి ఎంత..!?
IPL 2026 SRH vs RR: ఐపీఎల్ లో ఈ రోజు మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఎలిమినేటర్ లో రెండు కీలక జట్లు తల పడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 2 కి అర్హత సాధించి గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది. ఓడిన జట్టు ప్రయాణం ఈ రోజుతో ముగుస్తుంది. అయితే, ఈ రెండు టీంల్లోనూ ఓపెనర్ల నుంచి బౌలర్ల వరకు ప్రతీ విభాగంలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. మానసికంగా సన్ రైజర్స్ పై చేయి సాధించినట్లు కనిపిస్తున్నా... ఆర్ ఆర్ తో అసలు గండం వారితో పొంచి ఉంది. దీంతో.. ఈ మ్యాచ్ పైన అంచనాలు పెరిగాయి.
ఐపీఎల్ లో ఈ రోజు ఎలిమినేటర్ పైన భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. ముల్లన్‌పూర్ లో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక్కడి పిచ్ ఈ సీజన్‌లో పరుగుల వరద పారించటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ పిచ్ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలస్తుందని చెబుతున్నారు. మ్యాచ్ ప్రారంభంలో పేసర్లకు కొద్దిగా స్వింగ్ లభిస్తుంది. రాత్రి వేళల్లో మంచు ప్రభావం ఉండటం వల్ల టాస్ గెలిచిన జట్టు ఖచ్చితంగా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంటుంది. ఇరు జట్లలోనూ భారీ హిట్టర్లు ఉండటంతో ఇక్కడ భారీ స్కోర్ నమోదు ఖాయంగా కనిపిస్తోంది. సన్ రైజర్స్ లో హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మల పవర్ హిట్టింగ్ హైదరాబాద్ జట్టుకు ప్రధాన బలంగా మారింది. వారితో పాటు ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి వంటి మ్యాచ్ విన్నర్లు ఉండటంతో ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది.

రెండు జట్ల మధ్య హోరా హోరీ పోరు
అదే విధంగా బౌలింగ్ విభాగం పటిష్ఠంగానే ఉంది. బౌలింగ్‌లో కెప్టెన్ పాట్ కమిన్స్, ఈషన్ మలింగ పవర్‌ప్లేలో వికెట్లు తీయటం కొనసాగితే.. సన్ రైజర్స్ కు గెలుపు కష్టం కాదు. అదే విధంగా రాజస్థాన్ భారీ స్కోరు చేయాలంటే ఎక్కువగా ఓపెనింగ్ జోడీ పైనే ఆశలు పెట్టుకుంది. వైభవ్ సూర్య వంశీ.. యశస్వి జైస్వాల్, కెప్టెన్ రియాన్ పరాగ్‌లతో పాటు లోయర్ ఆర్డర్‌లో శిమ్రాన్ హెట్‌మైర్, రవీంద్ర జడేజాలు రాణిస్తే హైదరాబాద్ భారీ హిట్టర్లకు రాజస్థాన్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్ వంటి క్వాలిటీ బౌలర్లు ఉండటం రాజస్థాన్‌కు కలిసొచ్చే అంశం. రెండు జట్ల మధ్య జరిగిన మొత్తం 23 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 విజయాలు సాధించగా, రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్‌ల్లో గెలిచింది. గతంలో జరిగిన నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్‌ను హైదరాబాద్ ఓడించిన ట్రాక్ రికార్డ్ ఉంది. అయితే, ఈ పిచ్ మాత్రం రాజస్థాన్ కు కలిసి వస్తోంది. దీంతో.. ఈ మ్యాచ్ లో ఫలితం పైన ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications