జమ్మూ కాశ్మీర్‌లో అడుగు పెట్టిన అమిత్ షా..!!
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో ఇవ్వాళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ హేమంత్ లోహియా అనుమానాస్పద స్థితిలో మరణించారు. జమ్మూలోని తన నివాసంలో ఆయన నిర్జీవంగా కనిపించారు. హత్యకు గురైనట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంటి పనిమనిషి అజ్ఞాతంలోకి వెళ్లిన నేపథ్యంలో అతని కోసం గాలిస్తోన్నారు. అస్సాంకు చెందిన లోహియా 1992 బ్యాచ్ ఐఫీఎస్ అధికారి. ఈ ఏడాది ఆగస్టులో ఆయన జైళ్లశాఖ డీజీగా అపాయింట్ అయ్యారు.
ఈ పరిణామాల మధ్య కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్‌లో పర్యటిస్తోన్నారు. ఈ ఉదయం ఆయన దేశ రాజధాని ప్రత్యేక విమానంలో శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కాట్రా జిల్లా సాంఝీఛాట్ హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. జమ్మూ కాశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వైష్ణోదేవి ఆలయానికి వెళ్లారు.

మహార్నవమిని పురస్కరించుకుని ఆయన వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి వచ్చిన అమిత్ షా, మనోజ్ సిన్హా, జితేంద్ర సింగ్‌కు పాలక మండలి సభ్యులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయం గర్భగుడిలో అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి హారతి పట్టారు. శ్రీనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను అమిత్ షా ప్రారంభించాల్సి ఉంది. కొన్నింటికి శంకుస్థాపన చేస్తారు.

కాగా- ఇవ్వాళ ఆయన రాజౌరి, బారాముల్లా జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీనితో జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. అమిత్ షా పర్యటన కోసం బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు అధికారులు. ఇందులో భాగంగా డ్రోన్లను వినియోగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బహిరంగ సభ వేదిక చుట్టూ ఉన్న ప్రదేశాలలో పోలీసు, పారామిలిటరీలతో బందోబస్తు కల్పించారు.

దీనితో పాటు ర్యాలీ జరిగే ప్రదేశాలను ఇదివరకే భద్రత బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రత్యేక పాస్ ఉన్నవారికి మాత్రమే ఆయన బహిరంగ సభలోపాల్గొనడానికి అనుమతి ఇచ్చాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాయి. రాజౌరి జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను నియమించారు అధికారులు.












Click it and Unblock the Notifications