Delhi Rain: ఢిల్లీ వర్షం కృత్రిమమా ? సహజమా ?- కేజ్రివాల్ సర్కార్ క్లారిటీ..
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టు సైతం ఢిల్లీలో కాలుష్యంపై మండిపడుతోంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఉన్నట్లుండి చిరు జల్లులు కురిశాయి. ఇందులో విచిత్రం ఏమీ లేకపోయినా వీటి కారణంగా ఉదయం కల్లా చాలా ప్రాంతాల్లో వాయు కాలుష్యం భారీగా తగ్గింది. దీంతో ఈ వర్షం మహిమపై ఇవాళ సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఢిల్లీలో నిన్నటి రాత్రి కురిసిన చిరు జల్లులతో వాయు కాలుష్యం తగ్గడానికి, తాజాగా కాన్పూర్ ఐఐటీ సాయంతో నగరంలో వాయు కాలుష్యం తగ్గించేందుకు కృత్రిమ వర్షం కురిపించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు గల సంబంధాలపై చర్చ జరుగుతోంది. దీనిపై ఢిల్లీ రవాణామంత్రి గోపాల్ రాయ్ ను మీడియా ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని ఆయన సమాధానం ఇచ్చారు. అలాగే ఐఐటీ-కాన్పూర్ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి అనేక అనుమతులు అవసరమని తెలిపారు.

ఢిల్లీలో నిన్న కురిసిన వర్షం ప్రభావాన్ని ఓవైపు ప్రభుత్వం అంచనా వేసే పనిలో ఉంది. ఈ వర్షం వల్ల కాలుష్యం ఎంత తగ్గిందో పరిశీలిస్తోంది. అదే సమయంలో కాన్పూర్ ఐఐటీ సూచించిన కృత్రిమ వర్షం కురిపించే ప్రయోగానికి సుప్రీంకోర్టు అనుమతి తీసుకునేందుకు కూడా ప్రయత్నిస్తోంది. కానీ ఢిల్లీ సర్కార్ చేస్తున్న హడావిడితో మాత్రం ఇప్పటికే ప్రయోగాత్మకంగా కృత్రిమ వర్షం కురిపించేశారా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ వర్షానికి తగ్గిన కాలుష్యమే ఇందుకు కారణం.
అయితే కృత్రిమ వర్షం కురిపించడానికి అనేక అనుమతులు అవసరమని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఇది ఒక్క రోజులో సాధ్యం కాదన్నారు. తాము ఈ ప్రతిపాదనను సుప్రీంకోర్టు ముందు సమర్పించామని వెల్లడించారు. కోర్టు ఆమోదించిన తర్వాత, అవసరమైతే, అవసరమైనప్పుడు దీన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వర్షానికి ముందు 450 పైన ఉన్న AQI ఇప్పుడు దాదాపు 300కి చేరుకుంది. నవంబరు 13 నుండి 20 వరకు బేసి-సరి అమలు నిర్ణయం వాయిదా పడింది. దీపావళి తర్వాత పరిస్థితిని మళ్లీ విశ్లేషిస్తామని మంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications