నేను రేసులో లేను.. ప్రధాని పదవిపై ఆశలేదు..
ఢిల్లీ : బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ప్రధానిని మారుస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సంఖ్యాబలం తగ్గితే మోడీ స్థానంలో మరొకరికి అవకాశమిస్తారన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.

ప్రధాని కావాలన్న ఆశలేదు
మెజార్టీ తగ్గితే ప్రధాని మోడీ స్థానంలో నితిన్ గడ్కరీకి అవకాశం ఇస్తారన్న వార్తలపై ఆయన స్పందించారు. తాను రేసులో లేనని, అసలు ప్రధాని కావాలన్న ఆశ, కల తనకు లేదని తేల్చిచెప్పారు. ప్రధాని మోడీయే తమ లీడర్ అన్న ఆయన.. బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆయన పీఎంగా కొనసాగుతారని తేల్చిచెప్పారు.

ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఈసారి భారీ మెజార్టీ సాధిస్తుందని నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు. "మేం కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజార్టీ వచ్చినా.. భాగస్వామ్యపక్షాలతో కలిసి నడుస్తాం. దాన్ని ఎన్డీఏ ప్రభుత్వంగానే పరిగణిస్తామ"ని గడ్కరీ స్పష్టంచేశారు.

3 రాష్ట్రాల్లో పెరగనున్న ఆధిక్యం
సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి మూడు రాష్ట్రాల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుందని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఒడిశా, బెంగాల్, కేరళల్లో అనుకూల పరిస్థితులు ఉన్నందున సీట్లు పెరుగుతాయని చెప్పారు. గత ఎన్నికల్లో 80లో 71 స్థానాలు గెల్చుకున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈసారి పార్టీ బలం తగ్గుతుందన్న వాదనల్ని ఆయన కొట్టిపారేశారు.

విమర్శకు ప్రతి విమర్శ తప్పదు
రాజకీయాల్లో విమర్శకు ప్రతివిమర్శ తప్పదన్నారు నితిన్ గడ్కరీ. ప్రధాని మోడీ దివంగత పీఎం రాజీవ్‌గాంధీని టార్గెట్ చేయడంలో స్పందించిన ఆయన అందులో తప్పేమీలేదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీని ఎన్నోసార్లు తిట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు సర్వసాధారణమేనని గడ్కరీ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications