ఇన్ఫోసిస్‌కు మరో షాక్: భారీ పరిహారం కోసం అమెరికా కోర్టులో దావా
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు మరో షాక్ తగిలింది. ఫౌండర్స్, ఇన్ఫీ మధ్య నెలకొన్న ప్యాకేజీ వివాదం కొనసాగుతున్న తరుణంలో ఇన్ఫోసిస్ లిమిటెడ్ .
బెంగళూరు: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు మరో షాక్ తగిలింది. ఫౌండర్స్, ఇన్ఫీ మధ్య నెలకొన్న ప్యాకేజీ వివాదం కొనసాగుతున్న తరుణంలో ఇన్ఫోసిస్ లిమిటెడ్ అమెరికా ఇమ్మిగ్రేషన్ మాజీ హెడ్ ఎరిన్ గ్రీన్ తాజాగా కంపెనీపై దావా వేశారు. జాతి వివక్ష, సీనియర్ అధికారుల వేధింపులు, మేనేజ్‌మెంట్ కక్షపూరిత వైఖరి తదితర ఆరోపణలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
ఇందుకు తనకు భారీ నష్ట పరిహారం ఇప్పించాలని కోరుతూ ఆయన టెక్సాస్ కోర్టులో ఫిర్యాదు చేశారు. 53పేజీల ఫిర్యాదు పత్రంలో కంపెనీ సీనియర్ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, 2011లో ఇన్ఫోసిస్‌లో చేరిన ఎరిన్ గ్రీన్.. ఉద్యోగ వివక్షత, మేనేజ్‌మెంట్ సీనియర్లు తనపై ప్రతీకార దోరణిలో వ్యవహరించారంటూ జూన్ 19న టెక్సాస్ తూర్పు జిల్లాలోని ఓ కోర్టులో ఈ పిటీషన్ వేశారు.

ఇన్ఫోసిస్ ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్‌పై తీవ్రమైన ఆరోపణలను చేశారు. గ్లోబల్ ఇమ్మిగ్రేషన్ అధిపతి వాసుదేవ నాయక్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, టెక్నాలజీ ఆపరేషన్స్ గ్లోబల్ హెడ్ వినోద్ హేంపాపుర్ పై విమర్శలు గుప్పించారు. గత సంవత్సరం సంస్థను విడిచిపెట్టాల్సిందిగా కోరడంపై ఆయన ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది.
దీనిపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాల్సిందిగా కోర్టుకు ఎరిన్ విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ వ్యవహారంపై స్పందించడానికి ఇన్ఫోసిస్ నిరాకరించింది. ఇటీవల ప్రమోటర్లు కంపెనీలోని వాటాలను విక్రయించనున్నారని వార్తల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలోనే కంపెనీ అమెరికా హెడ్, అంతర్జాతీయ ప్రొడక్ట్, రిటైల్ విభాగ అధిపతి సందీప్ దద్లానీ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన అమెరికాకు చెందిన స్నికర్స్ తయారీ సంస్థ మార్స్‌లో చేరారు. తాజాగా ఎరిన్ దావాతో ఇన్ఫోసిస్‌కు మరో షాక్ తగిలినట్లయింది.












Click it and Unblock the Notifications