ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో కారిడార్.. రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్!
భాగ్యనగర వాసుల ప్రజా రవాణా వ్యవస్థను సంచలన మార్పులు చేసే భారీ ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రో నెట్‌వర్క్‌ను 391 కిలోమీటర్ల వరకు విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఓఆర్‌ఆర్ చుట్టూ పూర్తి మెట్రో కారిడార్‌ను నిర్మించనుంది.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 కోసం కేంద్రానికి డీపీఆర్
ఈ ప్రాజెక్టు ద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం తగ్గించి, ఆధునిక ప్రజా రవాణా సౌకర్యాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 కోసం 122.6 కిలోమీటర్ల మేర లైన్ల విస్తరణకు సంబంధించి రూ.38,595 కోట్లతో డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించింది.

ఈ రూట్స్ లో ముఖ్యమైన మెట్రో కారిడార్ లు
ఇందులో నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు, రాయదుర్గం నుంచి కోకాపేట వరకు, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు, మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు, ఎల్‌బీ నగర్ నుంచి హయత్‌నగర్ వరకు, జేబీఎస్ నుంచి మేడ్చల్ మరియు శామీర్‌పేట వరకు వంటి ముఖ్యమైన కారిడార్లు ఉన్నాయి. అంతేకాకుండా, శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్ల మెట్రో లైన్‌ను కూడా రెండో దశలోనే ప్రతిపాదించింది.
ఓఆర్‌ఆర్ చుట్టూ మెట్రో కనెక్టివిటీ ఏర్పాటు
ఈ లైన్‌ను మూడో దశగా పరిగణించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 158-160కిలోమీటర్ల మేర మెట్రో లూప్ నిర్మాణం ఈ మాస్టర్ ప్లాన్‌లో కీలకం. ఢిల్లీ మెట్రో లూప్ మాదిరిగా ఓఆర్‌ఆర్ చుట్టూ మెట్రో కనెక్టివిటీ ఏర్పాటు చేయడం ద్వారా శివారుప్రాంతాలైన ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు, చౌటుప్పల్, మేడ్చల్, శామీర్‌పేట, శంషాబాద్, తుక్కుగూడ, ఘట్‌కేసర్ వంటి ప్రాంతాలనుంచి నగరంలోకి వచ్చే లక్షలాది మందికి సౌకర్యం కలుగుతుంది.
దేశంలోనే అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌లో ఒకటిగా హైదరాబాద్.. రేవంత్ ప్లాన్
ఇది ట్రాఫిక్ సమస్యలను బాగా తగ్గించి, ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుంది. మొత్తం మూడు దశల్లో 391 కిలోమీటర్ల మెట్రో నెట్‌వర్క్‌తో హైదరాబాద్‌ను దేశంలోనే అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌లో ఒకటిగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే నగరం ఆధునిక, ఎకో ఫ్రెండ్లీ మహానగరంగా మారుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
.













Click it and Unblock the Notifications