యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళికి చోటు.. ప్రధాని మోడీ స్పెషల్ పోస్ట్ !
దీపావళి.. చీకటిని తొలగించి వెలుగును నింపే ఈ హిందూ పండుగను భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే ఈ ప్రపంచ ప్రసిద్ధ పండుగకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. యునెస్కో దీపావళిని "మానవ సంస్కృతికి చెందిన వారసత్వ జాబితా"లో అధికారికంగా చేర్చింది. దీపావళికి ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఉన్న విశేషమైన గౌరవం.. సాంస్కృతిక సందేశం ఈ గుర్తింపునకు ప్రధాన కారణాలు అని యునెస్కో తెలిపింది. ఈ నిర్ణయం భారత్‌కు మాత్రమే కాకుండా మొత్తం భారతీయ డయాస్పోరాకు కూడా గర్వకారణమైంది.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో స్పందించారు. దీపావళి మన సంస్కృతికి, విలువలకు, ఆధ్యాత్మికతకు ప్రతీక అని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జరుపుకునే ఈ వెలుగుల పండుగ యునెస్కో జాబితాలో చేరడం ప్రతి భారతీయుడికి గర్వకారణం అని పేర్కొన్నారు. ఇది మన నాగరికతకు ఆత్మ.. శ్రీరాముడి ఆదర్శాలు, ఆయన జీవితం చెప్పే వెలుగు మార్గమని పేర్కొన్నారు. ప్రపంచంలోని భారతీయులు ఈ వార్తను ఎంతో ఉత్సాహంతో స్వాగతిస్తున్నారని ఆయన అన్నారు.

కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా ఈ నిర్ణయాన్ని చారిత్రాత్మక దినంగా అభివర్ణించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారతీయ వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో అనూహ్యమైన గుర్తింపు పెరుగుతోందని అన్నారు. ఇటీవలే గర్బా, గంగానది సంస్కృతి, యోగా వంటి అంశాలకు అంతర్జాతీయ గుర్తింపు రావడం కూడా భారతీయ సంప్రదాయ బలాన్ని ప్రపంచానికి తెలియజేస్తోందని తెలిపారు.
ఢిల్లీ ఎర్రకోట వేదికగా ఈ నెల 8 నుండి 13 వరకు జరుగుతున్న యునెస్కో 20వ అంతర్ ప్రభుత్వ కమిటీ సమావేశాల్లో ప్రపంచంలోని 80 దేశాలు సమర్పించిన 67 ప్రతిపాదనలను పరిశీలించారు. భారతీయ ప్రతినిధులు సమర్పించిన దీపావళి అంశం ఆధ్యాత్మికత, సంప్రదాయం, కళారూపాలు, కుటుంబ విలువలు, సామాజిక సమగ్రత వంటి పలు కోణాలను ప్రతిబింబించడం వల్లే ఈ జాబితాలో చోటు దక్కినట్లు స్పష్టం చేశారు.
ఇప్పటివరకు కుంభమేళా, దుర్గాపూజ, గుజరాత్ గర్భా, రామలీలా, యోగా, నవరాత్రి సంగీత పరంపర వంటి 15 భారతీయ సంప్రదాయాలు యునెస్కో వారసత్వ జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు దీపావళి చేరికతో ఆ సంఖ్య 16కి పెరిగింది. దీంతో భారతీయ సంస్కృతికి ప్రపంచ వేదికపై మరొక అరుదైన గుర్తింపు లభించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ గుర్తింపు ఆధ్యాత్మిక పర్యాటకాన్ని.. భారతీయ సంప్రదాయ పండుగల అంతర్జాతీయ ప్రాచుర్యాన్ని మరింత పెంచబోతుంది. ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే దీపావళిని జరుపుకుంటున్నప్పటికీ, ఇప్పుడు ప్రభుత్వ స్థాయిలో కూడా పండుగకు మరింత ప్రాధాన్యం వచ్చే అవకాశాలున్నాయి. భారతీయ సాంస్కృతిక శక్తి, నాగరికత గంభీరతను అంతర్జాతీయ వేదికలపై మరింత బలంగా నిలబెట్టే పురోగమన అడుగుగా దీన్ని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications