స్టాలిన్ పంపారా..చంద్రబాబు పిలిపించారా: కేసీఆర్‌కు జలక్ ఇచ్చేందుకా : బాబుతో డిఎంకే నేత భేటీ..!
ఏపీ సచివాలయంలో కేబినెట్ మొదలయ్యే సమయం. సడన్‌గా చెన్నై నుండి డీఎంకే కోశాధికారి దురై మురుగన్ అక్కడికి చేరుకున్నారు. ఆయన వెంట టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నారు. ఆయనను స్టాలిన్ పంపారని..కేసీఆర్‌తో భేటీ వివరాలను చంద్రబాబుకు చెప్పమని పంపారని టీడీపీ మీడియాకు లీకులు ఇచ్చింది. అయితే, కేసీఆర్‌తో జరిగిన భేటీ పైన ఇప్పటికే స్టాలిన్ వివరణ ఇచ్చారు. చంద్రబాబుకు వద్దకు పార్టీ నేతను పంపి మరీ వివరించాల్సిన అవసరం ఉంటుందా..లేక అసలు చంద్రబాబే దురై మురుగన్‌ను పిలిపించారా..
చంద్రబాబుతో డిఎంకే నేత భేటీ..
ఏపీ సచివాలయంలో డీఎంకే నేత దురై మురుగన్ సడన్‌గా ప్రత్యక్షమయ్యారు. ఆయన వెంట సీఎం రమేష్ సైతం ఉన్నారు. ఆయన దగ్గర ఉండి మరీ ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. ఇంతలో టీడీపీ నుండి మీడియాకు లీకులు వచ్చాయి. డీఎంకే అధినేత స్టాలిన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యారు. ఆ భేటీ వివరాలను చంద్రబాబుకు వివరించమని స్టాలిన్ ఆయన్ను పంపారనేది ఆ లీకుల సారాంశం. అయితే, డీఎంకే అధినేత స్టాలిన్ తమతో కేసీఆర్ భేటీ గురించి ఇప్పటికే స్పందించారు. అది మర్యాద పూర్వక భేటీ మాత్రమేనని స్పష్టం చేసారు. దేశంలో మూడో ఫ్రంట్‌కు అవకాశం లేదనే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఇదే సమయంలో చెన్నైలో రాజకీయంగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు డీఏంకేతో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిని డీఎంకే ఖండించింది. సరిగ్గా ఇదే సమయంలో దురై మురుగన్ అమరావతితో చంద్రబాబుతో సమావేశమయ్యారు.

పంపించారా..పిలిపించారా..
ఇంతకీ దురై మురుగన్ అమరావతి ఎందుకు వచ్చారు. ఆయన సోమవారం స్టాలిన్-కేసీఆర్ సమావేశంలోనూ పాల్గొన్నారు. ఆయనను స్టాలిన్ పంపారని చెప్పటం ద్వారా..కేసీఆర్‌కు తమ సత్తా చాటాలనే లక్ష్యం టీడీపీ నేతల్లో కనిపించింది. కానీ, లోతుగా ఆలోచన చేస్తే నిజంగా డీఎంకేకు అంత అవసరం ఉంటుందా అనేదే అసలు చర్చ. ఇక, గతంలో ఒక సారి పరిశీలిస్తే..నవీన్ పట్నాయక్‌తో ఒడిశా వెళ్లి కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ మరుసటి రోజు టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ ఒడిశాకు చెందిన బిజేడీ ఎంపీతో కలిసి ముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు. అప్పుడు సైతం సరిగ్గా ఇదే విధంగా టీడీపీ నుండి లీకులు వచ్చాయి. తాను కేసీఆర్ ప్రతిపాదించే ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతు ఇచ్చేది లేదని..తమకు చంద్రబాబు అంటే గౌరవం ఉందని ఆ లీకు సారాంశం. ఆ తరువాత వచ్చిన ఎంపీ..నవీన్ పట్నాయక్ పంపలేదని తెలిసింది. దీంతో..ఇప్పుడు కూడా అదే రకంగా వ్యవహరించారా అనే చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications