నిప్పుతో చెలగాటమొద్దు: మమత, మీడియాపై చిందులు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ భారతీయ జనతా పార్టీ, సీపీఎం పైన బుధవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిప్పుతో చెలగాటం ఆడవద్దని బీజేపీని హెచ్చరించారు. మత రాజకీయాలకు పాల్పడవద్దని హితవు పలికారు. బీజేపీ మత రాజకీయాలకు సీపీఐ(ఎం) కూడా కారణమని ఆమె ఆరోపించారు.
దక్షిణ 24 పరగణాలలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మత రాజకీయాల ఉచ్చులో పడవద్దని కార్యకర్తలకు సూచించారు. అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే దగ్గరలోని పోలీసు స్టేషన్‌లకు సమాచారం అందించాలని చెప్పారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పైన ఆమె మండిపడ్డారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక గుజరాత్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీలో ఘర్షణలు చోటు చేసుకున్నాయన్నారు. మోడీ ప్రభుత్వం అధికారాన్ని మిస్ యూజ్ చేస్తోందన్నారు. రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు సీపీఐ(ఎం)ను ఉపయోగించుకుంటోందన్నారు. అక్టోబర్ 1న బుర్ద్వాన్‌లో జరిగిన బ్లాస్ట్‌ను రాజకీయం చేస్తోందన్నారు. ఓక వర్గాన్ని కించపరచవద్దన్నారు. సీపీఎంతో కలిసి బీజేపీ దాడులకు పాల్పడుతోందని టీఎంసీ ఆరోపించింది.

శారదా చిట్‌ఫండ్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు పీకల దాకా కూరుకుపోయిన విషయమై గురువారం మమతా బెనర్జీ మీడియాపై చిందులు తొక్కారు. దేశంలోని అతి పేద పార్టీల్లో తమ పార్టీ ఒకటని కార్యకర్తలనుద్దేశించి అన్నారు.
శారదా చిట్‌ఫండ్ నుంచి కాదు కదా ఏ ఒక్క చిట్‌ఫండ్ కంపెనీ నుంచి తమ పార్టీ నేతలు చిల్లిగవ్వ కూడా ముట్టలేదన్నారు. అయితే, ఈ వ్యవహారంలో మీడియా తమను దొంగలుగా చిత్రీకరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
శారదా చిట్‌ఫండ్ సంస్థ నుంచి లంచాలను తమ పార్టీ నేతలు స్వీకరించినట్లుగా ఆధారాలేమైనా ఉంటే చెప్పండని మీడియాను ప్రశ్నించారు. మీ మీద మాకేమీ పగ లేదని, అలాగని మాపై అపనిందలు వేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. దయచేసి అబద్ధాలు ప్రచారం చేయొద్దని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు.
టీఎంసీపై బీజేపీ అధ్యక్షుడి ఆగ్రహం
పశ్చిమ బెంగాల్ లో సీపీఎం పార్టీతో కలసి బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతోందన్న ఆరోపణలు రుజువు చేస్తే తాను ఉరేసుకుంటానని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాహుల్ సిన్హా సవాలు విసిరారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఎదుగుదల చూసి ఓర్వలేని తృణమూల్ కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు.
బంగ్లా ముస్లింలను వెనక్కి పంపాల్సిందే
బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చిన ముస్లింలను తక్షణం వెనక్కి పంపాల్సిందేనని, వారిని చొరబాటుదారులుగానే పరిగణించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. భారత్‌లో చొరబాట్లకు ముగింపు పలకాల్సిందేనని, లేనిపక్షంలో అభద్రత పెరిగిపోతుందని విహెచ్‌పి అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా స్పష్టం చేశారు.
చొరబాట్లవల్ల భారతీయులకు భద్రత కొరవడుతోందని, ప్రశాంత జీవనానికి భంగం కలుగుతోందని అన్నారు. చాలా రాష్ట్రాల్లో చొరబాట్లవల్ల భద్రతకు ముప్పు వాటిల్లుతోందని, కేంద్రంతోపాటు సంబంధిత రాష్ట్రాలు దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సరిహద్దు నుంచి ఉగ్రవాద శక్తులు చొరబడకుండా నిరోధించాల్సిన అవసరముందన్నారు.
అక్టోబర్ 2న బర్ద్వాన్‌లో జరిగిన పేలుడులో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు మరణించిన విషయాన్ని తొగాడియా ఈ సందర్భంగా గుర్తుచేశారు. బంగ్లాలో హిందువులు వేధింపులకు, హింసకు గురవుతున్నారని, ఆ కారణంతో వలస వచ్చిన హిందువులను శరణార్థులుగా భావించి శాశ్వత పౌరసత్వం కల్పించాలన్నారు.
బంగ్లాలో హింస కారణంగా యాభైవేలమంది హిందువులు భారత్‌కు వలస వచ్చారని తొగాడియా పేర్కొన్నారు. చొరబాట్లు కేవలం పశ్చిమ బెంగాల్‌కే పరిమితం కాలేదని, అస్సాం, జార్ఖండ్ రాష్ట్రాలకూ పాకిందని తెలిపారు. చైనా వస్తువులపై తొగాడియా మాట్లాడుతూ.. కేంద్రం వీటికి అడ్డుకట్ట వేయని పక్షంలో దేశీయంగా లక్షలాదిమంది ఉపాధి కోల్పోతారన్నారు.












Click it and Unblock the Notifications