వారికి షాక్.. ఒక్కరోజులోనే రూ.4,117 కోట్ల విలువైన భూములకు కంచె వేసిన హైడ్రా!
హైదరాబాద్ నగరంలో అక్రమ భూకబ్జాలు, చెరువుల ఆక్రమణలపై హైడ్రా అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టి సంచలనం సృష్టించారు. మంగళవారం ఐటీ కారిడార్ ప్రాంతాలైన కోకాపేట, ఖానామెట్, భరత్‌నగర్ పరిసరాల్లో ఏకకాలంలో నాలుగు ప్రధాన స్థలాలను కాపాడారు. ముఖ్య ఐటీ కారిడార్ ప్రాంతాలను కబ్జా నుంచి విముక్తి చేసి, వాటి చుట్టూ రక్షణ కంచెలు వేశారు.
4,117 కోట్ల విలువైన ప్రభుత్వ, చెరువు భూములను కాపాడిన హైడ్రా
ఈ ఒక్కరోజు ఆపరేషన్‌లో మొత్తం రూ.4,117 కోట్ల విలువైన ప్రభుత్వ మరియు చెరువు భూములను కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో ఎకరం భూమి ధర రూ.150 కోట్ల నుంచి రూ.177 కోట్ల వరకు ఉండడం విశేషం. హైడ్రా బలగాలు చేపట్టిన ఈ మెగా ఆపరేషన్ రియల్ ఎస్టేట్ సంస్థలు చేస్తున్న అక్రమాలను బయటపెట్టింది.

కోకాపేట కొత్తచెరువును కాపాడిన హైడ్రా
కోకాపేటలోని కొత్తచెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో గోల్డ్‌ఫిష్ విల్లాల పేరుతో ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ అక్రమంగా 1.09 ఎకరాలను ఆక్రమించి విల్లాలు నిర్మించింది. చెరువు భాగాన్ని మట్టితో పూడ్చి లగ్జరీ గార్డెన్లు, ఆట స్థలాలు ఏర్పాటు చేసింది. స్థానికుల ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా అధికారులు ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుని అక్రమ నిర్మాణాలను కూల్చేశారు.
ఈదులకుంట చెరువును కాపాడిన హైడ్రా
అదేవిధంగా కోకాపేట పెద్దచెరువు పరిధిలోని దాదాపు 22 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కాపాడారు. ఈ ఒక్క ప్రాంతంలోనే రూ.3,000 కోట్లకు పైగా విలువైన భూమి రక్షణలోకి వచ్చింది.
ఖానామెట్‌లో ఈదులకుంట చెరువును మ్యాప్ నుంచి మాయం చేసి స్కైస్క్రాపర్లు నిర్మించాలని కుట్ర జరిగింది. వరద నీటిని మళ్లించి చెరువును ఎండిపోయేలా చేశారు.హైడ్రా అధికారులు శాటిలైట్ చిత్రాలు, పాత ఎఫ్‌టీఎల్ సరిహద్దులను పరిశీలించారు.
వేల కోట్ల విలువచేసే ప్రభుత్వ భూములు కాపాడిన హైడ్రా
రూ.600 కోట్ల విలువ గల 6.50 ఎకరాల చెరువు భూమిని కాపాడారు. పక్కనే ఉన్న రూ.500 కోట్ల విలువ గల 5.16 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కబ్జా నుంచి విముక్తి చేశారు.భరత్‌నగర్-ఖైతలాపూర్-హఫీజ్‌పేట రహదారి విస్తరణకు సంబంధించి ఒక వ్యక్తి పూర్తి పరిహారం తీసుకున్నా 1700 గజాల స్థలాన్ని కబ్జాలో ఉంచి అక్రమ నిర్మాణాలు చేశాడు.
చెరువులను కాపాడటంతో పాటు నగర అభివృద్ధికి హైడ్రా
హైడ్రా ఈ నిర్మాణాలను కూల్చి రూ.17 కోట్ల విలువైన భూమిని రోడ్డు విస్తరణకు అప్పగించింది. ఈ ఆపరేషన్ ద్వారా చెరువులను కాపాడటంతో పాటు నగర అభివృద్ధికి మార్గం సుగమం అయింది. హైడ్రా తన చర్యలను మరింత తీవ్రతరం చేస్తుందని అధికారులు స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications