రూ.3.25కోట్ల బోనస్.. చేస్తే ఇలాంటి కంపెనీలో జాబ్ చెయ్యాలి బాస్!
ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారు జాబ్ సేఫ్టీ లేదని తెగ బాధ పడుతున్నారు. ఇక జీతాలే సరిగ్గా రాని వ్యవస్థలో అవస్థలు పడుతున్న వారు లేకపోలేదు. ఇక ఇంక్రిమెంట్ లు, బోనస్ ల మాట మరచిపోయి చాలా కాలం అయ్యింది. అయితే తాజాగా శామ్ సంగ్ ఎవరూ ఊహించని భారీ బోనస్ ను తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులకు ప్రకటించింది.
మెమరీ చిప్స్ తయారీలో శామ్ సంగ్ భారీ లాభాలు
దీంతో ఇప్పుడు అందరూ పని చేస్తే ఇలాంటి కంపెనీలో కదా పని చెయ్యాలి అని తెగ చర్చిస్తున్నారు. ఇంతకీ శామ్ సంగ్ ఇచ్చిన ఆ భారీ బోనస్ కథ ఏంటి అంటే ... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం కారణంగా ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లకు డిమాండ్ పెరగడంతో మెమరీ చిప్స్ తయారీలో దిగ్గజం శామ్ సంగ్ భారీ లాభాలు ఆర్జించింది.

ఒక్కో ఉద్యోగికి సగటున రూ.3.25 కోట్ల బోనస్
ఈ సక్సెస్‌ను ఉద్యోగులతో పంచుకుంటూ కంపెనీ చిప్ విభాగంలో పని చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి సగటున రూ.3.25 కోట్ల బోనస్ ప్రకటించింది. ఇది ఉద్యోగులకు అపూర్వమైన బహుమతిగా మారింది. గత త్రైమాసికంలో శామ్ సంగ్ చిప్ డివిజన్ ఆదాయం 49 రెట్లు పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. ఏఐ అప్లికేషన్లు, డేటా సెంటర్ల అవసరాలు పెరగడంతో మెమరీ చిప్స్‌కు అపార డిమాండ్ వచ్చింది.
ఉద్యోగులు జీతాల పెంపు వెనుక ఈ కారణం కూడా
ఈ అసాధారణ లాభాలను పరిగణనలోకి తీసుకుని బోర్డు ఆమోదంతో భారీ బోనస్ ప్యాకేజీని మంజూరు చేసింది. ఇటీవల శామ్ సంగ్ చిప్ విభాగంలోని ఉద్యోగులు జీతాల పెంపు, పనితీరు ఆధారిత బోనస్ వంటి డిమాండ్లతో 18 రోజుల సమ్మె హెచ్చరిక చేశారు. సెమీకండక్టర్ తయారీలో ఒక్కరోజు సమ్మె కూడా కంపెనీకి భారీ నష్టం కలిగించే అవకాశం ఉండటంతో నిర్వాహకులు ఉద్యోగుల సంఘంతో చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకున్నారు.
78,000 మంది ఉద్యోగులకు భారీ బోనస్
దీని ఫలితంగానే 78,000 మంది ఉద్యోగులకు ఈ భారీ బోనస్ అందనుంది. గతేడాది శామ్ సంగ్ తో పోటీ పడుతున్న మరో మెమరీ చిప్ తయారీ సంస్థ ఎస్కే హైనిక్స్ కూడా ఇలాంటి భారీ బోనస్‌ను ఉద్యోగులకు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఉద్యోగులకు జాక్ పాట్
ప్రపంచ మార్కెట్‌లో ఏఐ సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దక్షిణ కొరియా చిప్ దిగ్గజాలు లాభాలను ఉద్యోగులతో పంచుకోవడం గమనార్హం. ఏది ఏమైనా సరే పెద్ద పెద్ద కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటిస్తున్న వేళ శామ్ సంగ్ భారీ బోనస్ ఇవ్వటం ఆ ఉద్యోగులకు జాక్ పాట్ అనే చెప్పాలి.












Click it and Unblock the Notifications