వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంక్రాంతి: ‘మద్యం మత్తులో గొర్రె తలకు బదులు తమ్ముడి తల నరికాడు’ – ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కత్తి, వేట కత్తి

కనుమ పండుగ సంబరాల్లో గొర్రె తల నరకడానికి బయలుదేరిన ఓ వ్యక్తి మద్యం మత్తులో క్షణికావేశానికి గురై వరుసకు తమ్ముడయ్యే యువకుడి మెడ నరికిన ఘటన చిత్తూరు జిల్లా వలసపల్లెలో ఆదివారం రాత్రి చోటుచేసుకుందని సాక్షి పత్రిక ఓ కథనం రాసింది.

మదనపల్లె రూరల్‌ సీఐ శ్రీనివాసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. వలసపల్లె గ్రామంలో జరిగే కనుమ ఉత్సవాల్లో అమ్మవారికి జంతు బలులు ఇచ్చేటప్పుడు తలారి చలపతి అనే వ్యక్తి గొర్రె తల నరకడం ఆనవాయితీ.

ఆదివారం రాత్రి గ్రామమంతా కనుమ సంబరాల్లో హడావుడిగా ఉంది. అమ్మవారికి బలిచ్చే గొర్రెను మేళతాళాల మధ్య గ్రామంలో ఊరేగింపుగా ఇంటింటికీ తీసుకెళ్లి పూజలు చేయిస్తూ నడివీధికి తీసుకురావడం ఆనవాయితీ.

ఈ క్రమంలో రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తలారి సురేష్‌ డప్పు వాయిద్యాలకు అనుగుణంగా డ్యాన్సులు వేస్తూ గొర్రె వెంట బయలుదేరాడు.

తలారి చలపతి చేతితో వేట కొడవలి పట్టుకుని గొర్రెతోపాటు నడుస్తుండగా రెండుమూడుసార్లు సురేష్‌ అతడిపై తూలిపడ్డాడు. ఆగ్రహించిన చలపతి అమ్మవారి గొర్రెకు చందాలు ఇచ్చే స్తోమత లేదు కానీ డ్యాన్సులు వేసేందుకు తక్కువ లేదంటూ విసుక్కున్నాడు.

ఈ క్రమంలో ఇద్దరిమధ్యా చిన్నపాటి గొడవ జరిగింది. చలపతి డప్పుల వారిని నిలిపేయాల్సిందిగా ఆదేశించడంతో తాను డ్యాన్సు వేయాల్సిందేనని సురేష్‌ పట్టుపట్టాడు.

దీంతో చలపతి ఆగ్రహానికి గురై చేతిలో ఉన్న వేట కొడవలితో సురేష్‌ మెడపై నరికాడు. సురేష్‌ను గ్రామస్తులు అంబులెన్స్‌లో మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

విపరీతమైన రక్తస్రావం కావడంతో అప్పటికే సురేష్‌ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి అన్న లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

తెలంగాణ సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలని మంత్రిమండలి నిర్ణయించినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక తెలిపింది.

ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధనతోపాటు ప్రైవేటు స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకుగాను కొత్త చట్టాన్ని తీసుకురావాలని తీర్మానించింది.

ఈ రెండు అంశాలపై పూర్తి అధ్యయనం చేసి, విధివిధానాలు రూపొందించేందుకు క్యాబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కేటీఆర్‌ తదితరులు సభ్యులుగా ఉంటారు.

ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశమైన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే తెలంగాణ గురుకులాలు అద్భుతమైన ఫలితాలు అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచాయని, గ్రామ స్థాయి నుంచి విద్యార్థులు గురుకులాల్లో చేరుతున్నారని క్యాబినెట్‌ అభిప్రాయపడింది.

గ్రామాల్లో ఇంగ్లిషు విద్యా బోధనకు డిమాండ్‌ పెరుగుతోందని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం అనివార్యత ఏర్పడిందని మంత్రివర్గం భావించింది.

గ్రామాల్లో ప్రభుత్వమే ఇంగ్లిషు మీడియంలో విద్యా బోధన చేపడితే స్థానిక పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు సంసిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడింది.

కోవిడ్

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఆంక్షలు ప్రారంభం

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిందని సాక్షి పత్రిక తెలిపింది.

రాత్రి కర్ఫ్యూ విధిస్తూ గతవారం ఉత్తర్వులు వెలువరించిన నేపథ్యంలో మంగళవారం (18వ తేదీ) నుంచి ఈ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఈ నెల 31 వరకూ ఇవి అమలులో ఉంటాయి. రోజూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 వరకు కర్ఫ్యూ ఉంటుంది.

కర్ఫ్యూ నుంచి ఆసుపత్రులు, మెడికల్‌ ల్యాబ్‌లు, ఫార్మసీ రంగాలతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా, టెలీ కమ్యూనికేషన్లు, ఇంటర్నెట్‌ సర్వీసులు, ప్రసార సేవలు, ఐటీ, ఐటీ సంబంధిత సేవలు, పెట్రోల్‌ బంకులు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్య సిబ్బందికి మినహాయింపు ఉంటుంది.

అదే విధంగా అత్యవసర విధుల్లో ఉండే న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది, స్థానిక సంస్థలకు చెందిన సిబ్బందిని కూడా ఈ ఆంక్షల నుంచి మినహాయించారు. అయితే.. వారు విధి నిర్వహణలో గుర్తింపు కార్డును చూపాల్సి ఉంటుంది.

వీరితో పాటు గర్భిణులు, చికిత్స పొందుతున్న పేషెంట్లు.. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల నుంచి రాకపోకలు కొనసాగించే వారు సంబంధిత ఆధారాలు, ప్రయాణ టికెట్లు చూపటం ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.

జిన్నా టవర్‌

గుంటూరులోని జిన్నా టవర్‌కు రక్షణ ఏర్పాట్లు

గుంటూరులోని జిన్నా టవర్ చుట్టూ అధికారులు రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారని ఈనాడు ఒక వార్త ప్రచురించింది.

జిన్నా టవర్ పేరు మార్చాలని, లేకపోతే కూల్చివేస్తామని ఇటీవల బీజేపీ నేతలు ప్రకటించారు. దీనిపై బీజేపీ నేతలు, అధికార పార్టీ నేతల మధ్య రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయి.

దీంతో గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు. గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు ఇటీవల అధికారులతో కలిసి జిన్నా టవర్‌ను సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా టవర్ వద్ద రక్షణ ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు.

ఆ మేరకు జిన్నా టవర్ చుట్టూ ఫెన్సింగ్ కోసం ఏర్పాట్లు మొదలు పెట్టారు. ప్రస్తుతం పిల్లర్లు పూర్తయ్యాయి. త్వరలోనే ముళ్ల కంచె ఏర్పాటు చేయనున్నారు. ఎవరూ టవర్ వద్దకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. టవర్ వద్ద నిఘా కోసం సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
‘Drunk beheads younger brother instead of lamb’
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X