వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతదేశంలో అమ్ముతున్న శానిటరీ ప్యాడ్‌లలో హాని కలిగించే రసాయనాలు ఉన్నాయా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
శానిటరీ ప్యాడ్స్

"భారతదేశంలో విక్రయించే శానిటరీ ప్యాడ్స్ తయారీలో శరీరానికి హాని కలిగించే థాలేట్, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (వీఓసీలు) వంటి విషపూరితమైన రసాయనాలను వాడుతున్నారు."

దిల్లీకి చెందిన టాక్సిక్స్ లింక్ అనే సంస్థ చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడిందని ఒక నివేదికలో తెలిపారు. ఈ సంస్థ పర్యావరణంపై పనిచేస్తుంది.

టాక్సిక్స్ లింక్ సంస్థ దేశంలో విక్రయిస్తున్న 10 బ్రాండ్ల శానిటరీ ప్యాడ్‌లను అధ్యయనం చేసింది. వాటిలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని కనుగొన్నారు.

ఈ ప్యాడ్స్ తయారీలో ఉపయోగించే థాలేట్, వీఓసీలు యూరోపియన్ యూనియన్ నిబంధనల ప్రకారమే ఉన్నప్పటికీ, ఈ రసాయనాల దుష్ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని టాక్సిక్స్ లింక్ చీఫ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రీతి మహేష్ చెప్పారు.

టాక్సిక్స్ లింక్ మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యను లేవనెత్తిందని, అయితే వాళ్లు తీసుకున్న శాంపిల్ చాలా చిన్నదని, పరిశోధన సమగ్రంగా ఉండాలని 'ది ప్యాడ్ ప్రాజెక్ట్‌' సంస్థలో అంతర్జాతీయ ప్రోగ్రామ్ డైరెక్టర్ తాన్యా మహాజన్ అభిప్రాయపడ్డారు.

అమెరికాలో ఉన్న ఈ ఎన్జీవో దక్షిణ ఆసియా, ఆఫ్రికాలలో రుతుక్రమం సమయంలో మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, పీరియడ్స్ చుట్టూ ఉన్న అపోహలను తొలగించడం, మహిళా సాధికారత మొదలైన అంశాలపై పనిచేస్తోంది.

టాక్సిక్స్ లింక్ పరిశోధన ప్యాడ్స్ పట్ల కొంత అవగాహన కలిగిస్తోంది కానీ, దీనిపై విస్తృత పరిశోధన జరగాలని తాన్యా అన్నారు.

పరిశోధన కోసం తీసుకున్న శాంపిల్ చిన్నదని ప్రీతి మహేష్ కూడా అంగీకరించారు. అయితే, ఒక ప్రభుత్వేతర సంస్థగా ప్రజలకు అవగాహన కలిగించడమే తమ లక్ష్యమని, పెద్ద పెద్ద శాంపిల్స్ సేకరించడం తమ లాంటి సంస్థలకు అసాధ్యమని ఆమె వివరించారు.

శానిటరీ ప్యాడ్

అధ్యయనంలో ఏముంది?

శానిటరీ ప్యాడ్‌లలో 12 రకాల థాలేట్లు ఉన్నాయని టాక్సిక్స్ లింక్ పరిశోధనలో బయటపడింది.

థాలేట్ అనేది ఒక రకమైన ప్లాస్టిక్. ప్యాడ్‌ల మన్నిక కోసం దీన్ని ఉపయోగిస్తారు.

టాక్సిక్స్ లింక్ తమ పరిశోధన ఆధారంగా 'ర్యాప్డ్ ఇన్ సీక్రెసీ: టాక్సిక్ కెమికల్స్ ఇన్ మెన్‌స్ట్రువల్ ప్రొడక్ట్స్' అనే నివేదికను ప్రచురించింది.

పరిశోధన కోసం ఉపయోగించిన నమూనాలలో 24 రకాల వీఓసీలను కనుగొన్నామని, వాటిలో జిలీన్, బెంజీన్, క్లోరోఫామ్ మొదలైనవి ఉన్నాయని ఈ నివేదికలో పేర్కొంది.

పెయింట్స్, నెయిల్ పాలిష్ రిమూవర్లు, క్రిమిసంహారకాలు, క్లీన్సర్లు, రూమ్ డియోడరైజర్లు మొదలైన వాటిలో పై రసాయనాలను ఉపయోగిస్తారు.

టాక్సిక్స్ లింక్‌లో చీఫ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రీతి మహేష్ బీబీసీతో మాట్లాడుతూ, "మేం పరిశోధన కోసం భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న 10 వేర్వేరు కంపెనీల నుంచి ఆర్గానిక్, ఇనార్గానిక్ శానిటరీ ప్యాడ్‌లను తీసుకున్నాం. ఈ రెండు రకాల ప్యాడ్‌లలో ఉన్న రసాయనాలను తనిఖీ చేశాం. వీటిలో థాలేట్లు, వీఓసీలు ఉన్నాయని కనుగొన్నాం. మహిళలు సంవత్సరాల తరబడి ఈ ప్యాడ్‌లను ఉపయోగిస్తారు. ఈ రసాయనాలు యోని ద్వారా శరీరంలోకి ప్రవేశించి, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి" అని అన్నారు.

యూరోపియన్ యూనియన్ నియమాల ప్రకారం, ఒక శానిటరీ ప్యాడ్ మొత్తం బరువులో 0.1 శాతం కంటే ఎక్కువ థాలేట్‌ను ఉపయోగించకూడదని, తాము సేకరించిన నమూనాలలో థాలేట్లు ఈ నియమానికి లోబడి ఉన్నాయని ఆమె తెలిపారు.

ఈ పరిశోధన పెద్దపెద్ద బ్రాండ్‌లపై జరిగింది. అయితే చిన్న బ్రాండ్‌లలో ఈ రసాయనాలను మోతాదుకు లోబడి ఉపయోగిస్తున్నారో లేదో పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, భారతదేశంలో, రసాయనాల పరిమాణంపై ఎలాంటి పరిమితి స్పష్టం చేయలేదు.

రుతుస్రావం

శరీరంపై థాలేట్, వీఓసీల ప్రభావం

భారతదేశంలో 35.5 కోట్లకు పైగా మహిళలు, బాలికలు రుతుస్రావం కలిగి ఉన్నారు. ప్రభుత్వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం, 15-24 ఏళ్ల వయసున్న బాలికల్లో 64 శాతం శానిటరీ ప్యాడ్‌లను ఉపయోగిస్తున్నారు. 24 ఏళ్లు పైబడిన మహిళల సంఖ్యను కూడా జోడిస్తే, ఈ శాతం మరింత అధికంగా ఉంటుంది.

ప్రతి నెలా ప్యాడ్స్ ఉపయోగించే మహిళలపై అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి?

ఈ రసాయనాలు యోని ద్వారా మహిళ శరీరంలోకి చేరి, అక్కడ పేరుకుపోతాయని చిత్తూరులోని అపోలో హాస్పిటల్‌లో పనిచేస్తున్న డాక్టర్ శ్రీపాద్ దేశ్‌పాండే చెబుతున్నారు.

"థాలేట్స్, ఇతర రసాయనాలు ఎండోక్రైన్ అంటే హార్మోన్ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. ఇది స్త్రీలలో అండోత్పత్తి, సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది. సంతానలేమికి దారి తీయవచ్చు. ఇదే కాకుండా, యోనిలో వాపు, దురద తదితర సమస్యలు రావచ్చి. వీటి ప్రభావం గర్భాశయంపై పడుతుంది. వీఓసీలకు ఎక్కువ కాలం ఎక్స్‌పోజ్ అయితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది" అని డాక్టర్ శ్రీపాద్ దేశ్‌పాండే వివరించారు.

క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ రాశి అగర్వాల్ మాట్లాడుతూ, "ఈ పరిశోధనపై వ్యాఖ్యానించలేనుగానీ, థాలేట్ రసాయనం వినియోగం వల్ల క్యాన్సర్‌ రావచ్చు. దీన్ని శానిటరీ ప్యాడ్‌లలో మాత్రమే కాకుండా సిగరెట్లు, మద్యం మొదలైన వాటిలో కూడా వాడతారు" అని చెప్పారు.

"శరీరంలోకి ప్రవేశించే ఏ రసాయనమైనా కణాల నిర్మాణాన్ని మారుస్తుంది. మన శరీరంలో ఆరోగ్యకరమైన, అనారోగ్య కణాలు ఉంటాయి. మన రోగనిరోధక వ్యవస్థ చెడు లేదా అనారోగ్య కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. కానీ, కొన్నిసార్లు అలా జరగకపోవచ్చు. అలాంటప్పుడు థాలేట్ల ద్వారా ప్రభావితమైన కణాలు శరీరంలోనే ఉండిపోతాయి. ఆ కణాలు క్యాన్సర్‌ను కలిగించవచ్చు లేదా క్యాన్సర్‌కు కారణమయ్యే అనారోగ్య కణాలను ప్రభావితం చేయవచ్చు" అని డాక్టర్ రాశి అగర్వాల్ వివరించారు.

అయితే, మనం వాడే చాలా రకాల వస్తువులలో ఈ రసాయనాలను వాడుతున్నారని, అవి శరీరంపై ప్రభావం చూపుతాయని ఆమె అంటున్నారు.

రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఆస్పత్రిలోని డాక్టర్ స్వరూప మిత్ర కూడా ఇదే విషయాన్ని చెప్పారు.

"మహిళలు నెలలో నాలుగైదు రోజులు శానిటరీ ప్యాడ్ ఉపయోగిస్తారు. ఈ రసాయనాలు చర్మం, యోని స్రావాల ద్వారా శరీరంలోకి వెళతాయి. ఇవి మెదడుపై ప్రభావం చూపిస్తాయి. అలాగే, స్త్రీలలో జననేంద్రియ వ్యాధులకు కారకం కావచ్చు. ఈ వ్యాధులు మధుమేహం, అధిక రక్తపోటుకు దారి తీస్తాయి. గర్భస్రావం, కాన్పు తేదీ కన్నా ముందే బిడ్డ పుట్టడం, అకాల మెనోపాజ్ వంటి సమస్యలు కూడా రావచ్చు" అని డాక్టర్ స్వరూప చెప్పారు.

కాటన్ ప్యాడ్‌

వీఓసీల ప్రభావం

వీఓసీలు శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తాయి. కళ్లు, ముక్కు, చర్మంపై అలర్జీ, తలనొప్పి, గొంతులో ఇన్ఫెక్షన్, కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం చూపవచ్చు.

"చాలా ఉత్పత్తుల్లో థాలేట్, వీఓసీలను వాడతారు. బట్టలు, బొమ్మలు, ఇంట్లో వాడుకునే వస్తువులు.. వీటన్నిట్లో ఉంటాయి. కానీ, వాటిని ఎంత మోతాదులో వాడుతున్నారన్నది ముఖ్యం. థాలేట్.. ప్లాస్టిక్ లేదా పాలిమర్ పదార్థం. దీన్ని ప్యాడ్ పై భాగం లేదా కింది భాగంలో వాడతారు. ద్రవాలను పీల్చుకోవడానికి కూడా పాలిమర్ వాడతారు. అయితే, దీనికి ప్రత్యామ్నాయం ఏమిటో ఆలోచించాలి" అని తాన్యా మహాజన్ అన్నారు.

శానిటరీ ప్యాడ్‌లకు బదులుగా కాటన్ ప్యాడ్‌లు, మెన్‌స్ట్రువల్ కప్పులు, టాంపాన్‌లు వాడవచ్చు. కానీ వీటి తయారీలో ఎలాంటి రసాయనాలు ఉపయోగిస్తున్నారు, అవి ఎంత సురక్షితమైనవి అనే దాని గురించి సమాచారం అందుబాటులో ఉండాలని తాన్యా అన్నారు.

మెన్‌స్ట్రువల్ హెల్త్ అలయన్స్ ఇండియా (MHAI) అంచనా ప్రకారం, దాదాపు 12 కోట్ల మంది మహిళలు శానిటరీ ప్యాడ్‌లను ఉపయోగిస్తున్నారు. వీటి నుంచి ఉత్పన్నమయ్యే వ్యర్థాలు ఇప్పటికీ ఒక పెద్ద సమస్యగా మిగిలిపోయాయి.

ఒక శానిటరీ ప్యాడ్‌ను పలుమార్లు ఉపయోగించగలిగేలా కొన్ని సంస్థలు తయారుచేస్తున్నాయి. దేశంలో 30 కంటే ఎక్కువ సంస్థలు ఇలాంటి ప్యాడ్స్ తయారుచేస్తున్నాయని ఒక అంచనా. వీటిలో అరటి నార, గుడ్డ లేదా వెదురును ఉపయోగిస్తున్నారు.

దేశంలో తయారయే శానిటరీ ప్యాడ్‌లలో ఉపయోగించే రసాయనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రమాణాలను నిర్ణయించాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే, ఇలాంటి పరిశోధనలు చేయడంలో ప్రభుత్వం చొరవ చూపాలని అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

English summary
Do sanitary pads sold in India contain harmful chemicals?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X